Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళ ఈ వ్యాధితో మరణించినట్లు వచ్చిన వార్తలు ఉత్తర అమెరికాలో ఆన్లైన్ చర్చకు దారితీశాయి. ఈ వ్యాధికి చికిత్సలు ఏమిటి? ముందస్తుగా ఎలాంటి మందులు అందుబాటులో ఉంచుకోవాలి? అనే అంశాలపై ఆసక్తి పెరిగింది. అయితే, సదరు మహిళ ప్లేగు వ్యాధితో మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు.
Plague | రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళ ఈ వ్యాధితో మరణించినట్లు వచ్చిన వార్తలు ఉత్తర అమెరికాలో ఆన్లైన్ చర్చకు దారితీశాయి. ఈ వ్యాధికి చికిత్సలు ఏమిటి? ముందస్తుగా ఎలాంటి మందులు అందుబాటులో ఉంచుకోవాలి? అనే అంశాలపై ఆసక్తి పెరిగింది. అయితే, సదరు మహిళ ప్లేగు వ్యాధితో మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ గుర్తించి పరిశీలించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు గుర్తించలేదని స్థానిక ప్రాంత గవర్నర్ వెల్లడించారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు, అత్యవసర పరిస్థితుల కోసం ముందుగానే సిద్ధమయ్యే వ్యక్తులు సుమారు 300 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.25 వేలకుపైగా) విలువైన ఓ మెడికల్ కిట్‌ను కొనుగోలు చేయాలని ప్రచారం చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం..
ఈ కిట్‌తో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి అత్యవసర విభాగానికి వెళ్లాల్సిన అవసరాన్ని నివారించవచ్చని వారు పేర్కొంటున్నారు. అందరూ ఆందోళనతో పరుగులు తీసే వరకు వేచి ఉండకండి. అవసరం రాకముందే సిద్ధంగా ఉండండి.. అనే సందేశంతో ఫేస్బుక్లో ప్రచారం చేసిన ఓ వీడియోకు 1.61 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ పోస్టుల్లో రష్యా, ప్లేగు అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించారు. ఈ ప్రచార పోస్టుల్లో వ్యక్తిగత డిస్కౌంట్ కోడ్లను కూడా జతచేశారు. అంటే, వాటి ద్వారా ఎవరైనా కిట్ కొనుగోలు చేస్తే ప్రచారం చేసిన వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వీడియోల్లో ఎక్కువగా ప్రచారం పొందిన ది వెల్నెస్ కంపెనీ బ్రాండ్‌పై గూగుల్ ట్రెండ్స్ గణాంకాల ప్రకారం ఆన్లైన్ శోధనలు కూడా పెరిగాయి. అమెరికాకు చెందిన కార్డియాలజిస్ట్ పీటర్ మెక్కలౌ ఈ కంపెనీకి ప్రధాన ప్రచారకర్తగా ఉన్నారు. గతంలో ఆయన కోవిడ్-19కు సంబంధించిన కుట్ర సిద్ధాంతాలు, వైద్యపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. వాటిలో కొన్ని వాదనలను ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వాస్తవ నిర్ధారణలో తప్పుగా తేల్చింది. ఈ మెడికల్ కిట్ల గురించి అడిగిన ప్రశ్నలకు కంపెనీ వెంటనే స్పందించలేదు.
డాక్సీ సైక్లిన్ పేరిట పబ్లిసిటీ..
సామాజిక మాధ్యమాల్లో డీసీ డ్రైనో పేరుతో గుర్తింపు పొందిన రోజన్ ఓహ్యాండ్లీ, ఈ కిట్‌లో డాక్సీసైక్లిన్ అనే యాంటీబయాటిక్ ఉన్న విషయాన్ని తన 29 లక్షల మంది అనుచరులకు ప్రత్యేకంగా వివరించారు. ప్రతి ఏడాది ప్లేగు కేసులు నమోదయ్యే కొన్ని దేశాల్లో ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందుల్లో డాక్సీసైక్లిన్ కూడా ఒకటి. వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అయితే, ప్లేగు వ్యాధికి చికిత్స అందించే మార్గాలు వైద్యులకు తెలుసునని టొరంటో జనరల్ ఆసుపత్రికి చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఐజాక్ బోగోచ్ స్పష్టం చేశారు. ఈ వ్యాధి తీవ్రంగా మారే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. అయితే, వ్యాధి సోకినట్లు నిర్ధారణ లేకుండా లేదా వ్యాధి బారిన పడిన వ్యక్తితో సంబంధం ఉన్నట్లు తెలియకుండా యాంటీబయాటిక్స్ వాడడం సరికాదని ఆయన హెచ్చరించారు. రష్యాలో వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న కేసును ఇంకా ధ్రువీకరించలేదని, అది మహమ్మారికి దారితీసే తరహా సంక్రమణ కాదని పేర్కొన్నారు.
యాంటీ బయాటిక్స్ వాడవచ్చా..
ఉత్తర అరిజోనా విశ్వవిద్యాలయంలో ప్లేగు వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ పాల్ కీమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉత్తర అమెరికా ప్రజలు ముందుజాగ్రత్త పేరుతో డాక్సీసైక్లిన్ వాడాల్సిన అవసరం లేదని తెలిపారు. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటుందని, అంతేకాకుండా యాంటీబయాటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియా శరీరంలో అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని వివరించారు. నిజంగా చికిత్స అవసరమైనప్పుడు ఈ తరహా నిరోధక బ్యాక్టీరియా మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మెడికల్ కిట్లలో సాధారణంగా దొరకడం కష్టమైనవిగా చెబుతున్న ఐవర్‌మెక్టిన్ వంటి ప్రిస్క్రిప్షన్ మందులు కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఐవర్మెక్టిన్ను బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల చికిత్సకు సాధారణంగా ఉపయోగించరని పాల్ కీమ్ స్పష్టం చేశారు. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆమోదించిన వినియోగాల్లో ఈ మందు కొన్ని పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల పురుగుల సంక్రమణలకు దీనిని ఉపయోగిస్తారు.
ఐవర్‌మెక్టిన్ పరిష్కారమా..
అయినప్పటికీ, ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వ్యక్తులు ఐవర్మెక్టిన్ను తరచూ పరిష్కారంగా చూపిస్తున్నారు. కోవిడ్-19 చికిత్సలో ఈ మందు ప్రభావవంతంగా పనిచేస్తుందనే వాదనలకు మద్దతుగా తగిన ఆధారాలు లభించకపోవడం, క్లినికల్ ట్రయల్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం వంటి అంశాల నేపథ్యంలో అధికారులు ఆ వాదనలను తోసిపుచ్చారు. ప్రజారోగ్యానికి సంబంధించిన ఆందోళనలు తలెత్తినప్పుడు నిరూపణ లేని వైద్య పరిష్కారాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. మే నెలలో ఓ క్రూయిజ్ నౌక ప్రయాణికుడికి అరుదైన హాంటావైరస్ సోకినట్లు వెల్లడైనప్పుడు, దానికి తెలిసిన నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో కొందరు ఐవర్మెక్టిన్ను నివారణ మందుగా ప్రచారం చేశారు.
విటమిన్ డి3, జింక్ సంగతేంటి..
అలాగే, 2026లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాప్తి చోటుచేసుకున్న సమయంలో, విటమిన్ డి3, జింక్ తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చని ఓ వైద్యుడు సూచిస్తున్నట్లుగా వీడియోలు వ్యాపించాయి. ఈ వీడియోలను సప్లిమెంట్లను విక్రయించే ఖాతాలు ప్రచారం చేశాయి. అయితే, విటమిన్ డి3, జింక్ ఎబోలాను నయం చేయలేవు. ఆల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్, తప్పుడు సమాచార వ్యాప్తిపై నిపుణుడు తిమోతి కాల్ఫీల్డ్ ఈ ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో సమస్యలు ఎదురైనప్పుడు, ప్రజల భయాలను ఆసరాగా చేసుకునే మోసగాళ్లు బయటకు వస్తారు. ప్రజల్లోని భయాందోళనలు, అనిశ్చితిని ఉపయోగించుకుని శాస్త్రీయంగా నిరూపణ కాని ఉత్పత్తులను విక్రయిస్తారు.. అని ఆయన పేర్కొన్నారు.
ప్లేగు వంటి తీవ్రమైన వ్యాధులపై ఆందోళనతో వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు తీసుకోవడం ప్రమాదకరం. వ్యాధి నిర్ధారణ, మందుల వినియోగం విషయంలో అర్హత కలిగిన వైద్య నిపుణుల సూచనలనే పాటించాలని వారు తెలిపారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
‘కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

