Bloating | జీర్ణకోశ సమస్యల్లో కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) చాలా సాధారణమైంది. కడుపు బిగుసుకుపోయినట్లు, నిండినట్లు అనిపించడం దీని ప్రధాన లక్షణం. కొంతమందికి ఇది స్వల్ప అసౌకర్యంగా ఉండగా, మరికొందరిలో నొప్పికి కూడా కారణమవుతుంది. ఎక్కువగా తినడం, వేగంగా భోజనం చేయడం, మలబద్ధకం, కొన్ని ఆహారాల పట్ల అసహనం లేదా ఇతర జీర్ణవ్యవస్థ సమస్యల వల్ల బ్లోటింగ్ ఏర్పడుతుంది. సాధారణంగా ఈ సమస్య కొంతసేపటి తర్వాత స్వయంగా తగ్గిపోతుంది. అయితే తరచూ బ్లోటింగ్ ఎదురయ్యే వారికి కొన్ని సహజ, వైద్యపరమైన పరిష్కారాలు ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి పరిష్కారం వేర్వేరు విధానాల్లో పనిచేస్తుందని, సమస్యకు కారణమైన అంశాన్ని బట్టి ఫలితాలు మారుతాయని సూచిస్తున్నారు.
పెప్పర్మింట్ ఆయిల్ ను బ్లోటింగ్ ను గ్గించడంలో ఉపయోగపడే ఒక సాధారణ మార్గంగా గుర్తించారు. ఇందులో ఉండే మెంథాల్ పేగుల కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. దీంతో జీర్ణవ్యవస్థలో గ్యాస్ సులభంగా కదలడానికి అవకాశం లభించి, కడుపు ఉబ్బరం, ఒత్తిడి, అసౌకర్యం వంటి లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఇసబ్గోల్ లేదా సిల్లియం హస్క్ కరిగే పీచుపదార్థానికి మంచి మూలం. ఇది నీటిని పీల్చుకుని మల విసర్జనను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఇతర కొన్ని పీచు పదార్థాల మాదిరిగా అధిక గ్యాస్‌ను ఉత్పత్తి చేయకుండా, మలబద్ధకం వల్ల కలిగే కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది.
ప్రోబయోటిక్స్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాల సమతుల్యతను మెరుగుపరిచే జీవ సూక్ష్మజీవులు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. కొన్ని ప్రత్యేక రకాల ప్రోబయోటిక్స్ బ్లోటింగ్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నప్పటికీ, వాటి ప్రభావం ఉపయోగించే రకాన్ని బట్టి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ ఎంజైములు కూడా బ్లోటింగ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లను సమర్థంగా జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారం పూర్తిగా జీర్ణమైతే పేగుల్లో బ్యాక్టీరియా ద్వారా జరిగే కిణ్వ ప్రక్రియ తగ్గి, గ్యాస్ ఉత్పత్తి, కడుపు నిండిన భావన, భోజనం తర్వాత కలిగే అసౌకర్యం తగ్గే అవకాశం ఉంటుంది.
అల్లం టీ కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేసే సహజ పానీయంగా గుర్తింపు పొందింది. అల్లంలో ఉండే కొన్ని సమ్మేళనాలు పొట్టలో ఆహారం వేగంగా కదలడానికి సహాయపడతాయి. దీంతో భోజనం చేసిన తర్వాత కడుపు నిండిపోయిన భావన, అజీర్ణం, ఒత్తిడి, పైభాగ జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే బ్లోటింగ్‌కు ఒకే కారణం లేదా ఒకే పరిష్కారం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెప్పర్మింట్ ఆయిల్, ఇసబ్గోల్, ప్రోబయోటిక్స్, జీర్ణ ఎంజైములు, అల్లం వంటి వాటి ప్రయోజనాలు వేర్వేరు విధాలుగా పనిచేస్తాయి. కాబట్టి సమస్యకు అసలు కారణం ఏమిటో గుర్తించి, అవసరమైతే వైద్యుల సలహాతో సరైన చికిత్స లేదా సప్లిమెంట్లను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.