సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కోర్ సిటీలో విలువైన భూములను కనుమరుగు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాలపై ఏమాత్రం అంచనా లేకుండా, కోట్లు విలువ చేసే ఆస్తులుగా తీర్చిదిద్దాల్సింది పోయి.. వేలానికి పెట్టి సొమ్ము చేసుకుంటుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఖాళీ జాగాలను విక్రయించినప్పుడు విమర్శలు చేసింది. కానీ అధికారంలోకి రాగానే కోర్ సిటీలో ఉన్న విలువైన భూములను పొతం పట్టిస్తుంది. కోర్ సిటీలోని భూములను క్రమంగా కరిగిస్తున్న సర్కారు.. తాజాగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరోసారి విలువైన భూములను అంగడి సరుకు చేసింది.
భూముల వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడమే తప్ప.. మౌలిక వసతులు కల్పించి, ఆదాయ మార్గాలను అన్వేషించడం మరిచిన కాంగ్రెస్ సర్కారు.. రెండేళ్లలో 1500 ఎకరాలకుపైగా ఆస్తులను విక్రయించింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే ఇప్పటివరకు 6 పర్యాయాలు భూములను విక్రయించగా.. ఇందులో సగానికిపైగా కోర్ సిటీలో ఉండే ఖాళీ జాగాలు మాత్రమే. తాజాగా రూ.3వేల కోట్లు రాబడి లక్ష్యంగా ఖాళీ జాగాలను బేరానికి పెట్టింది. వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న భూముల వేలం జరగనుంది. నాలుగు దశల్లో జరిగే ఈ విషయంలో మోకీల, ఇన్ముల్ నర్వ, హైదర్ నగర్, నియోపోలీస్, సరూర్ నగర్, గోల్డెన్ మైల్ ప్రాజెక్టులలో ఉన్న ప్లాట్లు, ల్యాండ్ పార్శిళ్లను విక్రయించనుంది. ఇప్పటికే ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహిస్తుండగా ధరలను కూడా ఖరారు చేసింది.
కీలక ప్రాంతాల్లో భూములు కల్లాస్..
తాజాగా వేలం పెట్టిన వాటిలో కీలక ప్రాంతాలే ఉన్నాయి. శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులకే అనువైన ప్రాంతాలే ఉన్నాయి. ఇందులో సరూర్ నగర్ కోర్టు ప్రాంగణంలో ఉన్న 4,356 గజాలు, సూరారంలోని 4,840 గజాలు, నార్సింగిలోని 2,420 గజాలు, బైరాగిగూడలో 2,420 గజాలు, హైదర్‌నగర్‌లోని 0.70 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. కోకాపేట్ నియోపోలిస్ వెంచర్‌లోని 4.59ఎకరాల విస్తీర్ణంలోని ఒక ప్లాట్‌ను బేరానికి పెట్టింది. వీటి ద్వారా సర్కారు ఏకంగా 2వేల కోట్ల రూపాయల అంచనాకు సిద్ధం అవుతుండగా.. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియతో నగరంలో కీలక భూములు కనుమరుగు కానున్నాయి.