Healthy Snacks | రోజంతా కార్యాలయంలో పని చేసే చాలామందికి మధ్యాహ్నం తర్వాత అలసట, ఏకాగ్రత తగ్గడం, మళ్లీ మళ్లీ కాఫీ లేదా టీ తాగాలనిపించడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన స్నాక్స్‌ను ఎంచుకోకపోవడమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి స్థిరమైన శక్తిని అందించే ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తీసుకుంటే మధ్యాహ్నం వచ్చే ఎనర్జీ క్రాష్‌ను నివారించవచ్చని సూచిస్తున్నారు. చాలామంది కార్యాలయానికి చేరుకున్న వెంటనే ఆకలి వేయడంతో కాఫీ లేదా టీతోపాటు బిస్కెట్లు, చిప్స్ వంటి అధిక చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను తీసుకుంటారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి, కొద్ది సేపటికే వేగంగా తగ్గిస్తాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, మళ్లీ కాఫీ లేదా తీపి పదార్థాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది.
పోషకాహారం, మెదడు పనితీరుపై జరిగిన పరిశోధనల ప్రకారం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే స్థిరంగా శక్తిని అందించే స్నాక్స్‌ను ఎంచుకోవడం వల్ల శరీరం, మెదడు రెండూ చురుకుగా పనిచేస్తాయి. ఇందుకోసం ఖరీదైన సూపర్‌ఫుడ్స్ కొనాల్సిన అవసరం లేదని, మన ఇంట్లోనే లభించే భారతీయ ఆహార పదార్థాలతో కూడా ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తయారు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్నాక్స్ తీసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలని సూచిస్తున్నారు. కార్బోహైడ్రేట్లను ఒంటరిగా తీసుకోవడం కంటే వాటికి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లేదా ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను జతచేయడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలై, శక్తి ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. దీంతో ఆకలి త్వరగా వేయకుండా ఉండటంతోపాటు మెదడుకు కూడా నిరంతర శక్తి అందుతుంది.
బిస్కెట్లకు బదులుగా చిన్న గిన్నె కాల్చిన శనగలను ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్‌తో కలిపి తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కూల్‌డ్రింక్స్ లేదా ప్యాకెట్ జ్యూస్‌లకు బదులుగా కొబ్బరి నీరు లేదా మజ్జిగ తాగడం మంచి ఎంపిక. ఇవి శరీరానికి ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు అందించి వేసవిలో కూడా తాజాగా ఉంచుతాయి. చిప్స్, భుజియా వంటి అధిక ఉప్పు, నూనె ఉన్న చిరుతిండ్లకు బదులుగా బాదం, వాల్నట్స్, పల్లీలు వంటి కాల్చిన లేదా ఎయిర్ ఫ్రై చేసిన మిశ్రమ నట్స్‌ను తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్‌ను అందించి శక్తిని ఎక్కువసేపు నిలుపుతాయి. రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేయడం ద్వారా మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గించుకోవచ్చు. అధిక కాఫీ లేదా టీపై ఆధారపడకుండా, సమతుల్య పోషకాలు ఉన్న స్నాక్స్‌ను ఎంచుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఏకాగ్రతతో పని చేయడం సులభమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.