లవంగాన్ని నోటిలో ఉంచుకొని పడుకుంటే.. కమ్మటి నిద్ర పట్టేస్తుందని సోషల్ మీడియాలో రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని గుడ్డిగా నమ్మేస్తూ.. కొందరు ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా.. రాత్రిపూట లవంగాన్ని నోట్లో పెట్టుకొని పడుకోవడం మంచిదికాదని చెబుతున్నారు.
లవంగాన్ని నోటిలో ఉంచుకుని నిద్రపోవడం వల్ల.. అది శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. దాంతో ఊపిరి ఆడకపోవడం, ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇక చాలా ఘాటుగా ఉండే లవంగాన్ని నోటిలోనే ఎక్కువసేపు ఉంచుకోవడం మంచిదికాదు. అలాచేస్తే.. బుగ్గ లోపలి భాగం, నాలుక కాలినట్లు అవ్వడం, నోటి పూత వచ్చే అవకాశం ఉంటుంది. లవంగం తక్కువ మోతాదులో తీసుకుంటేనే సురక్షితం. అధికంగా వాడటం వల్ల నోటిలో మంట, కడుపులో అసౌకర్యం, అలెర్జీలు కలగవచ్చు. అయితే, లవంగాలలో ఉండే కొన్ని గుణాలు పరోక్షంగా మంచి నిద్రకు సహాయపడవచ్చని చెబుతున్నారు. లవంగాలలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
కాబట్టి, లవంగం నమలడం, దాని సువాసనను పీల్చడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గి మంచినిద్ర రావడానికి సహాయపడవచ్చు. లవంగంలో ‘యూజినాల్’ అనే సహజ సిద్ధమైన యాంటి సెప్టిక్ లక్షణం ఉంటుంది. ఇది రాత్రి వేళల్లో నోటిలోని బ్యాక్టీరియాను నివారించి, పంటి నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. నొప్పి లేకపోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టే అవకాశం ఉంది. కొందరికి రాత్రిపూట గ్యాస్, అజీర్తి వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. లవంగం లాలాజలాన్ని పెంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. తద్వారా కడుపు అసౌకర్యం తగ్గి నిద్ర బాగుంటుంది. కాబట్టి, లవంగం ప్రయోజనాలను పొందాలనుకుంటే.. పడుకోవడానికి ఒక అరగంట ముందు ఒక లవంగాన్ని నమిలి, ఆ రసాన్ని మింగేయాలి. ఆ తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కుని పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.