Obesity In Kids | చిన్నారుల్లో ఊబకాయం (Childhood Obesity) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇది గణనీయంగా పెరిగిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 1990లో 2 శాతంగా ఉన్న ఈ సమస్య, 2022 నాటికి 8 శాతానికి పెరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల్లో కోట్ల సంఖ్యలో అధిక బరువు సమస్య నమోదవుతోంది. ఈ పెరుగుదలకు ఆధునిక జీవనశైలి, పర్యావరణ మార్పులు, శారీరక క్రియాశీలత తగ్గడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో, స్క్రీన్ టైమ్ అధికం కావడం, జంక్ ఫుడ్ అలవాటు ఈ సమస్యకు ప్రధాన కారకాలుగా నిలిచాయి. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపే పిల్లలు శారీరకంగా చురుకుగా ఉండలేరు. బయట ఆడుకోవడం తగ్గిపోవడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాకుండా ఎక్కువ స్క్రీన్ టైమ్ నిద్ర విధానాన్ని కూడా దెబ్బతీస్తుంది. నిద్రలేమి కారణంగా ఆకలి నియంత్రణలో గందరగోళం ఏర్పడి, పిల్లలు ఎక్కువగా తినే ప్రమాదం ఉంటుంది.
ఇక జంక్ ఫుడ్ విషయానికి వస్తే ఇవి అధిక చక్కెర, ఉప్పు, అనారోగ్యకర కొవ్వులను కలిగి ఉంటాయి. ఈ ఆహారాలు మెదడులో డోపమైన్ విడుదలను పెంచి, మరింత తినాలనే కోరికను కలిగిస్తాయి. దీని వల్ల పిల్లలు తృప్తి భావాన్ని కోల్పోయి, ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇది క్రమంగా బరువు పెరగడానికి దారి తీస్తుంది. అలాగే స్క్రీన్ చూస్తూ తినడం కూడా ఒక ముఖ్యమైన సమస్య. ఈ సమయంలో పిల్లలు తాము ఎంత తింటున్నారో గమనించరు. దీని వల్ల అధికంగా తినే అలవాటు ఏర్పడుతుంది. అదనంగా టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే ప్రకటనలు పిల్లలను జంక్ ఫుడ్ వైపు ఆకర్షిస్తాయి. స్క్రీన్ టైమ్, జంక్ ఫుడ్ రెండూ కలిపి మెదడు రివార్డ్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతాయి. దీని వల్ల పిల్లలు మరింత స్క్రీన్ టైమ్, తీపి పదార్థాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక చెడు చక్రంలా మారి, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఈ సమస్యను నివారించడానికి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలి. రోజుకు కనీసం 60 నిమిషాల శారీరక వ్యాయామం లేదా ఆటలు పిల్లలు చేయాలని ప్రోత్సహించాలి. స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలకు రోజుకు ఒక గంటకు మించకుండా స్క్రీన్ టైమ్ ఉండేలా చూడాలి. ఇంటి వద్ద ఆరోగ్యకరమైన ఆహారాలను అందించడం అవసరం. పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ ఆహారాలను ప్రోత్సహించాలి. పిల్లలను ఆహార తయారీలో భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి ఆహార అలవాట్లు పెంపొందించవచ్చు. తల్లిదండ్రులు స్వయంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, స్క్రీన్ లేకుండా తినడం వంటి అలవాట్లు మంచి ఫలితాలను ఇస్తాయి. స్క్రీన్ టైమ్, జంక్ ఫుడ్ ప్రభావాలను నియంత్రించడం ద్వారా చిన్నారుల్లో ఊబకాయం సమస్యను తగ్గించవచ్చు. సరైన అలవాట్లను అలవరచడం ద్వారా పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.