సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ బాధితుల పాలిట శాపంగా మారుతున్నది. ప్రభుత్వం దశదిశ లేకుండా ఇష్టానుసారంగా భూసేకరణ చేపడుతూ ప్రజలను నిరాశ్రయులను చేస్తున్నది. భూసేకరణలో భాగంగా అపార్ట్మెంట్లలో తమకు కావాల్సినంతే తీసుకుంటామని హద్దులు పెడుతుండటంతో అవస్థలు పడుతున్నారు. అపార్ట్మెంట్లలోని కొన్ని ఫ్లాట్లను మాత్రమే భూసేకరణలో చేర్చడంతో మిగిలిన ఫ్లాట్లు మొండిగోడలుగా మిగులుతున్నాయి.
ఆ గోడలు భూసేకరణలో లేవు కాబట్టి పరిహారం ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు. దీంతో ఆయా ఫ్లాట్ల యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ చేస్తున్న అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడుతున్నది. అపార్ట్మెంట్లలో 80 శాతం సేకరించి దానికే పరిహారం ఇస్తామంటున్నారు. దీంతో మిగిలిన 20 శాతం భూమి దేనికీ పనిరాకుండా పోతుండటంతో బాధితులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అలాగే ఉన్నాయని.. తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారని వాపోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పేరిట బాధిత ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్యారడైస్ నుంచి డెయిరీ ఫాం రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అధికారులు భూసేకరణ చేపట్టారు. అందులో భాగంగా న్యూబోయిన్‌పల్లిలోని 45 ఫ్లాట్లు కలిగిన సాయి శ్రీ అపార్ట్మెంట్లోని 80 శాతం భాగాన్ని సేకరించారు. మొత్తం అపార్ట్మెంట్లో 32 ఫ్లాట్లు కలిగిన భూమిని తీసుకునేందుకు పరిహారం ప్రకటించారు. అదంతా అపార్ట్మెంట్ ముందుభాగంలో ఉన్నది. మిగిలిన భాగం త్రిభుజాకారంలో మిగులుతుంది. అందులో 13 ఫ్లాట్లు ఉంటున్నాయి. అపార్ట్మెంట్ ముందుభాగాన్ని కూలిస్తే మిగిలిన 13 ఫ్లాట్లు కూలిపోయి గోడలు మాత్రమే మిగిలే అవకాశం ఉంది.
కాబట్టి తమ ఫ్లాట్లను కూడా భూసేకరణలో చేర్చి మిగతా వారిలాగానే పరిహారం ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు. కానీ అధికారులు మాత్రం భూసేకరణలో తమకు 32 ఫ్లాట్లకు సంబంధించిన భూమే అవసరమని మిగతాది అవసరం లేనందున పరిహారం ఇవ్వం.. ఆ ఫ్లాట్లున్న భూమిని తీసుకోమని తేల్చి చెబుతున్నారు. దీంతో కూల్చివేతల్లో ముందుభాగం పోయి తమ ఫ్లాట్లు గోడలుగా మిగులుతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులను ఎన్సిసార్లు కలిసి విన్నవించినా తమ గోడు వినటం లేదని వాపోతున్నారు.
న్యాయం చేయాలంటూ..
భూ సేకరణ చట్టం 2013 సెక్షన్ 94 ప్రకారం ఒక భవనంలోని 70 శాతం సేకరిస్తే మిగిలిన 30 శాతానికి కూడా పరిహారం ఇవ్వాలనే నిబంధన ఉందని బాధితులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం తమకు న్యాయం చేయాలని సాయి శ్రీ అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. భూసేకరణ నిబంధనల ప్రకారం తమ ఫ్లాట్లను కూడా తీసుకుని మిగతావాళ్లకు ఇచ్చినట్లు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మొండి గోడలు మిగిలి నివాసాలను కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. తమ ఫ్లాట్లను భూసేకరణలో చేర్చిన తర్వాతనే ఆ 32 ఫ్లాట్ల యజమానులకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా గురువారం 13 ఫ్లాట్ల యజమానులు ల్యాండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను కలిగి వినతి పత్రం ఇచ్చారు. బాధితుల వినతిని హెచ్ఎండీఏ దృష్టికి తీసుకెళ్తామని, సానుకూల స్పందన వస్తే మిగిలిన ఫ్లాట్లను కూడా భూసేకరణలో చేరుస్తామని చెప్పినట్లు తెలిపారు.