Keto diet | శరీరం బరువు పెరుగుదల అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. శరీరాన్ని నాజూగ్గా ఉంచుకునేందుకు అన్ని వయసుల వారు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు ఆహారాలను మానేస్తుండగా.. మరికొందరు వ్యాయామాలు చేస్తున్నారు. ఇంకొందరు వైద్య చికిత్స పొందుతున్నారు. ఎన్నో రకాల టిప్స్ పాటించి వివిధ చికిత్సలు తీసుకుంటున్నా.. శరీరం బరువు ఏమాత్రం తగ్గని చాలా మంది కొత్త రకం డైట్.. కీటో డైట్‌ను ఎంచుకుంటున్నారు. శరీరం బరువు తగ్గడానికి కీటో డైట్ అత్యుత్తమం అని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. ఇది సరైన డైట్ కాదన్న వాదన కూడా వినిపిస్తున్న తరుణంలో కీటో డైట్ మన ఆరోగ్యానికి ఎంతవరకు ప్రయోజనకరం అనే విషయాలను తెల్సుకుందాం.
ఎపిలెప్సీ బాధితుల కోసం కీటో డైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు బరువు తగ్గడానికి, పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్, మచ్చలు, ఇతర నాడీ సంబంధ సమస్యలకు విరుగుడుగా ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. కీటో డైట్‌ను అనుసరించే వారు ముఖ్యంగా మాంసం, చేపలు, పాలు, గుడ్లు తీసుకోరు. కేవలం ఆకుకూరలు, కూరగాయల రసాలనే తీసుకుంటారు. అయితే, ఈ డైట్ వల్ల శరీరానికి పోషకాల లోపం తలెత్తుతుందని వైద్యులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రోటీన్స్, విటమిన్ బీ12 కొరత ఏర్పడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
కీటో డైట్ అంటే..
శరీరానికి అవసరమయ్యే రోజువారీ క్యాలరీ విలువలో 70 నుంచి 80 శాతం కొవ్వు పదార్థాల నుంచి, 20 శాతం ప్రోటీన్ల నుంచి మిగిలిన 5 శాతం కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తుంది. ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, కొద్దిగా కొవ్వులు తీసుకోవడమే కీటో డైట్ విధానం. ఈ విధానంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా అందుతుండటంతో శరీరం తనకు కావాల్సిన శక్తిని కొవ్వు నుంచి పొందుతుంది.
ఈ విధానంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మానడం వలన కొన్ని రకాల విటమిన్లు, పోలీఫెనాల్స్, పీచు శరీరానికి లభించవు. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. పైగా కండరాలు కూడా కరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కీటో డైట్‌ను పాటించే ముందు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడం అవసరమా అన్నది అలోచించుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గిస్తూనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గింజలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరం బరువును తగ్గించుకోవచ్చునని తెలుసుకోవాలి.
కీలో డైట్ ఫుడ్ లిస్ట్
చికెన్, మటన్, చేపలు, రొయ్యలు
కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు
నట్స్, అవిసె, గుమ్మడి, పొద్దు తిరుగుడు గింజలు
కొబ్బరినూనె, వెన్న, నెయ్యి, చీజ్, పాల మీగడ
కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్
దూరం పెట్టాల్సినవి..
గోధుమలు, మొక్కజొన్న, తృణధాన్యాలు, బియ్యం
తేనె, చక్కెరలు
యాపిల్, అరటిపండ్లు, నారింజ పండ్లు
ఆలుగడ్డ, క్యారెట్లు వంటి దుంపలు
వేపుళ్లు, చిరుతిండి, నూనె పదార్థాలు
కొత్త వెర్షన్ కీటో 2. 0 అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో ఆలివ్, వేరుశెనగ వంటి మొక్కల ఆధారిత ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించవచ్చు. గింజలు, డ్రై ఫ్రూట్స్, అవోకాడో, నాన్ వెజ్ తిననివారు మొక్కల ఆధారిత అధిక కొవ్వు పదార్ధాలను వాడాల్సి ఉంటుంది.
కీటో డైట్ ప్రారంభ దశలో కొంత అలసట కనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు, తలనొప్పి వస్తుంది. శరీరం డీహైడ్రేట్గా మారుతుంది. నాలుక రుచిని కోల్పోతుంది. నోటి దుర్వాసన వస్తుంది. ఈ లక్షణాలు ఒకటి రెండు రోజులపాటు మాత్రమే కనిపిస్తాయి.
ఈ డైట్‌ను ప్రారంభించే ముందు తొలుత జనరల్ ఫిజీషియన్‌ను కలిసి సలహా తీసుకోవాలి. డైట్‌ను మొదలెట్టే వారు మొదటగా చక్కెర, కెఫీన్, మద్యపానం వంటివి తగ్గించడం అలవాటు చేసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.