తీరికలేని జీవితాల్లో.. వ్యాయామానికి సమయం కేటాయించడమే కష్టమై పోతున్నది. ఈ క్రమంలో వారాంతపు వర్కవుట్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. వారం మొత్తం చేయాల్సిన ఎక్సర్సైజులన్నిటినీ.. శని, ఆదివారాల్లోనే చేసేస్తున్నారు. మరోవైపు, ఇలా వారానికి రెండు రోజులు వ్యాయామం చేస్తే.. శరీరానికి అన్ని ప్రయోజనాలు అందుతాయా? అని కూడా సందేహిస్తున్నారు. అలాంటివారికి వ్యాయామ నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. వ్యాయామం చేయకుండా ఉండటం కన్నా.. వారానికి రెండు రోజులు కేటాయించడం మంచిదేనని నిపుణులు అంటున్నారు. వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉండేవారికి.. ఈ వారాంతపు వ్యాయామం అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని చెబుతున్నారు. వారం మొత్తం వ్యాయామం చేసేవారితో పోలిస్తే.. వారానికి రెండు రోజులు కష్టపడి వ్యాయామం చేసేవారిలోనూ గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లోనూ తేలింది.
అయితే, ఆ రెండు రోజుల్లో కాస్త ఎక్కువ తీవ్రతతో వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. కనీసం 75 నిమిషాల కఠినమైన వ్యాయామం, 150 నిమిషాల మోస్తరు వ్యాయామం చేసినా మంచిదేనని అంటున్నారు. కండరాలు దృఢంగా మారడానికి ‘రెసిస్టెన్స్ ట్రైనింగ్’ కూడా.. రెండు రోజుల్లో చేయొచ్చట. అయితే, కేవలం వారాంతపు వ్యాయామం పైనే ఆధారపడకుండా.. మిగిలిన ఐదు రోజులు ఎంతో కొంత చురుకుగా ఉండాలని చెబుతున్నారు. ఇందుకోసం ఆఫీస్, అపార్ట్మెంట్లలో లిఫ్ట్‌కు బదులు మెట్లను ఆశ్రయించాలి. ఆఫీసులో పని మధ్యలో చిన్నపాటి నడకను అలవాటు చేసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా, బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వారికి ఈ రెండు రోజుల వ్యాయామం ఏమాత్రం సరిపోదట. అధిక బరువునువదించుకోవాలని అనుకునేవారికి వారానికి కనీసం 4-5 రోజులు వ్యాయామం అవసరమని నిపుణులు చెబుతున్నారు.