Digestive Problems | వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పొట్ట ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వేడి కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీజనల్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో వాతావరణం, ఆహారపు అలవాట్లు, జన్యు లక్షణాల ఆధారంగా ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉండటంతో పొట్ట సమస్యలు మరింత పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఆమ్లత్వం (ఆసిడిటీ), మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించే ప్రజలు హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, హీట్ స్ట్రెస్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గట్ (జీర్ణాశయ) ఆరోగ్యాన్ని కాపాడటానికి సరైన ఆహారపు మార్పులు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో కొన్ని వేసవి పండ్లు గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేసవికాలంలో ఆహారంలో చేర్చుకోదగిన వివిధ రకాల పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో తీసుకోదగిన ముఖ్యమైన పండ్లల్లో పుచ్చకాయ ఒకటి. ఇది నీటితో ఎక్కువగా నిండి ఉంటుంది కనుక శరీరాన్ని త్వరగా చల్లబరుస్తుంది. పుచ్చకాయలోని తెల్లని పొరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే లైకోపీన్, విటమిన్ సి వంటి పోషకాలు శరీరానికి రక్షణ ఇస్తాయి. అలాగే బొప్పాయి కూడా పొట్ట ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉన్న పెపైన్, కైమోపైన్ అనే ఎంజైములు ప్రోటీన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది గట్ బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి బొప్పాయి మంచి ఔషధంగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మామిడి కూడా వేసవిలో గట్ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటి. ఇందులో ఉన్న ఫైబర్, పాలీఫినాల్స్ గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. అయితే మామిడిని పరిమితంగా తీసుకోవడం అవసరం. అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పెరగడం, జీర్ణ సమస్యలు రావడం వంటి ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవిలో గట్ ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరంగా ఉండే పండ్లలో అరటి ఒకటి. ఇందులో సమృద్దిగా ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అరటిపండును నిరంతరం తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా సమతుల్యత మెరుగవుతుంది. అలాగే దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది. అదేవిధంగా అనాస( పైనాపిల్) లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి గట్‌లో చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. వేసవిలో తాజా అనాసను తీసుకోవడం ద్వారా శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇటువంటి పండ్లు వేసవిలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వేసవి కాలంలో గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీజనల్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన నీరు, పోషకాహారం, తగిన జాగ్రత్తలతో పొట్ట సమస్యలను తగ్గించుకోవచ్చునని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వేసవిలో శరీరాన్ని కాపాడే ముఖ్యమైన ఆయుధంగా మారుతాయని వైద్యులు సూచిస్తున్నారు.