Diabetic Foot | చాప కింద నీరులా డయాబెటిస్ మనల్ని నిశ్శబ్దంగా చుట్టేస్తున్నది. ఎవర్ని కదిపినా చక్కెర వ్యాధి బయటపడుతున్నది. ఒకప్పుడు 50, 60 ఏండ్లు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు యువకుల్లో కనిపిస్తున్నది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, అహారం అలవాట్లు అని చెప్పుకోవాలి. ఒక్కసారి మనలో చక్కెర సమస్య కనిపించిందంటే ఇక జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.
చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ద్వారా ఇతర అవయవాలపై ప్రభావం చూపకుండా చూసుకోవచ్చు. శరీరంలో చక్కెర పెరిగితే ముఖ్యంగా పాదాలపై దాని ప్రభావం ఉంటుంది. పాదాలు తరచుగా వాపులు, నొప్పులు రావడం అనేది మధుమేహానికి సంకేతంగా భావించాలి. చక్కెర స్థాయిలు పెరిగిన వారిలో పాదాలకు రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవడంతోపాటు నరాలు దెబ్బతింటాయి. ఫలితంగా పాదాల నొప్పులు వస్తుంటాయి. పుండ్లు ఏర్పడతాయి. ఈ పుండ్లు తగ్గకపోగా మరింతగా పెరుగుతూ కాలును తొలగించేంత వరకు తీసుకెళ్తాయి. అందుకని డయాబెటిక్ ఫుట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది.
డయాబెటిక్ ఫుట్ లక్షణాలు..
డయాబెటిక్ న్యూరోపతి కారణంగా కాళ్లు, పాదాలలో నొప్పి, తిమ్మిరి లేదా జలదరింపు అనుభూతి కలుగుతుంది. పాదాల గాయం కారణంగా కూడా సంభవించవచ్చు. అందుకని డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోవాలి.
డయాబెటిక్ న్యూరోపతి కారణంగా పాదాల పుండ్లు అభివృద్ధి చేందుతాయి. ఇవి ముఖ్యంగా పాదాల అడుగున అభివృద్ధి చెందుతాయి. ఇవి మరింత తీవ్రమైన సందర్భాల్లో పగిలిపోయి మరింత ఇబ్బంది పెడతాయి. ఇప్పటికే డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్నవారు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. చెప్పులు ధరించకుండా బయట నడవొద్దు. చనిపోయిన చర్మాన్ని తొలగించడం ద్వారా గాయాలను శుభ్రం చేసుకోవాలి.
మధుమేహం పాదాలపై కాలిస్లకు కూడా దారితీయవచ్చు. కాలిస్ అనేది పాదాల అడుగు భాగంలో గట్టి చర్మం ఏర్పడుతుంది. ఈ లక్షణాన్ని నివారించడానికి సౌకర్యవంతమైన బూట్లు ధరించడం అలవాటు చేసుకోవాలి..
మధుమేహం ఉన్నప్పుడు అథ్లెట్స్ ఫుట్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది పాదంలో మంట, బొబ్బలను కలిగిస్తుంది. దురద, మంట, పగుళ్లతో నొప్పిని కలిగిస్తుంది. ఒకటి లేదా రెండు పాదాలను కూడా ప్రభావితం చేయవచ్చు. పాదాల పరిశుభ్రతను కాపాడుకోవడం ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. పాదాలను ఎక్కువసేపు తడిగా ఉంచకుండా చూసుకోవాలి.
మధుమేహం గోర్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఒనికోమైకోసిస్ అని పిలువబడే ఫంగల్ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఇది గోర్ల రంగు పాలిపోవడానికి దారితీస్తుంది. వాటిని మందంగా మరియు పెళుసుగా తయారుచేస్తుంది. అలాగే తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
డయాబెటిస్ పాదాలలో కండరాలను బలహీనపరుస్తుంది. దాంతో పాదాల వైకల్యానికి కారణమవుతుంది. చార్కోట్ ఫీట్, క్లా ఫీట్, హ్యామర్టోస్ లేదా మెటాటార్సల్ హెడ్స్ వంటి పరిస్థితులకు దారితీయవచ్చు.
డయాబెటిక్ ఫుట్ సమస్యల నివారణ ఇలా..
చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మందులను క్రమం తప్పకుండా సమయానికి వాడుతుండాలి. స్నానం చేసిన తర్వాత పాదాలను ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత క్రీమ్ లేదా జెల్లీని పాదాలకు అప్లై చేయాలి. కాలి వేళ్ల మధ్య ఏమీ రాకుండా జాగ్రత్త వహించాలి.
అప్పుడప్పుడు పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచి మురికి లేకుండా శుభ్రం చేసుకోవాలి. సిగరెట్ స్మోకింగ్ అలవాటు మానుకోవాలి. చెప్పులు లేకుండా నడవడం, బురదలో పని చేయడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. గోర్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. గోరుతో పాటు చర్మం కట్ అవకుండా జాగ్రత్త పడాలి. శుభ్రమైన పొడి సాక్స్ ధరించాలి. పాదాలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.