తెలంగాణ కళారూపాలకు ప్రపంచస్థాయి గుర్తింపు
ప్రతి కళాకారుడికి డిజిటల్ ఐడెంటిటీ కార్డు
అవకాశాలు, ఉపాధి పొందడమే లక్ష్యం
సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి కళకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తున్నది. కళాకారుల ప్రతిభను వెలికితీస్తూ.. ప్రభుత్వం వారికి ఉపాధినిస్తుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులకు అండగా నిలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ కళారూపాలను సాంకేతికత జోడిస్తున్నారు. కళాకారులకు డిజిటల్ గుర్తింపుకార్డులను అందిస్తున్నారు. కళాకారులు తమ వివరాలను ‘టీ-కల్చర్’ యాప్‌లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. మీ సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. కళా రూపం, ఆధార్ నెంబర్, ఆర్ట్‌కు సంబంధించిన ప్రశంసాపత్రం తదితర వివరాలతో నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే వేలాది మంది కళాకారులకు కార్డులు జారీ చేశారు. ఆసక్తి గల కళాకారులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని భాషా సాంస్కృతికశాఖ పిలుపునిస్తోంది.
తెలంగాణ కళారూపాలు ఇవే..
అకాడ, షహనాయ్, 12 మెట్ల కిన్నెర, 420 దీపాలు, అర్థనారీశ్వరం, బాలసంతులు అతాడి కళ, బైండ్ల కథ, బోనాలు, బుడబుక్కలు, బుడగజంగాలు, బుర్రకథ, చెక్క భజన, చిందు బాగోతం, చిరుతల కోలాటం, చిరుతల రామాయణం, దాడిబాత్, డప్పులు, థింసా, డోలు విన్యాసం, దొమ్మరాట, దుబ్బా, ఎరుకల సామి, ఫకీర్, ఫ్లూట్, గారడీ, గంగిరెద్దులు, గంటె బాగోతులు, గిటార్, గొల్ల సిద్ధులు, గురువయ్యలు, గుస్సాడీ, హరికథ, జాలరి నృత్యం, జడ కోలాటం, జగ్గు డప్పులు, జంగం దేవర, జాజ్, కోటిపడగలు, కత్తుల నృత్యం, కిరికిరి, కోలాటం, కొమ్ము బూరలు, కొమ్ముకోయలు, లంబాడి బిందెల నృత్యం, మృదంగం, ఒగ్గుకథ, ఒగ్గు డోలు, పగటి వేషాలు, పెద్దమ్మలొల్లు, పులి వేషాలు, శివ సుద్దులు, యక్షగానం, చెక్క బొమ్మలాట, బహుపాత్రభినయం, పేర్ని శివతాండవం, సాధనశూరులు తదితర కళా రూపాలకు చెందిన కళాకారులందరికి డిజిటల్ ఐడీకార్డుల ప్రక్రియ కొనసాగుతుంది.
కళాకారుల గుర్తింపు కోసమే..
భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులకు డిజిటల్ ఐడెంటిటీ కార్డులు రూపొందిస్తున్నాం. కళాకారులు తమ వివరాలు టీకల్చర్ యాప్‌లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఆ వివరాలను పరిశీలించి భాషా సాంస్కృతిక శాఖ ఆమోదించాక సంబంధిత వ్యక్తి వివరాలతో ఐడీ కార్డు లింక్ పంపిస్తాం. డౌన్లోడ్ చేసుకోవచ్చు. కళారూపాల కోసం ఏమైనా అవకాశాలు ఉన్నప్పుడు రిజిస్టర్ అయిన వ్యక్తులకు తెలుస్తుంది. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్న ఐడీ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
– సందీప్ మక్తాల, టీటా ప్రెసిడెంట్