హైడ్రా మాన్సూన్ టెండర్లలో మెహదీపట్నం సర్కిల్‌కు సంబంధించి ఇచ్చిన టెండర్ లభించిన వ్యక్తికి నాలుగు వాహనాలు పెట్టాల్సిందిగా టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి కేవలం రెండు వాహనాలకు మాత్రమే పూర్తిస్థాయి పత్రాలు పెట్టి మిగతారెండు వాహనాలకు సరిగ్గా పత్రాలు పెట్టలేదు. ఆ రెండు వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ టైమ్ అయిపోవడమేకాకుండా పొల్యూషన్ కూడా తీసుకోకపోవడం గమనార్హం.
సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ) సంతోష్‌నగర్‌కు చెందిన టెండర్ దారు ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఐటీఆర్‌లు సమర్పించాలని టెండర్ నియమనిబంధనల్లో పేర్కొనగా టెండర్ దక్కించుకున్న వ్యక్తి మాత్రం 2 సంవత్సరాలకు సంబంధించిన ఐటీఆర్‌లు మాత్రమే సమర్పించినట్లు తెలుస్తోంది. హైడ్రా నుంచి ఈ టెండర్లలో ఎక్కువ మొత్తంలో పనులు సాధించుకున్న ఏజెన్సీకి అర్హతలు లేకున్నా చాలా పెద్ద మొత్తంలో పనులు అప్పగించారు. ఆ ఏజెన్సీ చూపించిన ఆదాయ లెక్కలే తప్పుడువి అంటూ ఆరోపణలు ఉండగా వారికి అంతకంటే ఎక్కువ మొత్తంలో అంటే సుమారు 9కోట్ల విలువైన 7 పనులు అప్పగించినట్లు తెలిసింది.
ఏజెన్సీ సమర్పించిన అసెస్మెంట్ సర్టిఫికెట్లో గత సంవత్సరం తన టర్నోవర్ 1.30కోట్లు ఉండగా.. ఈ సంవత్సరం ఒకేసారి రూ.6కోట్ల వరకు పెరగడంపై అనుమానాలకు తావిస్తోంది. ఇలా చెప్పుకొంటూ పోతే హైడ్రా కేటాయించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టెండర్లలో గోల్మాల్ జరిగిందని తేటతెల్లమవుతోంది. టెండర్ నిబంధనలను పాటించకుండా సరైన సర్టిఫికెట్లు సమర్పించని ఏజెన్సీలకు, వ్యక్తులకు అంటే తమకు నచ్చిన వారికి హైడ్రా టెండర్లు కేటాయించిందంటూ.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెండర్లపై దృష్టిపెట్టి లోపాలను సరిదిద్దాల్సిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం తన వద్దకు వచ్చి లోపాలను గురించిన చెప్పిన వారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఒక్కొక్క ఏజెన్సీకి ఐదారు పనులు..!
హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు సంబంధించిన టెండర్ల గొడవ తారాస్థాయికి చేరుతోంది. ఈ టెండర్లలో హైడ్రా అధికారులు అవకతవకలకు పాల్పడ్డారంటూ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈ వర్షాకాలంలో ఎంఈటీ వెహికల్ అండ్ లేబర్ సమకూర్చుకోవడం కోసం సర్కిళ్ల వారీగా రూ.65 కోట్ల విలువైన 62 టెండర్లను పిలిచింది. ఇందులో 44 టెండర్లను తెరిచామని, నాలుగు అర్హత సాధించలేదని హైడ్రా తెలిపింది. మిగిలిన 40 టెండర్లలో 18మంది అర్హత సాధించగా మరో 22 డరఖాస్తులను పరిశీలించి ఖరారు చేస్తామన్నారు.
ఖరారైన టెండర్లలో ఆ నాలుగు ఏజెన్సీలకు ఒక్కొక్కరికీ ఆరు నుంచి ఏడు పనులను అప్పగించడం వి వాదాస్పదమైంది. వీరిలో అర్హతలు కలిగినవా రు ఎంతమంది, ఒకవేళ వారికి అన్ని పనులు ఒకేసారి అప్పగిస్తే వారు చేయగలరా లేదా అనే ది పరిశీలించకుం డా కనీసం వారి దగ్గర అంతమంది లేబర్ ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేయకుండా తమకు నచ్చినది చేశా రు కాబట్టే వారికి టెండ ర్లు కేటాయించామం టూ.. బహిరంగంగానే అధికారులు కాంట్రాక్టర్లకు చెప్ప డం చర్చనీయాంశమైంది. ఇందులో మరో ఆసక్తికరమైన అంశం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తమకు నచ్చిన టెండర్‌దారులను పక్కన పెట్టుకుని అధికారులు టెం డర్లు ఓపెన్ చేసినట్లుగా టెండర్ ఓపెన్ టైమింగ్స్ చెబుతున్నాయి. హైడ్రా టెండర్లలో అధిక శాతం ఆ నలుగురికే దక్కడం వెనక మతలబేమిటంటూ కాంట్రాక్టర్ల మధ్య చర్చ జరుగుతోంది.
వారికే దక్కడం వెనక మతలబేంటి..!
ఆ నలుగురికే టెండర్లలో అధికభాగం దక్క డం వెనక మతలబు ఇదేనంటూ కాంట్రాక్టర్లు గుసగుసలాడుకుంటున్నారు. హైడ్రా ఈ టెండర్లను ఖరారు చేయడానికి హైడ్రా అడిషనల్ కమిషనర్ సుదర్శన్‌తో పాటు మూడు కార్పొరేషన్ల నుంచి ముగ్గురు ఇంజనీర్లను,ఒక ఎస్ఈ, ఒక ఏఈ, ఒక డీఈతో పాటు ఇద్దరు అధికారు లు మొత్తం తొమ్మిదిమందితో కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఒక డిప్యూటీ అధికారి కాం ట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క టెండర్ విలువపై 14 శాతం కమిషన్ తీసుకుని టెండర్లు కేటాయించినట్లుగా కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
టెండర్ల సమయంలోనే ఆ డీఈ నేరుగా 20శాతం అడిగితే తాము ఇవ్వలేమన్నందుకు ఆ పర్సంటేజీని 14 శాతానికి తగ్గించి ఆ మొత్తం ఇచ్చే వారికే టెండర్లు కేటాయించారంటూ చెబుతున్నారు. సరైన పత్రాలు ఉన్నా లేకున్నా టెండర్లు కేటాయించారని, అది కూడా ఒక ఏజెన్సీ నిర్వాహకుడే ఈ మొ త్తం వ్యవహారాన్ని చక్కబెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ నలుగురు రింగ్ అయి ఒకరు వేసిన టెండర్‌కు మరొకరు వేయకుండా మొత్తం పనులను దక్కించుకున్నారని, హైడ్రా అత్యధిక పనులు వీరికే దక్కాయంటే ఇది మొత్తం అధికారులతో కలిసి జరిగిన వ్యవహారమేనంటూ చర్చ జరుగుతోంది.
వరద ముప్పు తప్పిస్తారా..!
హైడ్రా కేటాయించిన టెండర్లు దక్కించుకున్నవారి వద్ద వాహనాలు ఉన్నప్పటికీ లేబర్ ఉన్నారా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. వార్డుల వారీగా ప్రతీ ఎంఈటీ టీమ్‌లో ఐదుగురు ఉండాలని ఒక డ్రైవర్‌తో పాటు నలుగురు ఉండాలని కానీ గత సంవత్సరం అలా కాకుండా నలుగురితోనే నడిపించారని, షిఫ్ట్‌లవారీగా లేబర్ కూడా వేర్వేరుగా ఉండాల్సింది పోయి ఒకరినే రెండు లేదా మూడు షిఫ్ట్‌ల్లో నడిపించడంతో పనులలో లోపాలు తలెత్తుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేబర్ పరంగా వందలాది మంది అవసరం కాగా ఒకే షిఫ్ట్‌లో పనిచేసే వారిని మూడుషిఫ్ట్ల్లో అమర్చడం, వారిలో కొందరు ఉన్నా లేకున్నా నడిపించడంతో గత సంవత్సరం వరదల సమయంలో చాలామంది లేబర్ లేక సమస్యలు తలెత్తాయి.
ఈసారి కూడా టెండర్ దారులతో అధికారులు కుమ్మక్కై వారిచ్చిన సొమ్ములకు ఆశపడి వారు సరైన వ్యవహారం నడపకున్నా వారికే టెండర్లు కేటాయించడంపై మున్సిపల్ ఇంజినీర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గతం కంటే మెరుగ్గా చేస్తామంటూ హైడ్రా ఈ వ్యవహారాన్ని చేతికి తీసుకున్నప్పటికీ అధికారుల్లో కొందరు కమీషన్లకు కక్కుర్తి పడి మొత్తం ఎంఈటీ వ్యవస్థనే దెబ్బతినేలా చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, అధికారులకు టెండర్ల విషయం అప్పగించానని వారే అన్నీ చూసుకుంటారని చెప్పడం గమనార్హం. వర్షాకాలం ప్రారంభమై రెండు వర్షాలకే నగరం అతలాకుతలమైన ఈ సందర్భంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు సంబంధించిన టెండర్లను సక్రమంగా ఖరారు చేసి వారి పనితీరుపై నిరంతర నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.