క్యాన్సర్లలో మనదేశపు స్త్రీలలో ఎక్కువగా కనిపించేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్). ఈ క్యాన్సర్ బారిన పడకుండా హెచ్.పి.వి. వ్యాక్సిన్ ఉన్నా, అవగాహన లేమి ఒక కారణమైతే, అపరిశుభ్రత, అధిక కాన్పులు, చిన్న వయసు నుంచే శృంగార జీవితం, గ్రామీణ నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్.పి.వి. వైరస్ ఎక్కువగా ఉండటం.. ఇతర కారణాలు .అందుకే పెళ్లికాని అమ్మాయిలకు లేదా పెళ్లి అయినా ఈ క్యాన్సర్ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత, మూడు డోసులు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలం. వ్యాక్సిన్స్‌తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అరుదుగా ఇతర కారణాలవల్లా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, డాక్టర్ సలహా మేరకు తరచూ పాప్స్మియర్స్ చేయించుకుంటే గర్భాశయ ముఖ ద్వారంలోని కణాల మార్పును పసిగట్టవచ్చు. ఇంకా.. స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు, వాటి లక్షణాలు తెలుసుకుందాం.
అండాశయాల (ఒవేరియన్) క్యాన్సర్ :
స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తర్వాత ఎక్కువగా కనిపించేది అండాశయాల క్యాన్సర్. అండాశయం అనేది పొట్టలోపల ఉండటం వలన లక్షణాలు లేటుగా గుర్తించగలం. అందుకే ఈ క్యాన్సర్‌ను ‘సైలెంట్ కిల్లర్’గా పేర్కొంటూ ఉంటారు. పిల్లలు కలుగని స్త్రీలలో, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్లు, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.లక్షణాలు : 1. పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం 2. అజీర్తి, వికారం, త్రేన్పులు 3. యోని స్రావాలు అసాధరణంగా, మూత్రం ఎక్కువగా రావడం 4. అలసట, జ్వరం.
నిర్ధారణ : సి.ఎ. 125 రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో ఈ క్యాన్సర్‌ను నిర్ధారించగలుగుతాం.
యుటెరైన్ లేదా ఎండోమెట్రియల్ లేదా గర్భాశయ క్యాన్సర్లు :
గర్భసంచిలో లైనింగ్ ఎండోమెట్రియమ్. ఈ పొర మరీ పలుచగా లేదా 14 మి.మీ. కంటే ఎక్కువ మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలుగని స్త్రీలు, శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఎక్కువకాలం ఉన్నవారు, రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారు, నెలసర్లు 9 ఏళ్ల కంటే ముందు ప్రారంభమైన వారు, మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలు, ఊబకాయులు ఈ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 50 నుంచి 64 మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నది. అందుకనే మోనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక ఏడాది తర్వాత రక్తస్రావం కొద్దిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు టొమాక్సిఫెన్ మందు వాడిన స్త్రీలు, పెల్విస్‌కు రేడియోషన్ తీసుకున్నవారు, దీర్ఘకాలంపాటు హార్మోన్ థెరపీ తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ. నెలసర్లు మధ్యలో, మెనోపాజ్ దశ దాటాక రక్తస్రావం కనిపిస్తే అల్ట్రాసౌండ్, హిస్టిరోస్కోపీ, బయాప్సీ వంటి పరీక్షలు తప్పనిసరి.
వజైనల్ మరియు వల్వా క్యాన్సర్లు :
ఇవి స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి బయటకు కనిపించే అవయవాలకు (యోని, యోని పెదాలు) సంబంధించిన క్యాన్సర్లు. మెనోపాజ్ వయస్సులో థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నవారిలో, హెచ్.పి.వి. వైరల్, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా కచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ‘లైకన్ స్లీరోసస్’ అనే చర్మవ్యాధి వలన స్త్రీలకు యోని ప్రాంతంలో దురదలు కలిగి మచ్చలు పడతాయి. ఆ మచ్చలు వల్వార్ కార్సినోమా అనే చర్మ సంబంధ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. ‘లైకన్ సిరోసిస్’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు చికిత్స తీసుకోవటంతోపాటు తప్పనిసరిగా ‘క్యాన్సర్ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా?’ అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గైనిక్ క్యాన్సర్లకు చెక్ పెట్టాలంటే పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ, ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు..1. పొత్తికడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం, 2. అసాధారణమైన యోని స్రావాలు, రక్తస్రావం, 3. కలయిక సమయంలో రక్తం కనిపించడం, 4. నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం, 5. అలసట, జ్వరం, బరువు తగ్గడం. గైనకాలజికల్ క్యాన్సర్లు ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే, హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీలు, ఆ వెంటనే కీమో, రేడియోథెరపీలను తగినంత కాలం తీసుకోవడంతో ఈ క్యాన్సర్లను పూర్తిగా అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421