అగ్రిమాపక వారోత్సవాలు ప్రారంభం
ప్రమాదాల నియంత్రణపై అవగాహన
ఈ నెల 20 వరకు వారోత్సవాలు
జనసమూహ ప్రాంతాల్లో మాక్‌డ్రిల్, ర్యాలీలు
కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 14 : అగ్నితో మంటలు చెలరేగడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో.. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంభవించే పెను ప్రమాదలను నివారించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ప్రతియేటా అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తుంటారు. నేటినుంచి ఈనెల 20 వరకు వారోత్సవాలను నిర్వహించేందుకు కూకట్పల్లి అగ్నిమాపక విభాగం అధికారులు సిద్ధమయ్యారు.
నివారణే లక్ష్యంగా అవగాహన..
అగ్ని ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారు. వారోత్సవాల్లో భాగంగా వారం రోజులపాటు ఆయా ప్రాంతంలో మాక్‌డ్రిల్‌ను నిర్వహించడం, అవగాహన ర్యాలీలు చేపడతారు. రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. దీనిలో భాగంగా అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో గురువారం నుంచి 20వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. శుక్రవారం (నేడు) సుజనా ఫోరంమాల్‌లో మాక్‌డ్రిల్, శనివారం రక్తదాన శిబిరం, బస్టాండ్లలో అవగాహన కార్యక్రమాలు, ఆదివారం రాందేవ్రావు వైద్యశాలలో మాక్‌డ్రిల్, సోమవారం ప్రధాన రహదారిపై ఫైర్ వాహనాలతో భారీగా అవగాహన ర్యాలీ, మంగళవారం మంజీరా మాల్లో మాక్‌డ్రిల్, బుధవారం 3కే, 5కే రన్ పోటీలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మెట్రో డిపోలో అవగాహన..
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం కూకట్పల్లి ఫైర్ స్టేషన్లో అసువులుబాసిన ఫైర్ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం మియాపూర్ మెట్రోస్టేషన్ డిపోలో పనిచేస్తున్న సిబ్బందికి అగ్నిమాదాలపై అవగాహన కల్పించారు. మాక్‌డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆస్తి, ప్రాణనష్టం తగ్గించే దిశగా చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు. మాక్‌డ్రిల్‌లో డీఎఫ్‌వో సుధాకర్‌రావు, ఎఫ్‌వో వై.కృష్ణారెడ్డి, ఫైర్ సిబ్బంది లచ్చిరెడ్డి, ఎం.వంశీకృష్ణ, నవాజ్‌రెడ్డి, శేఖర్ ఉన్నారు.
101కు ఫోన్ చేయాలి..
అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101కు ఫోన్ చేయాలి. అగ్ని ప్రమాదాలను నివారించే దిశగా వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు వివరిస్తున్నాం. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని మాక్‌డ్రిల్‌తో అవగాహన కల్పిస్తాం. అగ్ని ప్రమాదాలకు కారణమైన విద్యుత్ తీగలు, సిలిండర్లు, అగ్ని మిరుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్తలతోనే ప్రమాదాలను నివారించవచ్చు. అగ్ని ప్రమాదం జరిగి వెంటనే కచ్చితమైన చిరునామాతో సమాచారమివ్వాలి.
– వై.కృష్ణారెడ్డి, ఫైర్ ఆఫీసర్, కూకట్పల్లి