Over Weight | అధిక బరువు కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలపై అవగాహన రావడంతో చాలా మంది బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బరువు తగ్గడం చాలా మందికి ప్రధాన ఫిట్నెస్ లక్ష్యంగా మారింది. అయితే త్వరగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదే అనుకోవడం తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేగంగా బరువు తగ్గే ప్రయత్నాలు శరీరానికి అనేక రకాల నష్టాలను కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. బరువు తగ్గడం విజయంగా కనిపించినా, లోపల శరీరం బలహీనపడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. వేగంగా బరువు తగ్గితే కేవలం కొవ్వు మాత్రమే కాదు, కండరాలు, ఎముకల దృఢత్వం, శరీర బలం కూడా తగ్గిపోతాయి. బయటకు శరీరం సన్నగా కనిపించినా, లోపల శక్తి తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
త్వరగా బరువు తగ్గడం వల్ల ప్రధానంగా కండరాల నష్టం ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా సరిపడా ప్రోటీన్ తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలోని లీన్ మజిల్ మాస్ వేగంగా తగ్గిపోతుంది. దీనిని సార్కోపీనియా అని పిలుస్తారు. ఇది శరీర బలాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఎముకలపై పడే ఒత్తిడి తగ్గిపోవడం, పోషకాహార లోపాలు కలగడం వల్ల ఎముకల దృఢత్వం కూడా తగ్గుతుంది. దీని కారణంగా ఫ్రాక్చర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కండరాలు శరీర మెటబాలిజంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి తగ్గిపోతే మెటబాలిజం మందగిస్తుంది. దీంతో భవిష్యత్తులో బరువు తగ్గడం కష్టమవుతుంది. మరోవైపు తిరిగి బరువు పెరగడం మాత్రం చాలా సులభమవుతుంది. ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారుతుంది.
ఆహారం తగ్గించడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా తక్కువగా అందుతాయి. ఐరన్, విటమిన్ బి12, విటమిన్ డి, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాల లోపం వల్ల అలసట, బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వేగంగా బరువు తగ్గిన వారిలో సాధారణంగా బలహీనత, అలసట, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది, త్వరగా గాయాలు కావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కండరాల బలం తగ్గిపోవడం వల్ల పడిపోవడం, గాయపడే ప్రమాదం కూడా పెరుగుతుంది. అదేవిధంగా శరీరంలో ఇన్సులిన్ స్పందన తగ్గి, భవిష్యత్తులో జీవక్రియ సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే సరైన విధానాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. శరీర బరువు ప్రతి కిలోకు 1.2 నుంచి 1.6 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేదా బలం పెంచే వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు కాపాడుకోవచ్చు. అలాగే శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందేలా సమతుల ఆహారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడవచ్చు. బరువు తగ్గే సమయంలో కండరాల స్థాయి, ఎముకల దృఢత్వం, మెటబాలిజం వంటి అంశాలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. త్వరగా బరువు తగ్గడమే లక్ష్యం కాకుండా, ఆరోగ్యంగా, బలంగా మారడమే అసలు లక్ష్యంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణతో బరువు తగ్గితేనే దీర్ఘకాలికంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.