స్కిజోఫ్రేనియా.. మెదడుకు సంబంధించిన రుగ్మత. మన ఆలోచనలు, భావోద్వేగాలకు ఆటంకం కలిగిస్తుంది. ఇది కౌమారం చివరి దశలో కానీ, వృద్ధాప్యం ఆరంభంలో కానీ మొదలవుతుంది. ఆడామగా తేడా లేకుండా అందరినీ పీడిస్తుంది. సమస్య ఉన్నవారిలో 20-30 శాతం మందిలో వ్యాధి తీవ్రత కొంతకాలమే ఉంటుంది. మిగిలిన వారిలో మాత్రం దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. స్కిజోఫ్రేనియా రోగుల్లో 10 శాతం మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు అంచనాలు ఉన్నాయి. లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం హల్యూసినేషన్స్, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం, ఎవరితోనూ కలవకపోవడం, అచేతనంగా ఉండటం, భావోద్వేగాల విషయంలో మొండిగా ఉండటం, అసందర్భమైన ప్రతిస్పందనలు, అర్థంలేని ఆలోచనలు, జ్ఞాపకశక్తి లోపం, లోచూపు లేకపోవడం లాంటివి స్కిజోఫ్రేనియా ప్రధాన లక్షణాలు.
అయితే అందరిలో అన్ని లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొన్ని లక్షణాలు కొంతకాలంపాటే ఉండొచ్చు కూడా. చాలామంది అపోహ పడుతున్నట్టు స్కిజోఫ్రేనియా రోగులు ఉన్మాదుల్లా-విరుద్ధమైన వ్యక్తిత్వాలను కలిగినవాళ్లేం కాదు. తక్షణం వారికి చికిత్స ఇప్పిస్తే సరిపోతుంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్లో చేర్పించాలి. రోగ లక్షణాలు మరుగున పడిపోగానే ఎప్పట్లా జీవించగలరు. మంచి యాంటీసైకోటిక్ ఔషధాలతో తొందరగా కోలుకుంటారు కూడా. అయితే, ఈ రకమైన మందులు కొన్ని విపరీత లక్షణాలు తగ్గిస్తాయి కానీ, రోగాన్ని పూర్తిగా నయం చేయలేవు. కాబట్టి, ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంటుంది. దుష్ఫలితాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.