సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 09, 2020 , 04:20:15

ఆదాయంలో ‘గ్రేటరే’..

ఆదాయంలో  ‘గ్రేటరే’..
  • రాష్ర్టానికి ఆదాయం సమకూర్చడంలో పెద్దన్న పాత్ర
  • మూడు జిల్లాల నుంచే అత్యధిక జీఎస్‌డీపీ రాబడి.. సోషియో ఎకనామిక్‌ సర్వేలో వెల్లడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాష్ర్టానికి ఆదాయం సమకూర్చడంలో గ్రేటర్‌ జిల్లాలే పెద్దన్నపాత్రను పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల కంటే అత్యధిక ఆదాయాన్ని ఈ మూడు జిల్లాలో సమకూరుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పాదక రంగం ద్వారా అత్యధిక ఉత్పత్తిని, ఆదాయాన్ని ఈ మూడు జిల్లాలే సమకూరుస్తున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) గ్రేటర్‌ జిల్లాలే ముందంజలో ఉన్నట్లుగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్‌ అవుట్‌లుక్‌-2020 నివేదిక పేర్కొన్నది. ఈ నివేదికలో గల  గ్రాస్‌ డిస్ట్రిక్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌- 2018 -19లో పేర్కొన్న వివరాలను ద్వారా ఉత్పాదక రంగం ద్వారా రాష్ర్టానికి సమకూరుతున్న ఆదాయంలో ఈ మూడు జిల్లాలదే ముఖ్యపాత్ర అని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. రంగారెడ్డి జిల్లా నుంచి 1,73,143 కోట్లు, హైదరాబాద్‌ జిల్లాలో రూ.1, 67, 231కోట్లు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో రూ. 66, 156 కోట్ల ఆదాయం ఉత్పత్తి రంగం నుంచి సమకూరుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


తలసరి ఆదాయంలో..

తలసరి ఆదాయంలోనూ గ్రేటర్‌ జిల్లాలే నెంబర్‌వన్‌గా ఉన్నాయి. జిల్లాల వారిగా తీసుకుంటే తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ. 5,78,978తో మొదటిస్థానంలో ఉండగా, హైదరాబాద్‌ జిల్లా రూ. 3,57,287తో రెండో స్థానం, మేడ్చల్‌ -మల్కాజిగిరి జిల్లా  రూ. 2,21,025 తలసరి ఆదాయంతో మూడోస్థానంలో ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా తీసుకుంటే సగటు తలసరి ఆదాయం రూ. 2,04,488  ఉండగా, ఈ మూడు జిల్లాల్లో అంతకు మించి నమోదుకావడం గమనార్హం.  


ఫార్మా రాజధానిగా..

600 పైచిలుకు ఫార్మా కంపెనీలతో హైదరాబాద్‌ ఫార్మా రాజధానిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌)లో ఫార్మారంగ వాటా యే అత్యధికంగా ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14,252 కోట్లను జీవీఏగా ఔషధతయారీ రంగం  సమకూర్చింది. పారిశ్రామికంగా సమకూరుస్తున్న జీవీఏలో దాదాగా 32 శాతం జీవీఏ ఒక్క ఫార్మారంగం నుంచే సమకూరడం గమనార్హం. మొత్తం యూ నిట్లతో తీసుకుంటే కేవలం 4.3 శాతం యూనిట్ల నుంచే ఇంత మొత్తంలో జీవీఏ రావడం గమనార్హం. ఇక దేశం మొత్తంగా తీసుకుంటే 50 బిలియన్‌ డాలర్లు, 35 శాతం ఫార్మా ఉత్పత్తులు ఒక్క హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. అంతేకాకుండా 200 కంపెనీలతో జినోమ్‌వ్యాలీ దేశంలోనే అతిపెద్ద బయోక్లస్టర్‌గా ప్రసిద్ధిగాంచింది.


ఔషధ పరిశ్రమ విస్తరణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా పార్కు ఏర్పాటుకు హైదరాబాద్‌ ఫార్మాసిటీకి ప్రభుత్వం అంకురార్పణచేసింది. రూ. 64వేల కోట్ల పెట్టుబడులకు వీలుగా 19,330 ఎకరాల విస్తీర్ణంలో 4.20 లక్షల మంది ఉపాధి కల్పించేందుకు సంకల్పించింది. 

గ్రేటర్‌ శివారులోని సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ను ప్రభుత్వం అభివృద్ధిచేసింది. రూ. వెయ్యికోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేయగా పలు కంపెనీల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి.ఎలక్ట్రానిక్స్‌లో రారాజు..


సెల్‌ఫోన్లు సహా పలు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్‌ రారాజుగా వెలుగొందుతున్నది. గ్రేటర్‌తో పాటు శివారుల్లో గల 250 కంపెనీలు 50వేల మందికి ఉపాధినిస్తున్నాయి. అంతేకాదు దేశీయంగా 6 శాతం ఉత్పత్తుల వాటాను పంచుకుంటున్నాయి. ఈ పరిశ్రమను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం మహేశ్వరం సమీపంలోని రావిర్యాలలో 912 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ సెజ్‌ను ఏర్పాటు చేసింది. ఎన్‌వీడియో మెటరోలా, క్వాల్కమ్‌, ఏఎండీ, సీడీఏసీ తదితర కంపెనీలు గ్రేటర్‌లో  పరిశ్రమలను నెలకొల్పాయి. ఆపిల్‌, మైక్రోమ్యాక్స్‌ తదితర కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం గమనార్హం.


ఆటోమోటివ్‌ రంగంలో.. 

 ఆటోమోటివ్‌ రంగంలో హైదరాబాద్‌ పలు అంకురార్పణలకు వేదికైంది. ఊబర్‌ సంస్థ ఎలక్ట్రిక్‌ కార్‌ ఫ్లీట్‌ను ఇక్కడే ప్రారంభించింది. మహీంద్ర ఎలక్ట్రిక్‌ భాగస్వామ్యంతో ఊబర్‌ ఎలక్ట్రిక్‌ కార్లను వినియోగంలోకి తెచ్చింది.

జూమ్‌కార్‌ సంస్థ సైతం తమవంతుగా ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగాన్ని ప్రొత్సహించేందుకు ముందుకొచ్చింది. తొలిదశలో 40 ఎలక్ట్రిక్‌ కార్లను ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.

 ఐకియా, విప్రొ, కాగ్నిజెంట్‌ సంస్థలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రొత్సహించేందుకు ముందుకొచ్చాయి.

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సంస్థ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వెయ్యి కోట్ల పెట్టుబడి, 4,600 మందికి ఉపాధి కల్పించేందుకు సంస్థ ముందుకొచ్చింది.

గాయం మెటార్‌వర్క్స్‌ రూ. 260 కోట్లతో ఎలక్ట్రిక్‌ త్రీవీలర్స్‌ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ప్రతిపాదనలు సమర్పిచింది.

మరో 2500 మంది ఇంజినీర్లకు ఉద్యోగాలు కల్పించేందుకు వీలు గా హ్యుందాయ్‌ మెబీ టెక్నాలజీ సెంటర్‌ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పిచింది.


ప్రత్యేక గుర్తింపు..

మెట్రోనగరాలతో పొల్చుకుంటే హైదరాబాద్‌ పలురకాలుగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఎలక్ట్రిక్‌ వాహనాల పైలెట్‌ ప్రాజెక్ట్‌ల అమలుకోసం గుర్తించిన లైట్‌హౌజ్‌ నగరాల జాబితాలో చోటు సంపాదించుకున్నది. దేశంలోని ఆరు నగరాల్లో ఒకటిగా నీతి ఆయోగ్‌, రాక్‌ మౌంటేన్‌ ఇన్‌స్టిట్యూట్‌(యూఎస్‌ఏ)లచే గుర్తింపు పొందింది.

  కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్‌ స్కీమ్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ బస్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌ కోసం గుర్తించిన 9 నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ ఎంపికైంది. అంతేకాకుండా అత్యధిక ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతున్న నగరంగా కీర్తిగడించింది.


అవార్డులు.. 

 2015 సంవత్సరానికి గాను హైదరాబాద్‌ ప్రపంచంలోనే సెకండ్‌ బెస్ట్‌ ప్లేస్‌గా గుర్తింపు పొందింది. నేషనల్‌ జియోగ్రాఫిక్‌కు చెందిన వార్షిక గైడ్‌ ట్రావెలర్‌ మ్యాగ్జీ అవార్డుకు ఎంపికైంది.

 మెడికల్‌ టూరిజం ఫెసిలిటీలో అపొలో దవాఖాన అవార్డున సొంతం చేసుకుంది.


logo