సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : భాగ్యనగరం వేదికగా ఈనెల 11వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫార్ములా ఈ రేసింగ్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2.8 కి.మీ. పరిధిలోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈనెల 5, 6 తేదీల్లో తాత్కాలికంగా, 7 నుంచి 12 వరకు పూర్తిగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మళ్లింపుల కారణంగా ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ చౌరస్తా, కట్టమైసమ్మ, ట్యాంక్‌బండ్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు గమనించాలని కోరారు.