డిస్కంపై ఇంటెలిజెన్స్ నిఘా!
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఏసీబీ దాడులు, మరోవైపు విజిలెన్స్ విచారణలు, కొన్ని సందర్భాల్లో ఉద్యోగ సంఘాల ఆందోళనలు, వీటన్నింటికీ తోడు విద్యుత్ కనెక్షన్లు, మీటర్ల మంజూరు, ఇతర పనుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు సంస్థ ప్రతిష్టను ప్రశ్నార్ధకంగా మార్చాయి
-
బదిలీల్లో డబ్బుల లావాదేవీలపై ఆరా
-
కాంట్రాక్టుల్లో కీలక వ్యక్తులవాటాలపై సమాచార సేకరణ
-
15 రోజులుగా డిస్కం ప్రధాన కార్యాలయంలో నిఘా వర్గాలు
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఏసీబీ దాడులు, మరోవైపు విజిలెన్స్ విచారణలు, కొన్ని సందర్భాల్లో ఉద్యోగ సంఘాల ఆందోళనలు, వీటన్నింటికీ తోడు విద్యుత్ కనెక్షన్లు, మీటర్ల మంజూరు, ఇతర పనుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు సంస్థ ప్రతిష్టను ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఈ నేపథ్యంలో ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న పరిణామాలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు సమాచారం. కార్పొరేట్ కార్యాలయంలో నిర్ణయాలు, అధికారుల వ్యవహారశైలి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, ఉద్యోగుల్లో నెలకొన్న అవినీతి తదితర అంశాలపై చర్చ జరుగుతోంది.
సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)అధికారులపై అవినీతి ఆరోపణలు, కోట్ల రూపాయల కాంట్రాక్టుల నిర్వహణ, ఉన్నతాధికారుల నిర్ణయాలపై ప్రభుత్వ నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. గత పదిహేను రోజులుగా మింట్‌కాంపౌండ్‌లో డిస్కం ప్రధాన కార్యాలయంలోని రెండు బ్లాకుల్లో అన్ని అంతస్తుల్లో కొందరు మఫ్టీలో ఉన్న పోలీసులు ఉద్యోగులను కొన్ని అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఎస్పీడీసీఎల్లో ఉద్యోగుల బదిలీలు మొదలుకొని విజిలెన్స్ విచారణల వరకు పలు అంశాలు సంస్థకు సవాల్‌గా మారాయి. ఈ సంవత్సరం మొదట్లో బదిలీల వ్యవహారాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తి వేసిన తర్వాత సంస్థ సీఎండీగా జితేశ్ పాటిల్ బాధ్యతలు స్వీకరించాక ప్రత్యేక అనుమతి తీసుకుని ఇంజినీర్ల బదిలీలు చేశారు. ఈ బదిలీలపై అప్పట్లో దుమారం చెలరేగింది. ఆ తర్వాత పది నెలలుగా సుమారు రెండు వందలకు పైగా ఉద్యోగుల బదిలీలు జరిగాయి.
ప్రత్యేక పరిస్థితులు, అత్యవసరాల కోసం చేయాల్సిన బదిలీలు కాకుండా సంస్థలో ఒకరిద్దరు ముఖ్యుల వ్యక్తిగత స్వార్థ్ధంతో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ప్రతీసారి బదిలీలు జరిగినప్పుడు చర్చ జరుగుతోంది. సంస్థలో జరుగుతున్న బదిలీల విషయంలో ఒకే ఆర్డర్ కాకుండా ఉద్యోగుల వ్యక్తిగత ఆర్డర్లు ఇవ్వడంతో ఇంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. నగరంలోని మెట్రోజోన్ నుంచి రంగారెడ్డి జోన్‌కు ఇటీవల జరిగిన ఒక ఏఈ ట్రాన్స్ఫర్ బదిలీతో పాటు అదే సమయంలో పలు సర్కిళ్లలో జరిగిన ఏఈలు, ఏడీఈల బదిలీలపై లక్షలు చేతులు మారాయని, ఫోకల్ టు ఫోకల్ బదిలీచేయొద్దంటూ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రధానమైన సెక్షన్ నుంచి నగరశివారులోని కాసుల పంట పండే మరో సెక్షన్‌కు బదిలీ చేశారు.
ఇలా ఈ ధ్యకాలంలోనే సుమారు 50కి పైగా బదిలీలు జరిగాయని, వీటన్నింటిలో డిస్కం కీలక అధికారితో పాటు మరో కీలకస్థానంలో ఉన్న వ్యక్తి చక్రం తిప్పినట్లు చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ బదిలీల వ్యవహారంలో తమ పాత్ర ఏం లేదంటూ.. ఆ విభాగానికి సంబంధించిన డైరెక్టర్ సెలవుపై వెళ్లగా, అదే విభాగంలో ఎప్పటికప్పుడు డైరెక్టర్‌ను సంప్రదించకుండానే మరొక డైరెక్టర్‌తో సంబంధం కలిగి ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టిన చీఫ్ అధికారి తాను బదిలీల్లో ప్రమేయం ఉన్నా లేనట్లుగా చూపించుకోవడానికి ఉన్నతాధికారి సూచనల మేరకు సెలవులో వెళ్లారని డిస్కంలో గుసగుసలు న్నాయి. బదిలీల్లో ఒక్కొక్క పోస్టుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయంటూ ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై రిపోర్టులు తయారు చేసి ఇవ్వాల్సిన సంస్థాపరమైన నిఘావిభాగంలో కొందరు అధికారులు కూడా క్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఈ బదిలీల వ్యవహారంలో ఏమేం వకతవకలు జరిగాయని గత మార్చ్ నుంచి ఇప్పటివరకు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
కాంట్రాక్టుల్లో భాగమెవరిది..?
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్పీడీసీఎల్ పంపిణీ వ్యాపారానికి సంబంధించి రూ.7508కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రతిపాదించింది. అందులో గతంలో ఆమోదించిన పనులతో పాటు అదనపు అవసరాలు కూడా ఉన్నాయంటూ సంస్థ ఈఆర్సీకి ఇచ్చిన వివరాల్లో పేర్కొంది. అండర్‌గ్రౌండ్ కేబులింగ్, స్కాడా విస్తరణ, ఆటోమేషన్, కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి. ఇంత భారీ మొత్తంలో పనులు చేపట్టాల్సి వచ్చినప్పుడు టెండర్ల నిర్వహణే కీలకంగా మారుతుంది. ఇప్పటికే అండర్‌గ్రౌండ్ కేబులింగ్లో మొదట ప్రతిపాదించినదానికి తర్వాత సవరణలతో మరో ప్రతిపాదన తీసుకొచ్చి ఆమోదింపజేసుకున్నారు.
ఆ తర్వాత కేబుల్ టెండర్లకు ఐదు నుంచి ఆరు కంపెనీలు వచ్చాయని, వీటికి సంబంధించి ఎవల్యూయేషన్ చేసేందుకు ఇప్పటివరకు నెమ్మదిగా వ్యవహారం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఎవాల్యూయేషన్ విషయంలో సదరు విభాగానికి సంబంధించిన ఉద్యోగులను రాత్రి వరకు ఆఫీసులోనే ఉంచి తన చాంబర్లోనే ఉంచుతున్న ఒక డైరెక్టర్ పూర్తి రహస్యంగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారంటూ డిస్కంలో చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ఎమర్జెన్సీ పనులంటూ సీఎండీతో నామినేషన్ కింద అనుమతులు తీసుకుని కోట్ల రూపాయల పనులను తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి తన వాటా తాను తీసుకుంటున్నట్లు ఆ కీలక వ్యక్తిపై ఆరోపణలు వస్తున్నాయి.
ఒకటి రెండు కాదు.. మొత్తం డిస్కంలో జరుగుతున్న పలు పనులకు సంబంధించిన వ్యవహారాల్లో తనకు సంబంధం లేకున్నా ఆయా విభాగాల డైరెక్టర్లను డమ్మీలను చేసి తానే మొత్తం నడుపుతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు నిఘా విభాగం అధికారులు కాంట్రాక్టుల్లో ఏం జరుగుతుందంటూ ఆరా తీశారు. వారు కార్యాలయ సమీపంలో ఉండగానే బీ బ్లాక్‌లో ఒక డైరెక్టర్ చాంబర్ వద్ద రాత్రి వరకు ఉద్యోగులు ఉండడం, వారు బయటకు వెళ్లే సందర్భంలో నిఘా అధికారులు ఆరా తీస్తే యూజీ పనులలో బిజీగా ఉన్నామని చెప్పడం గమనార్హం.
కొన్ని పరికరాల కొనుగోళ్లు, దసరా కానుకల కోసం కాంట్రాక్టర్ల నుంచి డబ్బుల వసూళ్లు.. ఇవన్నీ నిఘా లెక్కలోకి వస్తున్నట్లు ఒక ప్రత్యేక అధికారి చెప్పారు. తాము డిస్కంలో పరిశీలించి సేకరించిన అంశాలు, ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు తదితర వివరాలతో ఇంటెలిజెన్స్ అధికారులు సమగ్రంగా నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

