Perimenopause | గర్భధారణ సమస్యలు కేవలం సంతానం పొందడంలో ఇబ్బందులకే పరిమితం కావని, మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రాథమిక వంధ్యత్వం (ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ) చరిత్ర ఉన్న మహిళలు ఇతర మహిళలతో పోలిస్తే రుతుక్రమం శాశ్వతంగా ఆగిపోయే దశ మెనోపాజ్‌ను ముందుగానే ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం ఫలితాలు మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం, భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితుల మధ్య ఉన్న సంబంధంపై మరింత అవగాహన కల్పిస్తున్నాయి. మెనోపాజ్ మహిళల జీవితంలో సహజంగా సంభవించే జీవసంబంధ దశ. ఈ దశలో రుతుస్రావం పూర్తిగా నిలిచిపోవడంతోపాటు సంతానోత్పత్తి సామర్థ్యం కూడా ముగుస్తుంది. సాధారణంగా చాలా మంది మహిళలు 50 నుంచి 51 ఏళ్ల మధ్య మెనోపాజ్‌కు చేరుకుంటారు. అయితే 45 ఏళ్లలోపు మెనోపాజ్ రావడాన్ని ఎర్లీ మెనోపాజ్‌గా, 40 ఏళ్లలోపు రావడాన్ని ప్రీమేచ్యూర్ మెనోపాజ్‌గా పరిగణిస్తారు. ఈ రెండు పరిస్థితులు గుండె జబ్బులు, ఎముకల బలహీనత, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి.
ఈ పరిశోధనలో దాదాపు 700 మంది మహిళల ఆరోగ్య వివరాలను దీర్ఘకాలంగా పరిశీలించారు. వారిలో సగం మందికి ప్రాథమిక వంధ్యత్వం ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే నిర్దిష్ట కాలం పాటు గర్భం దాల్చేందుకు ప్రయత్నించినప్పటికీ, గతంలో ఎప్పుడూ విజయవంతమైన గర్భధారణ జరగని మహిళలను ఈ వర్గంలో చేర్చారు. అధ్యయనంలో పాల్గొన్న మహిళల వివరాలను విశ్లేషించగా, ప్రాథమిక వంధ్యత్వం చరిత్ర ఉన్న మహిళలు సాధారణంగా ఇతర మహిళలతో పోలిస్తే సగటున ఒక సంవత్సరం ముందుగానే సహజ మెనోపాజ్‌కు చేరుకున్నట్లు తేలింది. ముఖ్యంగా కారణం తెలియని వంధ్యత్వం లేదా ఎండోమెట్రియోసిస్ కారణంగా వంధ్యత్వం ఎదుర్కొన్న మహిళల్లో 45 ఏళ్లకు ముందే మెనోపాజ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే 40 ఏళ్లలోపు వచ్చే ప్రీమేచ్యూర్ మెనోపాజ్‌తో వంధ్యత్వానికి స్పష్టమైన సంబంధం కనిపించలేదు. అయినప్పటికీ ఎర్లీ మెనోపాజ్‌తో ఉన్న బలమైన సంబంధం నిపుణుల దృష్టిని ఆకర్షించింది.
వంధ్యత్వం, ముందస్తు మెనోపాజ్ మధ్య సంబంధం ఎందుకు ఉంటుందనే అంశంపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఒకే రకమైన జీవసంబంధ కారణాలు ఈ రెండు పరిస్థితులకు దోహదపడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. సాధారణంగా మహిళల అండాశయాల్లోని అండాల సంఖ్య వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ ప్రక్రియ వేగంగా జరిగితే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడమే కాకుండా మెనోపాజ్ కూడా ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గర్భాశయ అంతర్గత పొరలాంటి కణజాలం గర్భాశయం వెలుపల పెరగడం వల్ల ఏర్పడే ఈ వ్యాధి వంధ్యత్వానికి కారణమవడమే కాకుండా ముందస్తు మెనోపాజ్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని గత పరిశోధనలు సూచించాయి.
జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల మార్పులు, శరీర అభివృద్ధి విధానం, జీవనశైలి వంటి అంశాలు కూడా వంధ్యత్వం, పునరుత్పత్తి వ్యవస్థ వృద్ధాప్య ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. మెనోపాజ్ సమయం మహిళల భవిష్యత్తు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. మెనోపాజ్ ముందుగానే వస్తే ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు ఎక్కువ కాలం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ హార్మోన్ ఎముకలు, గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ముందస్తు మెనోపాజ్ గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్, కొన్ని నాడీ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రాథమిక వంధ్యత్వం చరిత్ర ఉన్న మహిళలు మెనోపాజ్ లక్షణాలు లేదా రుతుక్రమంలో వచ్చే మార్పులపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, చికిత్సలు పొందాలని పరిశోధకులు సూచిస్తున్నారు.