Breast Cancer Diet | వయస్సు మీద పడే కొద్దీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ప్రతి ఏటా పెరుగుతుందని గణాంకాంలు చెబుతున్నాయి. 2022 సర్వేల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 2 కోట్ల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోతున్న వారి సంఖ్య 6.70 లక్షలుగా ఉంది. 2040 వరకు ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. కనుక మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అమెరికన్ రేడియాలజిస్ట్ డాక్టర్ నికోల్ సేఫియర్ మాట్లాడుతూ వయస్సు మీద పడే కొద్దీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెప్పారు. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇందుకు ఒక కారణమని అన్నారు. అలాగే రోజూ తినే ఆహారాల్లో టాక్సిన్లు ఎక్కువగా ఉన్నా, కాస్మొటిక్ ఉత్పత్తులను ఎక్కువగా వాడినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని అంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఆరోగ్యవంతమైన డైట్‌ను, జీవన విధానాన్ని పాటించాలని, దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు. ఇందకు గాను కింద చెప్పిన 5 ఆహారాలు ఎంతో ఉపయోగపడుతాయని అంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ రావొద్దంటే ఈ 5 ఆహారాలను తినాలని సూచిస్తున్నారు.
పాలకూరలో కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. నిపుణులు చెబుతున్న ప్రకారం పాలకూరను ఆహారంలో తరచూ తీసుకున్న వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముప్పు 28 శాతం వరకు తగ్గుతుందని తేల్చారు. ఈ మేరకు 20 ఏళ్ల పాటు సైంటిస్టులు 32వేల మంది మహిళలపై పరిశోధన చేసి ఈ విషయం చెబుతున్నారు. కనుక బ్రెస్ట్ క్యాన్సర్ రావొద్దంటే పాలకూరను తరచూ తినాలని వారు సూచిస్తున్నారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు నుంచి వెల్లుల్లి కూడా రక్షిస్తుంది. వెల్లుల్లిలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు ఉంటాయి. దీంతోపాటు వాపులు కూడా తగ్గుతాయి. కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి మహిళలు రోజూ వెల్లుల్లిని తినాలని సూచిస్తున్నారు.
రోజూ గుప్పెడు బ్లూబెర్రీలను తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఆంథో సయనిన్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. అలాగే చేపలను తరచూ తినే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముప్పు 14 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేవిధంగా క్యాన్సర్ ను అడ్డుకునే విషయంలో పసుపు కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని మహిళలు రోజూ తీసుకోవాలి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. కనుక క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ ఆహారాలను మహిళలు తరచూ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.