సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఓ కార్యాలయాల్లో సీజ్డ్ వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. అధికారులు టార్గెట్ ఛేదనలో భాగంగా నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో చాలా వాహనాలు పరిమితికి మించి బరువు, పన్ను ఎగవేత, ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, తదితర నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలతో సీజ్ అవుతున్నాయి. అయితే ఈ వాహనాలను మళ్లీ విడుదల చేసుకోవడంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనానికి సంబంధించిన చిరునామా ఆధారంగా ఆర్టీఓ కార్యాలయంలో సంబంధిత వాహన ట్యాక్స్ లు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది.
సదరు అధికారి రాసిన చెక్ రిపోర్ట్ ఆధారంగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల పత్రాలు అన్నీ సరిచూసుకొని అధికారులు వాహన విడుదలకు అనుమతినివ్వాలి. ఆ అనుమతి పత్రాన్ని ఏ ఆర్టీఓ కార్యాలయ పరిధిలో వాహనం సీజ్ అయిందో అక్కడికి వెళ్లి అందించాలి. అప్పుడు సదరు అధికారులు ఆ వాహనాన్ని విడుదల చేస్తారు. కానీ ఈ ప్రక్రియ నగరంలోని పలు కార్యాలయాల్లో నత్తనడకన సాగుతోంది. వాహనానికి సంబంధించిన జరిమానాలు చెల్లించాక కూడా సదరు వాహనం విడుదలలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. నెల, రెండు మిగతా నెలల పరిమితి పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వాహనంపైనే వ్యాపారం ఆధారపడి ఉం డటంతో ఆర్థికంగానూ నష్టపోతున్నామని చెబుతున్నారు.
గతంలో ఇలాంటి వ్యవహారంపై పోలీసులు లేదా ఆర్టీఓ అధికారులు సీజ్ చేసిన వాహనాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నదనే ప్రధాన అంశంతో దాఖలైన 50కి పైగా కేసులను అప్పటి జస్టిస్ నవీన్ రావు నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ప్రత్యేక ఆదేశాలు సైతం జారీ చేసింది. పరిమితికి మించి బరువు, నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలతో సీజ్ చేసిన వాహనాల విడుదల విషయంలో ట్రాన్స్పోర్ట్ అథారిటీ సెక్రటరీ లేదా సంబంధిత అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
కాగా, గ్రేటర్ వ్యాప్తం గా ఆర్టీఓ కార్యాలయాల్లో సీజ్డ్ వాహనాలు వందల సంఖ్యలో పేరుకుపోతున్నాయి. కొన్ని వాహనాలను వాహనదారులు తీసుకోవడానికి ముందుకురావడం లేదు. అలాంటి కాలపరిమితి మించిన వాహనాలను అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి వేలం వేస్తున్నారు. వేలంలో దక్కించుకున్నవారి పేరుమీద వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే సీజ్డ్ వాహనాల విడుదల ప్రక్రియను సులభంగా చేస్తే వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఆ మేరకు సాంకేతిక సేవల్లో మార్పులు తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.