Acidity | ప్రస్తుతం ఉన్న వేగవంతమైన జీవనశైలిలో అసిడిటీ, గ్యాస్, పొట్టలో మంట వంటి సమస్యలు చాలా సాధారణంగా మారిపోయాయి. అసమయ భోజనం, అధిక కాఫీ, టీలు, మసాలా ఆహారం, రాత్రివేళల్లో ఆలస్యంగా తినడం వంటి అలవాట్ల వల్ల చాలామందిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇవి తాత్కాలికంగా ఉండి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే తగ్గిపోతాయి. అయితే అసిడిటీ తరచూ రావడం, రోజురోజుకూ తీవ్రంగా మారడం లేదా ఎక్కువకాలం కొనసాగడం వంటి పరిస్థితులనులు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం, వారానికి రెండు నుంచి మూడు సార్లకంటే ఎక్కువ అసిడిటీ రావడం సాధారణ విషయం కాదని చెబుతున్నారు.
ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర భంగం కలిగించే రిఫ్లక్స్, మింగడానికి ఇబ్బంది, తరచూ వాంతులు, కారణం లేకుండా బరువు తగ్గడం, వాంతుల్లో లేదా మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవి సాధారణ గ్యాస్ సమస్యకంటే తీవ్రమైన జీర్ణాశయ వ్యాధులకు సంకేతాలు కావచ్చని పేర్కొంటున్నారు. తరచూ అసిడిటీ రావడానికి పలు కారణాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD), కడుపులో అల్సర్లు, ఫంక్షనల్ డిస్పెప్సియా వంటి సమస్యలు దీనికి కారణమవుతాయి. కొన్నిసార్లు ప్రారంభ దశలో ఉన్న జీర్ణాశయ క్యాన్సర్లలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే లక్షణాలను తేలికగా తీసుకోకుండా సరైన పరీక్షలు చేయించుకోవడం అవసరమని చెబుతున్నారు.
అసిడిటీని ఎక్కువకాలం నిర్లక్ష్యం చేస్తే పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆహార నాళంలో మంట, గాయాలు ఏర్పడటం, మింగడానికి ఇబ్బంది కలగడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే బారెట్ ఈసోఫేగస్ అనే పరిస్థితి కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రతి అసిడిటీ సమస్య వెనుక శారీరక వ్యాధులే ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు కూడా జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల పొట్ట ఉబ్బరం, భోజనం చేసిన వెంటనే నిండిన భావన, పై పొట్టలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరీక్షల్లో పెద్ద సమస్య కనిపించకపోయినా, ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన తర్వాత కొత్తగా అసిడిటీ సమస్య ప్రారంభమైతే మరింత జాగ్రత్త అవసరమని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం చేసే వారు, కుటుంబంలో జీర్ణాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, చాలా కాలంగా రిఫ్లక్స్‌తో బాధపడుతున్నవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయడం ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని పేర్కొంటున్నారు.
అసిడిటీని నియంత్రించేందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం చాలా అవసరం. సమయానికి భోజనం చేయడం, మసాలా, వేయించిన ఆహారాన్ని తగ్గించడం, తిన్న వెంటనే పడుకోకుండా ఉండడం, బరువును నియంత్రణలో ఉంచడం, నిద్రపోయేటప్పుడు తల భాగాన్ని కొద్దిగా ఎత్తుగా ఉంచడం వంటి అలవాట్లు ఉపశమనానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే యోగా, ధ్యానం వంటి ఒత్తిడి తగ్గించే పద్ధతులు కూడా ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. అసిడిటీ సాధారణ సమస్యగానే కనిపించినా, తరచూ రావడం లేదా తీవ్రమవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని పేర్కొంటున్నారు.