హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ బోధనాసుపత్రులకు సర్జికల్స్, ఇంప్లాంట్స్, ప్రాణాధార మందులు, డయాగ్నొస్టిక్ కిట్లను సరఫరా చేసిన తమకు వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధులు లేఖ రాశారు. 2024 సెప్టెంబర్ నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ టీచింగ్ ఆసుపత్రులకు ఎలాంటి బడ్జెట్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.600 కోట్లు బకాయిలు ఉండగా.. హైదరాబాద్ పరిధిలో రూ.250 కోట్లు బకాయిలు ఉన్నట్టు వెల్లడించారు.
ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు సర్జికల్స్, డ్రగ్స్, డయాగ్నోస్టిక్స్ సరఫరా చేసిన సప్లయర్లకు రూ.100 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని వివరించారు. గత రెండేండ్లుగా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేస్తుదంటూ ప్రచారం జరుగుతున్న వేళ అసలు ప్రభుత్వం ఈ స్కీమ్‌ను కొనసాగిస్తుందా..? లేదా..? స్పష్టత ఇవ్వాలని లేఖలో అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.