H1N1 | హెచ్1ఎన్1 (H1N1) వంటి ఫ్లూ నుంచి కోలుకున్న తర్వాత జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు తగ్గిపోయినా కొందరిలో అలసట, ఏకాగ్రత లోపం, విషయాలను గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కొంతకాలం కొనసాగుతాయి. దీనినే సాధారణంగా బ్రెయిన్ ఫాగ్ గా పేర్కొంటారు. ఆలోచన నెమ్మదించడం, సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం, ఏకాగ్రత నిలబెట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్య సాధారణంగా తాత్కాలికమేనని, శరీరం పూర్తిగా కోలుకున్న కొద్దీ తగ్గే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. హెచ్1ఎన్1 ఇన్ఫెక్షన్ సమయంలో వైరస్‌తో పోరాడేందుకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో విడుదలయ్యే ఇన్ఫ్లమేటరీ రసాయనాలు కొంతకాలం మెదడు సాధారణ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కూడా అలసట, ఆలోచన నెమ్మదించడం, ఏకాగ్రత తగ్గడం లేదా విషయాలను గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన హెచ్1ఎన్1 ఇన్ఫెక్షన్లో శరీరంలో ఎక్కువ వాపు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం లేదా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈ సమస్యలు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.
అయితే బ్రెయిన్ ఫాగ్‌కు ఇన్ఫ్లమేషన్ ఒక్కటే కారణం కాదు. అనారోగ్య సమయంలో సరిగ్గా నిద్రపట్టకపోవడం కూడా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. జ్వరం, నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రోజువారీ జీవనశైలిలో మార్పుల కారణంగా ప్రశాంతమైన నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో కొనసాగే అలసట వల్ల మానసికంగా ఎక్కువ శ్రమ అవసరమయ్యే పనులు చేయడం కష్టంగా అనిపిస్తాయి. అనారోగ్య సమయంలో తగినంత నీరు తాగకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతుంది. జ్వరం, చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం, కొందరిలో వాంతులు వంటి కారణాలతో శరీరంలో నీరు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల బలహీనత, అలసట, ఏకాగ్రత లోపం మరింత ఎక్కువ అవుతుంది. అందుకే ఫ్లూ నుంచి కోలుకునే సమయంలో తగినంత ద్రవాలు తీసుకోవడం ముఖ్యం. అదేవిధంగా అనారోగ్య సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోయినా శరీరానికి అవసరమైన శక్తి అందదు. ఫలితంగా సాధారణ శారీరక, మానసిక పనితీరుకు తిరిగి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి కోలుకునే సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. అనారోగ్య సమయంలో ఉపయోగించే కొన్ని మందులు కూడా తాత్కాలికంగా నిద్రమత్తును కలిగిస్తాయి. దీంతో వ్యక్తికి మానసికంగా నెమ్మదిగా ఉన్నట్లు లేదా ఏకాగ్రత తగ్గినట్లు అనిపిస్తుంది.
ఫ్లూ తర్వాత బ్రెయిన్ ఫాగ్ కనిపించిందంటే తప్పనిసరిగా మెదడుకు శాశ్వత నష్టం జరిగిందని అర్థం కాదు. చాలా మందిలో శరీరం ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకున్న కొద్దీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ముఖ్యంగా పోస్ట్-వైరల్ అలసటతోపాటు కనిపించే తాత్కాలిక మానసిక మందగింపు సాధారణంగా నాడీ వ్యవస్థకు శాశ్వత నష్టం జరిగిందని సూచించదు. కోలుకునే సమయంలో తగినంత నిద్ర, నీరు, సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక కార్యకలాపాలను క్రమంగా పెంచుకోవడం ఉపయోగపడతాయి. అలసట కొనసాగుతున్నప్పుడు ఎక్కువ శారీరక లేదా మానసిక శ్రమ చేయకుండా మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించడం కూడా సహాయపడతయి. అయితే బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగినా లేదా క్రమంగా తీవ్రమవుతున్నా వాటిని కేవలం ఫ్లూ తర్వాత వచ్చే అలసటగా భావించకూడదు. అరుదైన సందర్భాల్లో ఇన్‌ఫ్లుయెంజాతో తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
గందరగోళం, మాట్లాడటంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం, అసాధారణ ప్రవర్తన, చేతి లేదా కాలు బలహీనపడటం, స్పృహలో గణనీయమైన మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ ఎంతకాలం ఉంటుందో అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరిలో కొన్ని రోజుల్లోనే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సాధారణ స్థితికి వస్తాయి. మరికొందరిలో, ముఖ్యంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అలసట, మానసిక మందగింపు కొన్ని వారాల పాటు కొనసాగుతాయి. జ్ఞాపకశక్తి లేదా ఏకాగ్రత సమస్యలు కొన్ని వారాలపాటు తగ్గకుండా కొనసాగితే, రోజువారీ పనులు లేదా ఉద్యోగంపై ప్రభావం చూపితే, లేదా క్రమంగా మరింత తీవ్రమవుతుంటే వైద్యులను సంప్రదించడం అవసరం. పరీక్షల ద్వారా ఇది సాధారణ కోలుకునే ప్రక్రియలో భాగమా, లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలుసుకోవడం ముఖ్యం.