సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో చలి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే చలి పెరిగిపోగా, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. చలికాలంలో చర్మ రక్షణతో పాటు తీసుకునే ఆహారం వరకు ప్రతీది అత్యంత కీలకమే. దీంతో శరీరానికి వెచ్చని అనుభూతినిచ్చే దుస్తులను ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వస్త్రమే ఆయుధం..!
చలి నుంచి రక్షించుకోవడానికి అందరికి ఒకే ఒక్క ఆయుధం.. వెచ్చని వస్త్రం. ఈ అనుభూతినందించే దుస్తులు ఇప్పుడు మార్కెట్లో కొలువుదీరాయి. ఉలెన్, హుడ్ జాకెట్లు అమ్మాయిలు, అబ్బాయిలను ఆకట్టుకుంటున్నాయని డిజైనర్ కీర్తన తెలిపారు. పాత, కొత్త కలయికతో ఇంట్లో చాలా కాలంగా వృథాగా ఉన్న వస్ర్తాలకు మెరుపులు అద్దొచ్చని వివరించారు.
వ్యాయామం తప్పనిసరి..!
చాలా మంది చలికాలం వచ్చిందంటే చాలు.. వ్యాయామానికి స్వస్తి చెప్పి దుప్పట్లో దూరిపోతారు. కానీ ఈ సీజన్లో వ్యాయామం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. రోజంతా హుషారుగా ఉండాలంటే అది వ్యాయామంతోనే సాధ్యం. కనీసం 20నిమిషాలు వ్యాయామం చేయాలని చెబుతున్నారు.
వెంట్రుకలకు రంగులు వేయవద్దు..!
చలికాలంలో వెంట్రుకలకు రంగులు ఉపయోగించడం వల్ల కురులు పొడిగా మారే ప్రమాదం ఉంది. అలర్జీకి కారణం అవుతాయి. చర్మంపై దద్దుర్లకుదారితీస్తాయి. ఈ తరహా ప్రయోగాలను వాయిదా వేయడం ఉత్తమమైనది. తలస్నానం రెండు, మూడురోజులకోసారి చేస్తే సరిపోతుంది. చలికి బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టినప్పుడు తల వెంట్రుకలను స్కార్ప్, కర్చీఫ్‌తో కప్పుకోవాలి. దీని వల్ల కాలుష్యం, బయట దుమ్ము, ధూళి నుంచి కాపాడుకోవచ్చు.
ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి
చలికాలంలో సహజంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు త్వరగా దాడి చేస్తుంటాయి. ఆహారం అరుగుదల తక్కువ. వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్లు, చేపలు శరీరానికి తప్పక అవసరం. వేడిగా ఎప్పటికప్పుడు వండిన వంటలే ఉత్తమం. ప్రస్తుతం దొరికే బ్లాక్ ద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటిపండ్లు మంచివి.
– సనా ఫాతిమా, పోషకాహార నిపుణులు
వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది
చర్మం పగిలిపోవడం, నల్లబడటం చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికి చర్మం ఎక్స్పోజ్ అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారు, పెద్దలు ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది.
– డాక్టర్ నవజన్
పిల్లల విషయంలో జరభద్రం
చాలా మంది పిల్లలు సాయంత్రం ఆటలాడటానికి బయటకెళ్తారు. అయితే చలి ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇబ్బందులు వారికి తొందరగా అందుకుంటాయి. ఈ సీజన్లో చీకటి పడే వరకు పిల్లలను ఖాళీ స్థలాల్లో ఆడిపించకపోవడమే మంచిది. వృద్ధులు చలి అధికంగా ఉంటే బయటకు వెళ్లకూడదు. అంటు వ్యాధులు సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది. పిల్లలను స్కూల్‌కు పంపించేటప్పుడు అన్ని దుస్తులు, షూ, చేతికి గ్లౌజ్‌లు, కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయడం వంటి జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్లు, పరిశుభ్రమైన ఆహారం అందివ్వాలి.
– డాక్టర్ మాదవి,పిడియాట్రిక్