Cranberries | చాలా మందిని ఇబ్బందులకు గురి చేసే మూత్రపిండ సంబంధిత సమస్యల్లో మూత్రనాళ ఇన్పెక్షన్ కూడా ఒకటి. మందులతోపాటు కొన్ని సహజ పరిష్కారాల ద్వారా కూడా ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI) సమస్యలకు సహజ పరిష్కారంగా క్రాన్ బెర్రీలు (Cranberries) పనిచేస్తాయి. వీటి గురించి చాలా మంది వింటుంటారు. అయితే ఇవి భారతదేశానికి సంబంధించిన పండ్లు కావు. అయినప్పటికీ మూత్రాశయ ఆరోగ్యానికి ఇవి ఉపయోగపడతాయా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అవసరం. Urinary Tract Infection (మూత్రాశయ ఇన్ఫెక్షన్) బ్యాక్టీరియా, ముఖ్యంగా ఇ.కోలి మూత్రనాళంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ఇన్ఫెక్షన్ గా చెప్పవచ్చు. ఇది మూత్రాశయం లేదా తీవ్రమైన సందర్భాల్లో మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది. మూత్రం విసర్జిస్తున్నప్పుడు మంట, తరచుగా మూత్రం రావడం, దుర్వాసన, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించినప్పటికీ, పురుషుల్లో కూడా ఇది సంభవిస్తుంది.
ఇక క్రాన్బెర్రీల ప్రత్యేకత ఏమిటంటే, వీటిలో ఉండే ప్రో-ఆంథోసయానిడిన్స్ (PACs) అనే సంయోగాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను నేరుగా నిర్మూలించవు. కానీ అవి మూత్రనాళ గోడలకు అంటుకోకుండా అడ్డుకుంటాయి. దీంతో ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. పరిశోధనలు సూచిస్తున్నట్లుగా క్రాన్ బెర్రీలు ముఖ్యంగా తరచూ UTIలు వచ్చే వారికి కొంతవరకు ఉపయోగపడతాయి. అయితే ఇవి ఇప్పటికే ఉన్న ఇన్ఫెక్షన్ను నయం చేయలేవు. అంటే, ఇవి నివారణకు మాత్రమే సహాయపడతాయి, చికిత్సకు కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఇవి ఒకే విధంగా పనిచేయవు. క్రాన్ బెర్రీ జ్యూస్, క్యాప్సూల్స్ లేదా పండు రూపంలో తీసుకోవచ్చు. అయితే మార్కెట్లో దొరికే జ్యూస్లో చక్కెర ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల PACs మోతాదు నియంత్రితంగా ఉండే క్యాప్సూల్స్ మరింత ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. పండు రూపంలో తీసుకోవడం కూడా ఆరోగ్యకరమైన ఎంపిక. అయితే క్రాన్ బెర్రీలను ఒక్కటే పరిష్కారంగా భావించడం సరైంది కాదు. తీవ్రమైన UTIలకు యాంటీబయాటిక్స్ అవసరం. చికిత్స ఆలస్యం చేస్తే మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.
భారత పరిస్థితుల్లో మూత్రాశయ ఆరోగ్యానికి సహాయపడే ఇతర సహజ మార్గాలు కూడా ఉన్నాయి. కొబ్బరి నీరు (Tender Coconut Water) మూత్రాన్ని పెంచి బ్యాక్టీరియాను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే నారింజ, మోసంబి, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సి ని అందించి మూత్రాన్ని స్వల్పంగా ఆమ్లంగా మార్చి బ్యాక్టీరియాకు అనుకూలం కాని వాతావరణాన్ని సృష్టిస్తాయి. తగినంత నీరు తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైనవి. క్రాన్ బెర్రీలు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, అధికంగా తీసుకుంటే జీర్ణ అసౌకర్యం కలుగుతుంది. చక్కెర ఎక్కువగా ఉండే జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అలాగే కొన్ని మందులతో (ప్రత్యేకంగా రక్తాన్ని పలుచగా చేసే మందులు) పరస్పర చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. క్రాన్ బెర్రీలు UTI నివారణలో సహాయక పాత్ర పోషిస్తాయి. కానీ ఇవి పూర్తి పరిష్కారం కావు. తరచూ ఇన్ఫెక్షన్లు వస్తే వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం. సరైన ఆహారం, జీవనశైలి, అవసరమైన చికిత్సతోనే పూర్తి రక్షణ సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.