Weight Gain | యుక్త వయస్సులో వేగంగా బరువు పెరగడం భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని తాజా పరిశోధన హెచ్చరించింది. ముఖ్యంగా టీనేజ్ చివరి దశ నుంచి 20ల వయస్సు వరకు అధిక బరువు పెరిగిన వారిలో అకాల మరణ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు కూడా ఎక్కువవుతుందని అధ్యయనం వెల్లడించింది. స్వీడన్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో 17 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 6 లక్షల మందికి పైగా వ్యక్తుల బరువు మార్పులను పరిశీలించారు. బరువు వేగంగా పెరిగినవారిలో మరణాల రేటు ఎక్కువగా కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా చిన్న వయస్సులోనే ఊబకాయం ప్రారంభమైతే శరీరం ఎక్కువకాలం మెటబాలిక్ ఒత్తిడికి గురవుతుందని, ఇది గుండె, రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
29 ఏళ్ల వయస్సుకల్లా ఊబకాయంతో బాధపడుతున్న వారిలో అకాల మరణ ప్రమాదం 70 నుంచి 84 శాతం వరకు పెరిగినట్లు అధ్యయనం తెలిపింది. మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. గుండెపోటు, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్, హైపర్టెన్షన్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు కూడా వీరిలో అధికంగా కనిపించాయని వెల్లడించారు. పురుషుల్లో చిన్న వయస్సులో బరువు పెరగడం కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును పెంచగా, మహిళల్లో మాత్రం క్యాన్సర్ ప్రమాదంలో అంత స్పష్టమైన మార్పు కనిపించలేదని అధ్యయనం పేర్కొంది. మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు కూడా దీనికి కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సగటున ప్రతి ఏడాది సుమారు 0.4 కిలోల బరువు పెరిగినప్పటికీ, దీర్ఘకాలంలో అది పెద్ద ప్రభావం చూపుతుందని అధ్యయనం తెలిపింది. 17 నుంచి 30 ఏళ్ల మధ్య దాదాపు 6.5 కిలోల బరువు పెరిగిన వారిలో కూడా మరణ ప్రమాదం పెరిగినట్లు గుర్తించారు.
చిన్న వయస్సులో బరువు పెరగడం వల్ల శరీరం ఎక్కువకాలం అధిక కొవ్వు ప్రభావానికి గురవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ (వాపు) ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. తక్కువ శారీరక శ్రమ, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు యువతలో బరువు పెరుగుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. యువత బరువు నియంత్రణ కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం, రోజుకు కనీసం ఐదు సార్లు పండ్లు, కూరగాయలు తినడం మంచిదని చెబుతున్నారు. రోజూ అదనంగా 2,000 అడుగులు నడవడం, వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం, వారంలో రెండు సార్లు శక్తివర్ధక వ్యాయామాలు చేయడం ఉపయోగకరమని సూచిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ బరువును పరిశీలించడం, ఆకలి లేకున్నా కూడా తినే అలవాట్లను తగ్గించడం, నీటిని ఎక్కువగా తాగడం, అల్పాహారం మానకుండా సమయానికి భోజనం చేయడం వంటి చిన్న మార్పులు కూడా బరువు నియంత్రణలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.