Kidney Disease | ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా ఓ కారణమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. జంక్ ఫుడ్ ద్వారా ఉప్పు ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తుంది. ఇది కిడ్నీలు, గుండెకు హానికరం. అదే చక్కెరలు ఎక్కువగా ఉంటే ఊబకాయం, మధుమేహం లాంటి రోగాల బారినపడతారు. జంతు మాంసం నుంచి వచ్చే ప్రొటీన్లు ఎక్కువైనకొద్దీ రక్తం ఆమ్లయుతంగా మారుతుంది. ఇది కూడా కిడ్నీలకు కీడుచేసేదే. అనారోగ్యకరమైన ఆహారానికి తోడు కదలికలు లేని జీవనశైలి ఇప్పటి పిల్లలను పీడిస్తున్నది. బయటి ఆటలు అసలే లేకుండా ఇండ్లలో ఇ-గేమ్స్‌లో మునిగిపోవడం పిల్లల్లో నిద్రలేమికి, జీవనశైలి వ్యాధులకు దారితీస్తుంది.
పుట్టుకతోనే కిడ్నీలు, మూత్రనాళంలో ఏర్పడిన లోపాలే.. పిల్లల్లో కిడ్నీల వ్యాధులకు ప్రధాన కారణాలు.
మూత్రం నిండుకోవడం: మూత్రనాళంలో అవరోధాల కారణంగా పిల్లలు స్వేచ్ఛగా మూత్రం పోయలేరు. దాంతో మూత్రం తిరిగి కిడ్నీల్లోకి వెళ్లి పోతుంది. అలా వాటి పనితీరు దెబ్బతింటుంది.
నెఫ్రోటిక్ సిండ్రోమ్: కిడ్నీల్లో వడపోత చేసే ఫిల్టర్లు లీక్ కావడం లేదా దెబ్బతినడం వల్ల నెఫ్రోటిక్ సిండ్రోమ్ దాపురిస్తుంది. దీంతో మూత్రం ద్వారా ప్రొటీన్లు బయటికి వెళ్లిపోతాయి. పిల్లల కిడ్నీ వ్యాధుల్లో ఇదే చాలా ఇబ్బందికరమైంది.
వారసత్వ వ్యాధులు: తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వారసత్వంగా కూడా కిడ్నీ వ్యాధులు సంక్రమిస్తాయి.
సిస్టమిక్ డిసీజెస్: రోగ నిరోధక వ్యవస్థ తన కణాల మీద తానే దాడిచేసి సమస్యలకు కారణమయ్యే లూపస్ ఎరిథెమటోసిస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల కూడా పిల్లల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.
తొలిదశలో ఎలాంటి లక్షణాలూ బయటపడవు. తర్వాత దశల్లో మాత్రం కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.
ఆరోగ్య చరిత్ర, వైద్య పరీక్షల ద్వారా వైద్యులు పిల్లల్లో కిడ్నీల సమస్యలను నిర్ధారిస్తారు.
పరిస్థితి తీవ్రతను బేరీజు వేసి.. కిడ్నీ వ్యాధులకు వివిధ రకాల చికిత్సలు అందిస్తారు నిపుణులు.
మందులు : కొన్ని రకాలైన మూత్రపిండాల వ్యాధుల్లో మంటను తగ్గించడం, లక్షణాలను నివారించడం, రోగ నిరోధక వ్యవస్థ తగిన విధంగా స్పందించేలా చేయడం.. ఔషధాల వల్లే సాధ్యం అవుతుంది.
ఆహారంలో మార్పులు: వ్యాధి మరింత ముదరకుండా అడ్డుకోవడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తిండిలో ఉప్పు, ప్రొటీన్లు, పొటాషియం పరిమాణంపై పరిమితి ఉండాలి.
డయాలసిస్: కిడ్నీలు పనిచేయడం కష్ట సాధ్యమైన పరిస్థితుల్లో రక్తంలోని వ్యర్థాలను బయటికి పంపడానికి పెరిటోనియల్ డయాలసిస్ అవసరం పడొచ్చు.
కిడ్నీ మార్పిడి: వ్యాధి ముదిరిన పిల్లలకు కిడ్నీ మార్పిడి అత్యుత్తమమైన చికిత్సగా నిలుస్తుంది.