Sugar Cane Juice Vs Watermelon Juice | దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వేసవి తీవ్ర రూపం దాల్చింది. అనేక చోట్ల 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేసవిలో దాహాన్ని తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేసేందుకు కూడా ఈ సీజన్లో జ్యూస్‌లను తాగాల్సి ఉంటుంది. జ్యూస్‌లను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే వేసవిలో చాలా మంది హైడ్రేషన్ కోసం తాగే జ్యూస్‌లలో పుచ్చకాయ జ్యూస్ ఒకటి. ఇవి ఈ సీజన్లో అధికంగా లభిస్తాయి కనుక చాలా మంది వీటిని నేరుగా తినడంతోపాటు జ్యూస్‌గా చేసుకుని కూడా తీసుకుంటారు. అలాగే వేసవిలో చెరకు రసాన్ని కూడా చాలా మంది సేవిస్తుంటారు. అయితే పుచ్చకాయల రసం, చెరకు రసంలలో ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది, ఎందులో పోషకాలు అధికంగా ఉంటాయి.. అన్న వివరాలను పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
వేసవిలో దాహాన్ని తీర్చుకోవడం కోసం చాలా మంది జ్యూస్‌లను తాగుతుంటారు. వేసవి కాలంలో శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేసి హైడ్రేషన్ కోసం జ్యూస్‌లను తాగాల్సి ఉంటుంది. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా దాహాన్ని తీర్చుకోవడం మాత్రమే కాకుండా పోషకాలను కూడా పొందవచ్చు. వేసవి వేడిని తగ్గించడంలో మార్కెట్లో అనేక రకాల జ్యూస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ చెరకు రసం, పుచ్చకాయ రసం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీటిల్లో పోషకాలు, ఎలక్ట్రోలైట్స్, నీటి శాతం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని అందిస్తాయి. అలాగే అనేక పోషకాలను పొందవచ్చు. అయితే ఈ రెండు జ్యూస్‌లలో దేన్ని తాగాలి అని ప్రశ్నిస్తే.. అందుకు పోషకాహార నిపుణులు రెండింటినీ తాగాలని సూచిస్తున్నారు. ఇవి అనేక లాభాలను అందిస్తాయి కనుక ఒకసారి ఒక జ్యూస్‌ను, మరొకసారి మరొక జ్యూస్‌ను తాగితే ఎక్కువ లాభాలు ఉంటాయని చెబుతున్నారు.
జ్యూస్‌లను తయారు చేసే విధానం వాటి పోషక విలువలపై ప్రభావం చూపిస్తుంది. కోల్డ్ ప్రెస్ పద్ధతిలో జ్యూస్ తీస్తే వాటిల్లో పోషకాలే అధికంగా ఉంటాయి. అయితే కొంత ఫైబర్ తగ్గుతుంది. చెరకు రసాన్ని ప్రత్యేక యంత్రాల ద్వారా తీస్తారన్న విషయం తెలిసిందే. ఇది కోల్డ్ ప్రెస్ విధానాన్ని పోలి ఉంటుంది. అందువల్ల చెరకు సహజసిద్ధమైన రుచి రసంలోనూ లభిస్తుంది. అలాగే అనేక పోషకాలను పొందవచ్చు. ఇక పుచ్చకాయ ముక్కలను గ్రైండ్ చేసి రసాన్ని తీస్తారు. అందువల్ల ఫైబర్ కొంత వరకు నిల్వ ఉంటుంది. ఈ రసంలో విటమిన్ ఎ, సి, లైకోపీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తెలిపిన ప్రకారం చెరకు రసంలో సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అయితే అత్యంత శుభ్రమైన ప్రదేశంలో రసాన్ని తీస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఇక పుచ్చకాయ రసంలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల శరీరానికి ద్రవాలు చాలా త్వరగా లభిస్తాయి. డీహైడ్రేషన్ సమస్య త్వరగా తగ్గుతుంది.
చల్లదనం విషయానికి వస్తే చెరకు రసం శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా చల్లదనాన్ని ఇస్తుంది. దీని వల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండ వేడి నుంచి రక్షణ పొందవచ్చు. శరీరంలోని వేడి తగ్గుతుంది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిన ప్రకారం చెరకు రసాన్ని చాలా కనిష్ట ఉష్ణోగ్రతల వరకు, అంటే 15 డిగ్రీల వరకు చల్లబరిచినా అందులో ఉండే పోషకాలు తగ్గవు. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ జర్నల్ తెలిపిన ప్రకారం చల్లగా తీసుకునే చెరకు రసం వేసవిలో డీహైడ్రేషన్‌ను తగ్గించేందుకు ఎంతగానో పనిచేస్తుందని తెలిపారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది కనుక ఇది శరీరాన్ని సహజంగానే చల్లబరుస్తుంది. అందువల్ల ఈ విషయంలో రెండు జ్యూస్‌లలోనూ దేన్నయినా తీసుకోవచ్చు.
ఈ రెండు జ్యూసుల చల్లదనం వ్యక్తి శరీర నిర్మాణం, పోషకాలను గ్రహించే సామర్థ్యం, జ్యూస్ తాజాదనంపై ఆధారపడి ఉంటుంది. అలాగే పంట పెంపకంలో ఉపయోగించిన నీటి నాణ్యత కూడా పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. హైడ్రేషన్ పరంగా చెరకు, పుచ్చకాయ రసాలు రెండూ శరీరానికి అవసరమైన నీరు, ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తాయి. బయట పని చేసే వారు వేడి కారణంగా శరీరంలో కోల్పోయిన ద్రవాలను త్వరగా భర్తీ చేసుకోవడానికి ఈ జ్యూసులు ఉపయోగపడతాయి. న్యూట్రియెంట్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఈ రెండు రసాలు కూడా శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, చెరకు రసం శక్తిని పెంచే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే అలసటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే చెరకు రసంలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. పుచ్చకాయ రసం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వాపులను తగ్గించడం, చర్మానికి తగిన హైడ్రేషన్ అందించడం వంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
ఏ జ్యూస్‌ను ఎంచుకోవాలనే విషయంలో శరీర అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. బయట నుంచి వచ్చి తక్షణ శక్తి అవసరమైతే చెరకు రసం మంచిది. కానీ శరీరాన్ని చల్లబరచడం, హైడ్రేషన్ కోసం పుచ్చకాయ రసం ఉత్తమ ఎంపిక. అత్యుత్తమ ప్రయోజనాల కోసం ఈ రెండు రసాలను మితంగా తీసుకోవడం అవసరం. సరైన మోతాదు, సమయం కోసం పోషక నిపుణులు లేదా డైటిషియన్‌ను సంప్రదించడం మంచిది. ఇంకా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు తీసుకుంటున్నవారు ఈ రసాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇవి మందుల ప్రభావాన్ని మార్చే అవకాశం ఉంటుంది. వేసవిలో సహజ పానీయాలను పరిశుభ్రంగా, తాజాగా తీసుకోవడం ద్వారా గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేసవి వేడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే హైడ్రేషన్ కోసం సరైన పానీయాల వినియోగానికి ముందస్తు ప్రణాళిక అవసరమని వైద్యులు చెబుతున్నారు.