UTI | మూత్రనాళ ఇన్ఫెక్షన్లను(UTIs) ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లలో ఒకటిగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఇవి ఎక్కువగా కనిపించినప్పటికీ, పురుషుల్లో వచ్చే యూటీఐలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్లు కిడ్నీలు, రక్తప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, యూటీఐలు ప్రధానంగా ఈ.కోలి (E. coli) వంటి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించి పెరగడం వల్ల వస్తాయి. మహిళల్లో మూత్రనాళం చిన్నగా ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పురుషుల్లో యూటీఐలు వచ్చినప్పుడు అవి ప్రోస్టేట్ సమస్యలు, కిడ్నీ రాళ్లు లేదా నియంత్రణలో లేని మధుమేహం వంటి అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అలాగే యూటీఐలను నివారించడంలో తగినంత నీరు తాగడం అత్యంత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగడం వల్ల మూత్రవ్యవస్థలోని బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోవడానికి సహాయపడుతుంది. తక్కువ నీరు తాగడం వల్ల మూత్రం గాఢంగా మారి బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
మూత్రం పోయేటప్పుడు మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొట్ట దిగువ భాగంలో నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు ఆలస్యంగా వైద్యులను సంప్రదించడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ లేదా కిడ్నీలకు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. అదే విధంగా 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం సాధారణమని, ఇది మూత్ర ప్రవాహాన్ని అడ్డుకోవడంతో మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది యూటీఐలకు ప్రధాన కారణంగా మారుతుందని వివరించారు. మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండటం, రాత్రిపూట తరచుగా మూత్రానికి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా యూటీఐ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, వృద్ధులు, పురుషులు జననేంద్రియాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు చెబుతున్నారు. మధుమేహాన్ని నియంత్రణలో జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు బ్యాక్టీరియా పెరుగుదలకు అవకాశం పెరుగుతుందని తెలిపారు.
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం కూడా యూటీఐలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమయానికి మూత్రాశయాన్ని ఖాళీ చేయడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించవచ్చని సూచిస్తున్నారు. అలాగే కాథెటర్ల వినియోగం కూడా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో వాటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. లైంగిక సంబంధాల సమయంలో పరిశుభ్రత పాటించడం, రక్షణ చర్యలు తీసుకోవడం కూడా యూటీఐలను నివారించడంలో సహాయపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణ జీవనశైలి మార్పులు, తగిన పరిశుభ్రత, మధుమేహ నియంత్రణ, సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా యూటీఐలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.