Fungal Infection | ఫంగల్ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్ కంటే భయంకరమైనవి. మన దేశంలో ఏటా ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రారంభమై మెదడుకు చేరి మనల్ని మృత్యువుకు దగ్గర చేసే ఈ ఫంగల్ ఇన్ఫెక్షను మందులకు కూడా లొంగవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో దాదాపు 5.72 కోట్ల మంది వీటి బారిన పడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. బ్రిటన్‌లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నిపుణులు ఢిల్లీ ఎయిమ్స్, పశ్చిమ బెంగాల్ కళ్యాణి ఎయిమ్స్, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ పరిశోధకులు అధ్యయనం జరిపి పలు అంశాలను వెల్లడించారు. టీబీతో బాధపడుతున్నవారి కంటే 10 రెట్లు ఎక్కువ మంది ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని పరిశోధకులు చెప్తున్నారు.
ఫంగస్ అంటే..
ఫంగస్ అనే ఒక మైక్రోఆర్గనిజం. ఈ సూక్ష్మజీవి పుట్టగొడుగులు, ఈస్ట్‌పై ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్ కారణంగా ఎలా వ్యాధులు వస్తుంటాయో.. అదే మాదిరిగా ఫంగస్‌తో కూడా ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. వీటినే ఫంగల్ వ్యాధులు అని అంటారు. చలికాలంతోపాటు వేసవికాలంలో కూడా సంభవిస్తుంటాయి. ఇది వ్యాప్తి చెందడానికి కాలుష్యం కూడా ఒక కారణం. ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా వరకు అంటువ్యాధులు. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కొవిడ్ బారిన పడిన వారిలో కూడా రకరకాల ఫంగస్‌లు బయటపడ్డాయి. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు 4 రకాలుగా ఉంటాయి. అవి.1. టినియా కార్పోరిస్ 2. టినియా పెడిస్ 3. టినియా క్రూరిస్ 4. టినియా ఉంగమ్.
టినియా కార్పోరిస్ : దీన్నే రింగ్వార్మ్ అని కూడా అంటాం. దీని కారణంగా శరీరంపై వృత్తాకార దద్దుర్లు వస్తుంటాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే శరీరమంతా వ్యాప్తి చెందుతుంది.
టినియా పెడిస్ : దీన్నే అథ్లెట్ ఫుట్ అని కూడా అంటారు. ఇది కాలివేళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
టినియా క్రూరిస్ : దీన్నే జాక్ దురద అంటారు. ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చెమట ఎక్కువగా నిల్వ ఉండే ప్రైవేట్ భాగాలు, తుంటి, చంకల్లో డెవలప్ అవుతుంది.
టినియా ఉంగమ్ : దీన్నే ఒనికో మైకోసిస్ అని కూడా పిలుస్తారు. ఇది గోరు కొన నుంచి మొదలవుతుంది. ప్రారంభంలో తెలుపు లేదా పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ పెరిగేకొద్దీ గోరు రంగు మారుతుంది. గోరు అంచున చిందరవందరగా ఉండి విరిగిపోతుంది. కాలి గోళ్లలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది.
ప్రభావితమయ్యే ప్రాంతాలు..
చర్మం, వెంట్రుకలు, కండ్లు, నోరు, చెవులు, నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులు ఎక్కువగా ప్రభావితమవుతుంటాయి. నాడీ వ్యవస్థలో ఫంగల్ ఇన్ఫెక్షన్ మెదడు జ్వరం లేదా మెనింజైటిస్కు కారణమవుతుంది. ఊపిరితిత్తులలో ఫంగల్ ఇన్ఫెక్షన్ జ్వరం, ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. కొన్నిసార్లు దగ్గుతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా జుట్టులో పాచెస్ ఏర్పడి జుట్టు రాలడం మొదలవుతుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకమా..
ఫంగల్ ఇన్ఫెక్షన్ శరీరం అంతటా వ్యాపిస్తుంది. మిగతా ఇన్ఫెక్షన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రాణాంతకమైనదే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్ల కంటే చాలా ప్రమాదకరమైనది. ఫంగస్ విపరీతంగా వ్యాపిస్తే మందులతో కూడా నియంత్రించలేమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు, డయాబెటిస్ పేషెంట్స్, అవయవ మార్పిడి చేసుకున్నవారు, నీటిలో ఉండి పనిచేసేవారు, హెచ్ఐవీ పేషెంట్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ప్రమాదకరం.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గించుకునే మార్గాలు..
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలి. నట్స్ వంటి గింజ ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం అలవర్చుకోవాలి. జీవనశైలిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చి ముక్కు నుంచి రక్తస్రావం ప్రారంభమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.