ఫెర్రిటిన్ ఫేస్.. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న పదం. శరీరంలో ఐరన్ స్థాయులు పడిపోవడం వల్ల ముఖంలో కనిపించే మార్పులను ఈ పేరుతో పిలుస్తున్నారు. అయితే, చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల మాటలు, తమ శరీరంలో కనిపించే లక్షణాలను బట్టి ‘ఫెర్రిటిన్ ఫేస్’గా నిర్ధారించుకుంటున్నారు. స్వీయ వైద్యం కూడా చేసుకుంటున్నారు. ఈ ధోరణి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో ఐరన్ లేదా ఫెర్రిటిన్ (శరీరంలో ఐరన్‌ను నిల్వ చేసే ఒక ప్రొటీన్) తగ్గితే.. చర్మ కణాలకు ఆక్సిజన్ సరిగ్గా అందకుండా పోతుంది. దాంతో కణాల పునరుత్పత్తి మందగిస్తుంది. దీనివల్ల ముఖంలో కొన్ని మార్పులు వస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలు తగ్గినప్పుడు ముఖం తన సహజమైన కాంతిని కోల్పోతుంది. తెల్లగా, పాలిపోయినట్లు మారుతుంది. సాధారణంగానే కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా పల్చగా ఉంటుంది. ఇక ఐరన్ లోపం తలెత్తితే.. ఆ ప్రాంతంలో రక్తప్రసరణ, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. దాంతో, డార్క్ సర్కిల్స్ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇక కొత్త చర్మ కణాలు తయారవ్వడానికి ఐరన్ చాలా అవసరం. అదే ఐరన్ లోపించినప్పుడు.. చర్మం పొడిగా, నిర్జీవంగా మారిపోతుంది. నిద్ర సరిపోక పోవడం, ముఖం కళావిహీనంగా మారడం, నిస్సత్తువ ఆవహించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్నీ కలిసి ‘ఫెర్రిటిన్ ఫేస్’కు దారితీస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఐరన్ లోపం లేకపోయినా.. ‘ఫెర్రిటిన్ ఫేస్’ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అందుకే, ‘ఫెర్రిటిన్ ఫేస్’ అనేది ఐరన్ లోపానికి అసలైన నిర్ధారణ కాదని వైద్య నిపుణులు అంటున్నారు. అదొక సోషల్ మీడియా పదం మాత్రమేనని చెబుతున్నారు. చర్మం పాలిపోవడానికి, డార్క్ సర్కిల్స్ రావడానికి ఐరన్ లోపమే కాకుండా.. థైరాయిడ్ సమస్యలు, నిద్రలేమి, పోషకాహార లోపం, ఇతర హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చని పేర్కొంటున్నారు. అదే సమయంలో ముఖం రూపాన్ని చూసి ఐరన్ లోపం ఉందని అంచనాకు రావొద్దని చెబుతున్నారు. శరీరంలో ఐరన్ నిల్వలు ఎంత ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవడానికి ‘సీరం ఫెర్రిటిన్ టెస్ట్’ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఫెర్రిటిన్ స్థాయులు 30 ఎన్జీ/ఎంల్ కంటే తక్కువగా ఉంటేనే.. ఐరన్ లోపం ఉన్నట్లు పరిగణిస్తారు.
సోషల్ మీడియాలో చెప్పేదాన్ని బట్టి స్వీయ వైద్యం చేసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా నేరుగా ఐరన్ సప్లిమెంట్స్ వాడకూడదు. ఎందుకంటే, శరీరంలో ఐరన్ తగ్గినా, మోతాదు పెరిగినా.. కాలేయం, గుండె లాంటి అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఫెర్రిటిన్ ఫేస్ లాంటి లక్షణాలు కనిపిస్తే.. సీబీపీ, ఫెర్రిటిన్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఐరన్ లోపం బయట పడితే.. ఐరన్ అధికంగా ఉండే సంపూర్ణ ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.