లంఖణం పరమౌషధం అంటారు. ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు ఒంట్లో శక్తి అంతా జీర్ణశక్తికి ఖర్చయిపోకుండా ఈ సూచన చేస్తారు. కానీ, ఇప్పటి రోజులు వేరు! ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్యాన్ని తట్టుకుంటూనే రోజువారీ పనులకు కావల్సిన శక్తి అందుకోవాలి. అలాగని జీర్ణశక్తి మీద భారమూ పడకూడదు. దానికోసం ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాలు ఇవి…
చికెన్ సూప్: ఇందులోని అమైనో యాసిడ్స్ కఫాన్ని నియంత్రిస్తాయి. వాపును, గొంతులో గరగరను తగ్గించే గుణమూ దీనికి ఉంది.
అల్లం టీ: రోగ నిరోధక శక్తిని పెంచి, వికారాన్ని తగ్గించి,జీర్ణవ్యవస్థకు సాయం చేస్తుంది.
అరటిపండు: తేలికగా జీర్ణమవుతుంది. ఇందులోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒంట్లోని ఎలక్ట్రోలైట్స్‌ను సమతులంగా ఉంచుతుంది.
ఆలుగడ్డ: ఉడికించిన ఆలుగడ్డలు చక్కగా జీర్ణమవుతాయి. రుచిగానూ ఉంటాయి. వీటిలోని విటమిన్ సి, బి6 ఆరోగ్యాన్ని పుంజుకునేలా చేస్తాయి.
అన్నం: చాలామందికి తెలియకపోవచ్చు కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు మెత్తగా పిసికిన అన్నాన్ని మించిన బలవర్ధక ఆహారం లేదు. త్వరగా జీర్ణమై తగినంత శక్తినిస్తుంది.