సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల రంగంతో విద్యా రంగాన్ని అనుసంధానం చేసేందుకు టీ వర్క్స్‌తో(T-Works) తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్త్రీ (FTCCI ) జత కట్టింది. విద్యార్థి దశలోనే పరిశ్రమల్లో పనితీరుపైన అవగాహన కల్పించేందుకు, అవసరమైన వారికి ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేసేందుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేసుకున్నాయి.
వస్తువుల తయారీ రంగానికి సంబంధించి కొత్త ఆలోచనలతో వచ్చే వారిని టీ వర్క్స్ ఇప్పటికే ఎంతో మందిని ప్రోత్సహిస్తోంది. తాజాగా పరిశ్రమల తరపున ఎఫ్‌టీసీసీఐ ముందుకు రావడం వల్ల పరిశ్రమలతో నేరుగా విద్యార్థులు కలిసి పనిచేసేందుకు, నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని టీ వర్క్స్ ప్రతినిధి తెలిపారు.