హైదరాబాద్: నగరంలోని గోల్నాకలో (Golnaka) ఈదురుగాలి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున వచ్చిన ఈదురుగాలుల ధాటికి గోల్నాకలోని కమలానగర్లో ఉన్న ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. అవి మరో రేకుల ఇంటిపై పడటంతో అందులో నిద్రిస్తున్న నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో వారిని దవాఖానకు తరలించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా ఈదురుగాలులతోపాటు భారీ వాన కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.