‘పిల్లల డాక్టర్ అంటే గబగబా మందులు రాసి పంపడం కాదు. అసలు పిల్లలకు ఆ సమస్యలు ఎందుకు వస్తాయో తల్లిదండ్రులకు వివరించాల్సిన బాధ్యత కూడా తనదే. బిడ్డలు మొట్టమొదట తమ సమస్యలు చెప్పుకొనేది తల్లిదండ్రులతోనే. కాబట్టి, చిన్నచిన్న ఇబ్బందులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స ఎలా చేయాలో తల్లిదండ్రులకు డాక్టర్లే నేర్పించాలి. పెద్దలకు ప్రథమ చికిత్స తెలిసి ఉంటే పిల్లలకు సకాలంలో సహాయం చేయగలరు’ అంటారు ప్రథమ చికిత్స ఉద్యమకారిణి డాక్టర్ శివరంజని సంతోష్.
పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియదు. ఏం చేయకూడదో అసలు తెలియదు. పిల్లల జబ్బుల కంటే, తల్లిదండ్రుల అవగాహన రాహిత్యమే అత్యంత ప్రమాదకరం. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లల ఆకస్మిక మరణాల్లో ఎక్కువ శాతం.. గొంతులో ఏదైనా అడ్డుపడి ఊపిరాడకపోవడం వల్లే సంభవిస్తున్నాయి. ఉదాహరణకు.. గొంతులో ఏదైనా అడ్డుపడితే వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. దీనివల్ల సగం ప్రమాదం తప్పుతుంది. ఆ విషయం తెలియక బిడ్డను భుజానికి ఎత్తుకుంటారు. అప్పుడు గొంతులో అడ్డుపడిన ఆహారం లేదా వస్తువు కిందికి జారి వాయునాళానికి అడ్డు పడుతుంది. దీంతో ఊపిరాడదు. మరణించే ప్రమాదమూ ఉంది. ఇదే కాదు, అనేక సమస్యల నుంచి పిల్లల్ని ప్రథమ చికిత్సే కాపాడుతుంది.
జబ్బొచ్చినప్పుడు.. డాక్టర్లపైనే ఆధారపడకూడదు. నా వరకు నేను మూడు రోజులపాటు జ్వరం ఉంటేనే రమ్మని చెబుతాను. ఆరేండ్ల లోపు పిల్లలకు జ్వరం వస్తే ఫిట్స్ ఇబ్బందిపెట్టే ప్రమాదం ఉంటుందని వివరిస్తాను. ఫిట్స్‌కు ప్రథమ చికిత్స నేర్పించి పంపుతాను. పిల్లల ఎదుగుదల సమ యంలో.. ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రమాదాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
పిల్లలకు పేరెంట్సే మొదటి వైద్యులు. 90 శాతం సమస్యలకు ఇంట్లోనే పరిష్కారం ఉంది. రుగ్మతలకు మందులే మార్గం కాదు. అలా అని, ఒక్కసారే అన్ని రకాల ఫస్ట్ ఎయిడ్ జాగ్రత్తలు చెప్పలేను. అతి ముఖ్యమైనవి మొదటగా చెబుతాను. చనుబాలు ఇవ్వడంలో కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. అప్పుడేం చేయాలో చెబుతాను. సాధారణంగా పిల్లలకు జలుబు, జ్వరం, దగ్గు వస్తుంటాయి. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పిస్తాను. ఆరేళ్ల లోపు పిల్లలకు జ్వరంతోపాటు ఫిట్స్ రావొచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదో కూడా గుర్తుండేలా చెబుతాను. ఊపిరి తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) నేర్పిస్తాను. అందుకే, మందులు రాయడమే కాదు.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడాన్ని కూడా వైద్యంలో భాగం చేసుకున్నాను.
మెడికల్ షాపుల్లో ఓఆర్ఎస్ఎల్ టెట్రా ప్యాక్‌లు పుష్కలంగా దొరుకుతున్నాయి. జనమూ యథేచ్చగా వాడుతున్నారు. నిజానికి, వాంతులు, విరేచనాలు అవుతున్న పిల్లలకు తాగించకూడదు. విరేచనాలతో బాధపడేవాళ్లకు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ఇవ్వాలి. కానీ ఓఆర్ఎస్ఎల్ తాగిస్తున్నారు. డాక్టర్లు కూడా రాసేస్తున్నారు. తల్లిదండ్రులు దీనిని ఓఆర్ఎస్ అనే భ్రమపడుతున్నారు. ఓఆర్ఎస్ఎల్ తాగితే విరేచనాలు పెరుగుతాయి. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ పానీ యాలకు ఆ పేరు ఎలా అనుమతించారని కేంద్ర ఆరోగ్య శాఖకు నాలుగేళ్ల నుంచీ లేఖలు రాస్తూనే ఉన్నాను. ఆ పోరాటం వల్ల ఆ టెట్రాప్యాక్‌లపై ‘విరేచనాలతో బాధపడేవాళ్లకు తాగించకూడదు’ అని అతిచిన్న అక్షరాల్లో రాస్తున్నారు. అది ఎవరికీ కనిపించదు. దానివల్ల లాభం లేదని మళ్లీ సర్కారుకు లేఖలు రాశాను. దీంతో, ఆ ఉత్పత్తుల పేరు కింద ‘దిస్ ఈజ్ నాట్ ఓఆర్ఎస్’ అని ముద్రించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఆ మాట వేస్తున్నారు.
నా వరకూ రాలేని పేద తల్లిదండ్రుల కోసం బస్తీలకు వెళ్లి ప్రాథమిక చికిత్స నేర్పించాను. పాఠశాలలు, హోటళ్లలో కూడా సీపీఆర్ బోధించాను. బొమ్మల సాయంతో తల్లిదండ్రులతో ప్రాక్టీస్ చేయించాను. ఏదైనా సమస్య వచ్చి బిడ్డ శ్వాస తీసుకోవడం కనుక ఆగిపోతే.. ఈ పద్ధతిలో పిల్లల్ని బతికించుకోవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు, ఫిట్స్, పాము కాటు, గొంతులో, ముక్కులో ఏదైనా అడ్డంపడటం, పిన్నీసులు, గుండీలు, బటన్ బ్యాటరీలు మింగటం.. సర్వ సాధారణం. అలాంటప్పుడు ఏం చేయాలో అవగాహన కల్పిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో కూడా సీపీఆర్, పిల్లల ఆరోగ్య సమస్యలకు ప్రథమ చికిత్స శిక్షణ ఇచ్చాను. ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలని Dr Sivaranjani’s Easy Health పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాను. ఇన్‌స్టాగ్రామ్‌లో Dr Sivaranjani Santosh హ్యాండిల్ ద్వారా వివరిస్తున్నా. సినీ నటులు ప్రకాశ్ రాజ్, నాని, అల్లరి నరేశ్ లాంటివారు కూడా వాటిని షేర్ చేశారు. సెలెబ్రిటీల వల్ల నేను చెప్పే విషయాలు ఎక్కువమందికి చేరాయి.
నా దగ్గర ఒక మహిళ సీపీఆర్ నేర్చుకుంది. వాళ్ల కుటుంబం అమెరికాకు మారింది. ఓ రోజు ఆమె భర్త గుండెపోటుతో హఠాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే తను సీపీఆర్ చేసి కాపాడుకుంది. ‘ఈ రోజు నా బిడ్డకు తండ్రి ఉన్నాడంటే మీ వల్లే’ అని మెసేజ్ పంపింది. హైదరాబాద్‌లో ఒకబ్బాయి ఆడుకుంటూ ఆడుకుంటూ నీళ్లలో పడిపోయాడు. వాళ్లమ్మ నన్ను యూట్యూబ్‌లో ఫాలో అవుతుంది. ఆ పరిజ్ఞానంతో బిడ్డను బతికించుకుంది. ఒక చంటిబిడ్డ మెడకు చీర చుట్టుకొని శ్వాస ఆగిపోయింది. తల్లి కంగారు పడకుండా సీపీఆర్ చేసి కాపాడుకుంది. ఆమె నా దగ్గరే సీపీఆర్ నేర్చుకుంది. పత్రికల్లో ఇలాంటి వార్తలు చూసి ఎంత సంతోషిస్తానో!
– డాక్టర్ శివరంజని సంతోష్
– నాగవర్ధన్ రాయల
– యాదగిరి గౌడ్