Moringa Leaves | మునగ చెట్టును వైద్య పరిభాషలో మిరాకిల్ ట్రీ అని పిలుస్తారు. అంటే అదృష్టాలను తెచ్చి పెట్టే చెట్టు అన్నమాట. పేరుకు తగినట్లుగానే ఈ చెట్టు ఆరోగ్యం రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది. మునగాకుల్లో అత్యంత శక్తివంతమైన పోషకాలు నిండి ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇవి విస్తృతంగా గుర్తింపు పొందాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ సమృద్ధిగా ఉండగా, మునగాకులోని విటమిన్ సి పరిమాణం నారింజ పండ్ల కంటే ఎక్కువగా, కాల్షియం పాల కంటే ఎక్కువగా ఉండటం ప్రత్యేకత. అందువల్ల ఇవి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి అత్యుత్తమ ఎంపికగా నిలుస్తాయి. పోషకాలతో నిండిన ఈ ఆకులు నిజంగా ఆహారంలో పెద్ద మార్పు తీసుకువచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అంతేకాకుండా మునగాకు ఐరన్, ప్రోటీన్‌కు కూడా గొప్ప వనరుగా ఉండటం వల్ల భోజనంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థంగా మారింది.
పోషక విలువలతోపాటు ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. రోజువారీ జీవితంలో మునగాకును చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని అనేక మార్గాల్లో మెరుగుపరచుకోవచ్చు. మునగాకు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. పరిశోధనలు సూచిస్తున్నట్లుగా మునగాకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. వీటిలో ఉన్న అధిక ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ (ఫైటోస్టెరాల్స్) జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను బంధించి బయటకు పంపడంలో సహాయపడతాయి. దీని వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిలు తగ్గే అవకాశాలు ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో కూడా మునగాకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం రక్తనాళాలను సడలించి సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అదనంగా క్వెర్సెటిన్, నియాజిమిసిన్ వంటి బయో యాక్టివ్ పదార్థాలు సహజ వాసోడైలేటర్లుగా పనిచేసి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
మునగాకు యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప వనరు. ఇందులో 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ముఖ్యమైనవి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ గుండె కణజాలాన్ని దెబ్బతీసి గుండె వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షించడంలో కీలకంగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర నియంత్రణలో కూడా మునగాకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి ఇది సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడం గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనది. నియంత్రణలో లేని మధుమేహం గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. మునగాకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం. మునగాకులోని సమ్మేళనాలు ఈ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా గుండె వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది.
మునగాకును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. తాజా లేదా పొడి మునగాకును స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. అరటిపండ్లు లేదా బెర్రీలతో కలిపితే రుచికరంగా ఉంటుంది. సూపులు, కూరలు లేదా స్టిర్-ఫ్రై వంటకాలలో చివర్లో కలిపితే పోషకాలు నిల్వ ఉంటాయి. సలాడ్లలో కూడా మునగాకు జోడించవచ్చు. ఎండబెట్టిన మునగాకుతో టీ తయారు చేసుకుని తాగవచ్చు. తాజా మునగాకు దొరకని పరిస్థితుల్లో పొడి లేదా క్యాప్సూల్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. అదనంగా మునగాకును పిండి ముద్దలో కలిపి చపాతీలు లేదా పరాటాలు తయారు చేయవచ్చు. మునగాకును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం గుండె ఆరోగ్యంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఇప్పటికే రక్తపోటు లేదా మధుమేహానికి మందులు తీసుకుంటున్న వారు, మునగాకును వినియోగించే ముందు వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇది మందుల ప్రభావాన్ని పెంచి చక్కెర లేదా రక్తపోటు స్థాయిలను అధికంగా తగ్గించే ప్రమాదం ఉంది.