Metabolic syndrome | మెటబాలిక్ సిండ్రోమ్.. ఇబ్బందుల సమాహారం..

మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక జీవనశైలి వ్యాధి. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది పలు జీవక్రియలలో ఏర్పడే విపరీత పరిణామాల వల్ల కలిగే ఇబ్బందుల సమాహారం. ఈ ఇబ్బందులు దీర్ఘకాలిక జబ్బులైన గుండెపోటు, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధికి దారితీస్తాయి. తద్వారా మనిషి శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఎక్కువ స్థాయిలో కొలెస్ట్రాల్ (కొవ్వు) ఏర్పడడం, అధిక రక్తపోటుతో పాటు పొత్తికడుపు చుట్టూ కొవ్వు పెరగడం వంటి లక్షణాలు లేదా వ్యాధులకు దారితీస్తుంది.
వ్యాధి నిర్ధారణ ఎలా?
మెటబాలిక్ సిండ్రోమ్‌ను నిర్ధారించడానికి ఐదు అంశాలను పరిగణనలోనికి తీసుకొంటారు. అవి..
- నడుము చుట్టుకొలత పెరగడం అంటే మగవారిలో 102 సెం.మీ (40 అంగుళాలు) కంటే ఎక్కువ ఉండడం లేదా మహిళలలో 88 సెం.మీ (35 అంగుళాలు) కన్నా ఎక్కువగా ఉండడం.
- ఇన్సులిన్ రెసిస్టెన్స్ (ఇన్సులిన్ నిరోధకత)- ఆహారం తీసుకోక ముందు చక్కెర స్థాయిలు 100 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉండడం.
- ఎక్కువ రక్తపోటు, అంటే రక్తపోటు స్థాయిలు 130/85 ఎంఎం హెచ్‌జీ కన్నా ఎక్కువగా ఉండడం.
- ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్, అనగా కొవ్వు సంబంధిత పదార్థములు 150 ఎంజీ/డీ కన్నా ఎక్కువగా ఉండడం.
- తక్కువ హెచ్‌డీఎల్ స్థాయి, అనగా హెచ్‌డీఎల్ అనబడే కొలెస్ట్రాల్ పురుషులలో 40 ఎంజీ/డీఎల్, మహిళలలో 50 ఎంజీ/డీఎల్ కన్నా తక్కువగా ఉండడం.
పైన పేర్కొన్న వాటిలో కనీసం మూడు లక్షణాలు ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ వ్యాధికి సంబంధించిన తదుపరి పరీక్షలు చేయించుకోవాలి.
మనదేశంలో వ్యాధి తీవ్రత, ప్రభావం: దేశంలో 30 నుంచి 40 శాతం మంది మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారనేది ఒక అంచనా. ఇది అత్యంత పిన్న వయస్కులను అతి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేసి, తద్వారా వారి ఉత్పాదకతను తగ్గిస్తుంది. అంటే, ఎక్కువగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చి పనికి వెళ్లలేక ఎక్కువగా సెలవులు తీసుకోవడంతో పాటూ జీవనకాలం తగ్గిపోయే అవకాశాలున్నాయి.
ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది?
- ఊబకాయం లేదా అధిక బరువు – బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ) 25 కేజీ/ఎమ్2 కన్నా ఎక్కువగా ఉంటే దానిని ఎక్కువ బరువు ఉండడం అని లేదా బీఎమ్ఐ 30 కేజీ/ఎమ్2 కన్నా ఎక్కువగా ఉండడాన్ని ఊబకాయం అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ 25 కన్నా ఎక్కువగా ఉన్న వారిని మెటబాలిక్ సిండ్రోమ్ నిర్ధారణకు అర్హులుగా పరిగణించాలి.
- వయస్సు పెరిగే కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్ ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. 60 సంవత్సరముల వయస్సు మీరిన వారిలో, అందులోనూ పురుషులలో కన్నా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
- తల్లిదండ్రుల్లో ఒకరికైనా ఊబకాయం, అధిక బరువు, డయాబెటిస్ వ్యాధి లేదా హైపర్ టెన్షన్ లాంటి వ్యాధి ఉంటే, వాళ్ల పిల్లల్లో ఇది సాధారణంగా కనిపిస్తోంది.
- నిశ్చల జీవనశైలి ఉన్న వాళ్ళు మరియు తక్కువ శారీరక శ్రమ, తక్కువ కదలిక ఉన్నవాళ్ళు, ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగస్థులు మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగస్థులు.
మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగా ఏర్పడే సమస్యలు
- గుండె సంబంధిత వ్యాధులు
- టైప్-2 డయాబెటిస్
- పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్/పీసీఓడీ)
- నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్: ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది. అయితే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వారిలో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఉన్నందున వారి లివర్‌లో కొవ్వు శాతం పెరగడం లేదా లివర్ పాడవ్వడం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు.
- అబ్స్రాక్టీవ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ)- ఊబకాయం ఉన్న పేషెంట్లలో గాలి పీల్చుకొనే నాళాలకు మద్దతుగా నిలిచే కండరాలు పటిష్టతను కోల్పోవడం ద్వారా గాలి నాళాలు కుంచించుకొని పోయి తద్వారా గాఢ నిద్రలో ఉన్న సమయాల్లో గాలి నాళాల్లో ఇబ్బందులు ఏర్పడి, స్వల్ప సమయాలకు శ్వాస తీసుకోవడం ఆగిపోయి తద్వారా ఇబ్బందికి గురైన పేషెంట్ నిద్ర లేవడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్లకు నిద్రాభంగం కలుగుతుంటుంది. ఇలాంటి వారు గురక పెట్టడమే కాకుండా నిద్ర లేచిన వెంటనే ఉదయం వేళల్లో తలనొప్పి, పగటి పూట నిద్రావస్థ ఏర్పడడం, మానసిక స్థిరత్వం లేకపోవడం, ఊపిరితిత్తులలో ఒత్తిడి పెరిగిన కారణంగా ఊపిరితిత్తుల రక్త నాళాలలో ఒత్తిడి పెరగడం మరియు గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయి.
మెటబాలిక్ సిండ్రోమ్ వ్యాధికి చికిత్స:
తీసుకొనే ఆహారాన్ని నియంత్రించుకోవడం- తక్కువ కార్బోహైడ్రేట్స్, అంటే తక్కువ పిండిపదార్థాలు, తక్కువ కొవ్వు ఉండి ప్రొటీన్ మరియు ఫైబర్ల శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. మైదా లేదా బియ్యం వంటి వాటిని తీసుకోవడం కన్నా ఫైబర్ ఎక్కువగా ఉండే తృణ ధాన్యాలు తీసుకోవాలి. అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన కనోలా, ఆలివ్, రైస్‌బ్రాన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి వాటిని తీసుకోవాలి. ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్, నూనెలో వేయించిన ఆహార పదార్థములు తగ్గించాలి లేదా మానేయాలి. కొవ్వు తక్కువగా ఉండే లీన్ మీట్(చికెన్) లేదా చేప ఎక్కువగా తీసుకొంటూ ఎర్రమాంసం తగ్గించాలి లేదా మానేయాలి.
వ్యాయామం: వారంలో కనీసం ఐదురోజుల పాటు రోజూ కనీసం 45 నిమిషాలపాటు శారీరక శ్రమ అత్యంత అవసరం. కార్డియో లేదా ఏరోబిక్ వ్యాయామాలు.. అంటే పరిగెత్తడం, ఈత, ట్రెడ్మిల్, సైక్లింగ్ వంటివి బరువు తగ్గించడమే కాకుండా నిశ్చలత్వంలో ఏర్పడే హార్ట్‌రేట్‌ను తగ్గించి గుండె ఆరోగ్యం పెరగడానికి దోహదపడతాయి.
మందులు: వ్యాయామం మరియు తీసుకొనే ఆహార నియంత్రణలతో బరువు తగ్గకపోతే మందుల అవసరం ఏర్పడుతుంది. ఓర్లిస్టాట్ (ఫ్యాట్ అబ్సార్పన్ ఇన్హిబిటర్), లార్కార్సెరిన్(అపెటైట్ సప్రెసంట్స్) వంటి ఆకలి తగ్గించే మందులు కొంతమేర బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు రక్తపోటు తగ్గించడానికి వాడే మందులు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గించే ఫైబ్రాట్స్ వంటి మందులు, చక్కెర వ్యాధి నియంత్రించే మందులు అవసరమైతే తీసుకోవాల్సి ఉంటుంది. మెట్‌పార్మిన్ అనేది అత్యంత తక్కువ సైడ్ ఎఫెక్ట్ కలుగజేస్తూ షుగర్‌ను నియంత్రించే మందులు వినియోగించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా పీసీఓఎస్ ఉన్నవారిలో ఫెర్టిలిటీ పెరగడానికి దోహదం చేస్తుంది.
బేరియాట్రిక్ సర్జరీ: బీఎమ్ఐ శాతం 40 కన్నా ఎక్కువగా ఉన్న రోగులకు బేరియాట్రిక్ సర్జరీ అవసరమవుతుంది.
మానవుని జీవనశైలిని ఎంతగానో ప్రభావం చేసి ఇబ్బందులకు గురి చేసే ఈ మెటబాలిక్ సిండ్రోమ్‌ను ఆహార నియంత్రణ, వ్యాయామం మరియు బరువు తగ్గడం వంటి సాధారణ ప్రయత్నాలతో దూరం చేయవచ్చు.
డా. స్పందన కనపర్తి
కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్
ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్
రేనోవా హాస్పిటల్స్, సనత్ నగర్
సంప్రదించవలసిన నం. 040-21111100, 9121012265
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

