Beauty Tips | ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. పిజ్జాబర్గర్లు తెప్పించుకుంటాం. బయటి నీళ్లు తాగుతున్నప్పుడు సకల జాగ్రత్తలు తీసుకుంటాం. కాలుష్యాన్ని అధిగమించడానికి.. మాస్క్ వేసుకుంటాం. కాయగూరలు కొంటున్నప్పుడు సేంద్రియ పద్ధతిలో పండించారా, రసాయన ఎరువులు వాడారా అన్నదీ గమనిస్తాం. కానీ, శరీరంలో అతిపెద్ద అవయవమూ, అత్యంత కీలకమూ అయిన చర్మాన్ని మాత్రం దాని ఖర్మకే వదిలేస్తాం. విష పదార్థాలు, హానికర రసాయనాలు కలగలిసిన కాస్మొటిక్స్‌ను ముఖానికి అద్దుకుంటాం, ఒళ్లంతా పూసుకుంటాం. ఈ అవగాహన రాహిత్యానికి మూల్యం చెల్లించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.
అందానికి ప్రాధాన్యం పెరిగిపోతున్నది. ఎవరికివారు ఆకర్షణీయంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరింత నిగారింపు కోసం తహతహలాడుతున్నారు. మచ్చలు, గాయాల తాలూకు గుర్తులు మేకప్ చాటున దాచిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అంతవరకూ ఫర్వాలేదు. ఆ పరుగులో.. హానికర రసాయనాలను ఆశ్రయిస్తున్నారు. సున్నితమైన చర్మాన్ని సమస్యల్లో పడేస్తున్నారు. ఈ ధోరణి ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. కొన్నిరకాల సౌందర్య ఉత్పత్తులు ప్రాణాంతకంగా మారుతున్నాయని గుర్తుచేస్తున్నారు. ఓ నలభై యాభై ఏండ్ల క్రితం.. మనకు అందుబాటులో ఉన్న సౌందర్య ఉత్పత్తులే తక్కువ. ఉన్నా, అందులో రసాయనాల మోతాదు మరీ తక్కువ. ఇంట్లోనే.. పసుపు, చందనం, తులసి, వేప, తేనె తదితర సహజసిద్ధ దినుసులతో సిద్ధం చేసుకునేవారు.
కార్పొరేటీకరణ తర్వాత.. అందాన్ని ఆత్మవిశ్వాస సాధనంగా భావిస్తున్నారు. యువతీయువకుల సంపాదనా పెరిగింది. దీంతో ఆ సరికొత్త సెగ్మెంట్లో పలురకాల సౌందర్య ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. మార్కెటింగ్ వ్యూహాలలో భాగంగా తయారీదారులు అందులో అనేకానేక రసాయనాలు గుప్పిస్తున్నారు. ఆ వ్యాపార పన్నాగమే.. క్యాన్సర్ లాంటి ప్రమాదకర రుగ్మతలకు దారితీస్తున్నదనే ఆందోళన కనిపిస్తున్నది. అలా అని, అన్ని ఉత్పత్తులనూ ఒకే గాటన కట్టలేం. ఒకటి రెండు సౌందర్య సాధనాల విషయంలోనే కచ్చితమైన ఆధారం ఉంది. మిగిలినవాటి గురించి నిర్ధారణ జరగాల్సి ఉంది. కాస్మొటిక్స్లోని ఫార్మాల్డిహైడ్ గ్యాస్, ట్రైక్లోసన్, పారాబెన్స్, టాల్కమ్, ఆస్బెస్టాస్, మెర్క్యురీ, స్టెరాయిడ్స్ వంటి పదారార్థాలు వివిధ క్యాన్సర్‌కు దారితీస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
ఫార్మాల్డిహైడ్ గ్యాస్
కేశ సౌందర్యం కోసం చాలామంది కెరటిన్ చికిత్స చేయించుకుంటున్నారు. ఆ సమయంలో విడుదలయ్యే ఫార్మాల్డిహైడ్ గ్యాస్‌ను పీల్చుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పుతోపాటు కొన్నిరకాల అలర్జీలు పొంచి ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెరటిన్ అనేది ఒక ప్రొటీన్. కేశాలలో తొంభైశాతం వరకూ ఉంటుంది. దీనివల్లే కుదుళ్లకు సత్తువ, జుట్టుకు బలం సమకూరతాయి. వాతావరణ కాలుష్యం, తీవ్రమైన ఎండ ప్రొటీన్ ఉనికిని దెబ్బతీస్తాయి. దీంతో కేశాలు బలహీనం అవుతాయి. అలాంటి సందర్భాల్లో కృత్రిమ పద్ధతుల్లో కెరటిన్ను జొప్పిస్తారు సౌందర్య నిపుణులు. ఆ ప్రయత్నంలో ఇబ్బందిపెట్టే దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని.. తాత్కాలిక పద్ధతుల జోలికి వెళ్లకుండా.. జీవనశైలి మార్పులు, ఆహార విధానంతో కెరటిన్ శాతాన్ని పెంచుకోవడం సురక్షిత మార్గం.
ట్రైక్లోసన్
ట్రైక్లోసన్ అనే రసాయనం అనేకానేక దుష్ప్రభావాలకు కారణం అవుతుంది. దీన్ని స్నానపు సబ్బు, బాడీవాష్, టూత్‌పేస్ట్, బాడీలోషన్ తదితర ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఏ వస్తువైనా తయారీ దశ నుంచి మార్కెట్‌కు చేరుకునేవరకు కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత దుకాణం నుంచి వినియోగదారుడి చేతిలో పడటానికి ఇంకొంత వ్యవధి అవసరం అవుతుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియలో ఆయా ఉత్పత్తులకు హానికర క్రిముల ముప్పు పొంచి ఉంటుంది. దీంతో, ముందుజాగ్రత్తగా కొన్ని రసాయనాలు జోడించక తప్పదు. వాటిలో ఒకటి.. ట్రైక్లోసన్. ఇది ప్రాణాంతక కెమికల్. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. థైరాయిడ్ సంబంధ సమస్యలనూ తోసిపుచ్చలేం. పరిశోధకులు.. ట్రైక్లోసన్‌ను కొన్ని జంతువుల మీద దీర్ఘకాలం ప్రయోగించినప్పుడు విభ్రాంతికర ఫలితాలు వెలుగు చూశాయి. ఆ మూగజీవాల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. మనుషుల మీద ఇంకెంత ప్రభావం చూపుతాయన్నది తేలాల్సి ఉంది.
పారాబెన్స్
వీటి లక్ష్యం కూడా వివిధ ఉత్పత్తుల జీవితకాలాన్ని పెంచడమే. పారాహైడ్రాక్సిబెంజోయిక్ యాసిడ్.. సంక్షిప్త నామమే పారాబెన్స్. ఇందులో బుటైల్పారాబెన్, మెథైల్పారాబెన్, ప్రొపైల్పారాబెన్.. తదితర రకాలున్నాయి. వీటి అవలక్షణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఓ బ్రిటిష్ బృందం ఇరవైమంది మహిళలపై అధ్యయనం చేసినప్పుడు..
పందొమ్మిది మంది ఛాతీ కణజాలంలో పారాబెన్స్ ఆనవాళ్లను గుర్తించారు. కాస్మొటిక్స్‌ను శరీరానికి పూసుకున్నప్పుడు.. అవి నేరుగా చర్మ రంధ్రాల్లోకి వెళ్లి తిష్ఠవేస్తాయి. ఇలా పేరుకుపోయి ఏదో ఒక దశలో క్యాన్సర్‌కు దారితీస్తాయని నిపుణుల అంచనా. అక్కడితో ఆగకుండా ఈస్ట్రోజెన్ హార్మోన్లను ప్రభావితం చేసి.. సంతాన సాఫల్యతనూ దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. క్రమంగా చర్మ రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదు. ఒవేరియన్ క్యాన్సర్ ముప్పునకు కారణమైన రసాయనాల్లో ఇదీ ఒకటి. క్రీమ్స్, మాయిశ్చరైజర్స్లోనూ పారాబెన్స్ ఆనవాళ్లు ఉంటాయి. ఈ దుష్ఫలితాల కారణంగా కొన్ని కాస్మొటిక్స్ కంపెనీలు ఇటీవలి కాలంలో పారాబెన్ ఉపయోగించని మేకప్ క్రీమ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఎంతోకొంత ఊరటనిచ్చే విషయమిది.
మెర్క్యురీ – స్టెరాయిడ్స్- బెంజిన్
కొందరికి రంగు పిచ్చి. తెల్లగా ఉండటమే అందం అనుకుంటారు. చామనఛాయను చిన్నచూపు చూస్తారు. నిగారింపు కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఎన్ని ప్రమాదకర చికిత్సలకైనా సిద్ధపడతారు. దీనికి తగినట్టు కార్పొరేట్ శక్తులు కొత్తకొత్త ఉత్పత్తులతో రంగప్రవేశం చేస్తున్నాయి. స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్‌లో మెర్క్యురీ వల్ల చర్మ క్యాన్సర్లు చుట్టుముట్టే అవకాశాలున్నాయి. స్టెరాయిడ్స్ దెబ్బకు చర్మకణాలు శిథిలం అవుతాయి. ఈ సౌందర్య సాధనాలు కొంత చవకైనవే కావడంతో.. మధ్యతరగతి ఎగబడి కొంటున్నది. చాలా ఉత్పత్తుల మీద.. తయారీలో ఏయే రసాయనాలు వాడిందీ కచ్చితంగా తెలియజేయడం లేదు. తెలిసినా అర్థం చేసుకునే శక్తి చాలామందికి ఉండదు. అందులోనూ, ఒకటి రెండు రోజుల్లోనే చర్మాన్ని తెల్లబరిచే క్రీమ్స్‌లో మెర్క్యురీ, స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వాడుతుంటారు. చర్మ చికిత్సలలో వాడే కార్టికోస్టెరాయిడ్స్ అయితే మరింత ప్రమాదకరం.
పలు రకాల మేకప్ ఉత్పత్తులు, క్రీమ్స్‌లో బెంజిన్ వినియోగిస్తారు. దీనివల్ల లంగ్, బ్లాడర్ క్యాన్సర్లు వచ్చే ఆస్కారం ఉందని నిపుణుల హెచ్చరిక. రొమ్ము క్యాన్సర్, ఇతర క్యాన్సర్లకు సంబంధించి కుటుంబ నేపథ్యం ఉన్న వారు పారాబెన్స్, ట్రైక్లోసన్ ఉన్న ఉత్పత్తులకు సాధ్యమైనంత దూరం ఉండాలి. ట్రైక్లోసన్, టాల్కమ్ పౌడర్ల వల్ల క్యాన్సర్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్టు ఇప్పటికే స్పష్టమైన ఆధారాలున్నాయి. మిగిలినవన్నీ ప్రాథమికమైన అంచనాలే. ఒకటిరెండు రసాయనాలపై జరిగిన పరిమిత ప్రయోగాలే. కొంతమంది ఒకే ఉత్పత్తిని వాడతారు. మరికొందరు రెండుమూడు ఉత్పత్తులనూ ఎంచుకుంటారు. ప్రస్తుత అధ్యయనాలన్నీ.. ఒకే ఉత్పత్తిపై, ఒకే రకమైన రసాయనంపై జరిగినవే. ఒకే వ్యక్తి రెండుమూడు ఉత్పత్తులు వాడినప్పుడు.. దేని కారణంగా క్యాన్సర్ వచ్చిందన్న కోణంలో ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఇక, సన్‌స్క్రీన్ లోషన్ విషయంలో మాత్రం ఎలాంటి భయాలు అవసరం లేదని నిపుణులు హామీ ఇస్తున్నారు.
టాల్కమ్ పౌడర్
మొహానికి అద్దుకునే పౌడరుకు ‘టాల్కమ్ పౌడర్’ అని పేరు రావడానికి కారణం.. అందులోని టాల్కమ్. దీని చెడు ప్రభావం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. దీంతో యథేచ్చగా వాడుతున్నారు. మొహానికే కాదు, ఒళ్లంతా పూసుకుంటున్నారు. టాల్కమ్ ఉత్పత్తుల వల్ల ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. అందులోనూ ఈ పౌడర్‌ను పిల్లల విసర్జక అవయవాల దగ్గర, మహిళల జననాంగాల చుట్టుపక్కల అద్దుకోవడం మరీ ప్రమాదకరం. వీలైనంతవరకూ, టాల్క్ రహిత పౌడర్స్నే ఎంచుకోవాలి. టాల్కమ్ పౌడర్ చర్మాన్ని నునుపుగా ఉంచుతుంది, చెమటను పీల్చుకుంటుంది. ఇందులో మెగ్నీషియం, సిలికాన్ మొదలైన రసాయనాలు ఉపయోగిస్తారు. దీనిలోని ఆస్బెస్టాస్ క్యాన్సర్‌కు దారితీస్తుందని నిపుణుల హెచ్చరిక. తరచూ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ రావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు.
జాగ్రత్త.. జాగ్రత్త!
– డాక్టర్ సింధూర కంబంపాటి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్