High Cholesterol | ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో హై కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. హై కొలెస్ట్రాల్ అనేది సాధారణంగా కనిపించేదే అయినప్పటికీ, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని హై కొలెస్ట్రాల్ అంటారు. ఇది కణాల నిర్మాణం, హార్మోన్ల తయారీలో అవసరమైన పదార్థమే అయినప్పటికీ, అధికంగా ఉండటం గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. LDL (లో-డెన్సిటీ లిపోప్రోటీన్), దీనిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, HDL (హై-డెన్సిటీ లిపోప్రోటీన్), దీనిని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. LDL స్థాయిలు పెరిగితే రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుపోయి అవి ఇరుకవుతాయి. దీనివల్ల గుండెజబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
హై కొలెస్ట్రాల్‌కు ప్రత్యేకంగా కనిపించే లక్షణాలు సాధారణంగా ఉండవు. అందుకే దీనిని సైలెంట్ ప్రాబ్లమ్ గా కూడా పేర్కొంటారు. రక్త పరీక్ష ద్వారానే దీన్ని కచ్చితంగా గుర్తించవచ్చు. అయితే కొన్నిసార్లు పరోక్షంగా కనిపించే కొన్ని సంకేతాలు ఉంటాయి. కొంతమందిలో ఛాతినొప్పి (అంజైనా), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే మోచేతులు, మోకాళ్లు లేదా కండరాల దగ్గర పసుపు రంగులో ఉండే కొవ్వు గడ్డలు కనిపించడం, కళ్ల మూలల్లో పసుపు మచ్చలు రావడం, కళ్లలోని ఐరిస్ చుట్టూ తెలుపు లేదా బూడిద రంగు వలయం ఏర్పడటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఇవి నేరుగా హై కొలెస్ట్రాల్ లక్షణాలు కాకుండా, దీని వల్ల కలిగే సమస్యల సూచనలు. ముఖ్యంగా అథెరోస్క్లిరోసిస్ (రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుపోవడం) వల్ల రక్తప్రసరణ తగ్గి పలు లక్షణాలు కనిపిస్తాయి.
అథెరోస్క్లిరోసిస్ కారణంగా ఛాతిలో ఒత్తిడి లేదా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్లలో నొప్పి (నడిచేటప్పుడు కండరాల నొప్పి), చేతులు కాళ్లలో మొద్దుబారటం, తరచూ అలసట, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఏర్పడతాయి. హై కొలెస్ట్రాల్ లక్షణాలు సాధారణంగా కనిపించకపోవడం వల్ల, తరచూ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 20 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. అయితే గుండెజబ్బులు, మధుమేహం, అధిక బరువు, ధూమపానం లేదా కుటుంబ చరిత్ర వంటి ప్రమాద కారకాలు ఉన్నవారు మరింత తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. పిల్లలు కూడా 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఒకసారి, 17 నుంచి 21 ఏళ్ల మధ్య మరోసారి పరీక్ష చేయించుకోవాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
హై కొలెస్ట్రాల్ ముందస్తు లక్షణాలు లేకుండానే నెమ్మదిగా ప్రమాదాన్ని పెంచే సమస్య. కాబట్టి రక్తపరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం ద్వారా దీన్ని నియంత్రించడం అత్యంత అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.