Gestational Diabetes | గర్భధారణ సమయంలో వచ్చే గెస్టేషనల్ డయాబెటిస్‌ను చాలా మంది తాత్కాలిక సమస్యగానే భావిస్తారు. సాధారణంగా ప్రసవం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు మామూలుకు రావడంతో సమస్య ముగిసిపోయిందని అనుకుంటారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం ఈ పరిస్థితి భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచే సంకేతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భధారణకు ముందు సాధారణ బరువు ఉన్న మహిళల్లో కూడా ఈ ప్రమాదం కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. స్వీడన్లో లక్షలాది మహిళల ఆరోగ్య వివరాలను పరిశీలించిన ఈ అధ్యయనం ఇ-క్లినికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది. గర్భధారణకు ముందు శరీర బరువు, గెస్టేషనల్ డయాబెటిస్, ఆ తర్వాత టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాల మధ్య సంబంధాన్ని పరిశోధకులు విశ్లేషించారు. గర్భధారణ సమయంలో శరీరం ఇన్సులిన్‌ను ఎలా నిర్వహిస్తుందో పరీక్షించే స్ట్రెస్ టెస్ట్ లాంటిదిగా గెస్టేషనల్ డయాబెటిస్ పనిచేస్తుందని అధ్యయనం సూచించింది.
గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం భవిష్యత్తులో బయటపడే గ్లూకోజ్ నియంత్రణ సమస్యలకు ముందస్తు సంకేతంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గెస్టేషనల్ డయాబెటిస్ అంటే గర్భధారణ సమయంలో శరీరం రక్తంలో చక్కెర స్థాయిలను సరిగా నియంత్రించలేకపోవడం. సాధారణంగా ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తంలోని చక్కెరను కణాల్లోకి తీసుకెళ్లి శక్తిగా ఉపయోగించేలా చేస్తుంది. కానీ గర్భధారణ సమయంలో ప్లాసెంటా విడుదల చేసే కొన్ని హార్మోన్లు ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్ తను యారు చేయలేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ సమస్య ఉన్న చాలా మంది మహిళల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే గర్భధారణ సమయంలో చేసే సాధారణ రక్తపరీక్షల ద్వారా దీన్ని గుర్తిస్తారు. ఆహార నియంత్రణ, వ్యాయామం, కొన్ని సందర్భాల్లో మందులు లేదా ఇన్సులిన్‌తో దీనిని నియంత్రించవచ్చు. అయినప్పటికీ ఇది శరీరంలో చక్కెర నియంత్రణ వ్యవస్థపై ఒత్తిడి ఉందనే సంకేతంగా భావిస్తున్నారు.
పరిశోధకులు లక్షకు పైగా తొలి గర్భధారణ కలిగిన మహిళల ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిన మహిళల్లో భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఊబకాయం ఉన్న మహిళల్లో ప్రమాదం అత్యధికంగా కనిపించినప్పటికీ, సాధారణ బరువు ఉన్న మహిళలు కూడా ఈ సమస్య నుంచి పూర్తిగా రక్షణ పొందలేదని అధ్యయనం వెల్లడించింది. అదే బరువు ఉన్న ఇతర మహిళలతో పోలిస్తే గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిన వారిలో ప్రమాదం ఎక్కువగా కనిపించింది. నిపుణుల ప్రకారం గర్భధారణ అనేది భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులను ముందుగానే తెలియజేసే ఒక విండో లాంటిది. ఈ సమయంలో శరీరం అధికంగా పనిచేయాల్సి రావడం, హార్మోన్లలో పెద్ద మార్పులు జరగడం వల్ల ముందుగా గుర్తించని బలహీనతలు బయటపడతాయి.
గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర పెరగడం అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయని సూచించవచ్చు. ప్రసవం తర్వాత చక్కెర స్థాయిలు మామూలు అయినప్పటికీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు సంబంధించిన ప్రమాదం పూర్తిగా తొలగిపోదు. వయస్సు పెరగడం, జీవనశైలి, జన్యుపరమైన కారణాలు, బరువు పెరగడం వంటి అంశాలు తర్వాత టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. అందుకే గెస్టేషనల్ డయాబెటిస్‌ను భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరికగా పరిగణిస్తున్నారు. అయితే గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిన ప్రతి మహిళకూ టైప్-2 డయాబెటిస్ వస్తుందని కాదు. ప్రమాదం పెరుగుతుందని మాత్రమే అధ్యయనం చెబుతోంది. ప్రసవం తర్వాత కూడా క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర పరీక్షలు చేయించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచడం, వైద్యుల పర్యవేక్షణలో ఉండడం ద్వారా భవిష్యత్తు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిపాలు ఇవ్వడం కూడా కొంతవరకు మెటబాలిజం ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.