నలుగురు పురుషుల్లో ఒకరు గుండెకు సంబంధించిన రుగ్మతతోనే మరణిస్తున్నారని అధ్యయనాల్లో తేలింది. ఇది ఆందోళన కలిగించే విషయమే. సరైన ఆహారం, నిలకడైన వ్యాయామంతోపాటు పోషకాలతో కూడిన కొన్ని పదార్థాలను తీసుకుంటే హృద్రోగాలనే కాకుండా అధిక రక్తపోటు, పక్షవాతం, అధిక కొలెస్ట్రాల్ లాంటి ప్రమాదాలనూ దూరం చేసుకోవచ్చు.
చిక్కుళ్లు, పప్పుధాన్యాలు
జంతువుల ద్వారా అందే మాంసకృత్తులతో పోలిస్తే చిక్కుళ్లు, పప్పుధాన్యాల్లో అనారోగ్యకర కొవ్వులు పెద్దగా ఉండవు. వాటిని తీసుకునే వారికి హృద్రోగాల ముప్పు 22 శాతం తక్కువ. అంతేకాదు రోజుకు ముప్పావు కప్పు బీన్స్ తీసుకుంటే రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గిపోతాయని ఓ అధ్యయనం చెప్పింది. కాబట్టి, మెరుగైన ఆరోగ్యం కోసం సలాడ్లు, సూప్స్‌లో బీన్స్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.
ఓట్స్
ఊబకాయంతో ముడిపడిన సమస్యలతో, హృద్రోగాలతో, మధుమేహంతో మనం సమర్థంగా పోరాడేందుకు అవసరమైన ఎవెనాంథ్రమైడ్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనంతో పాటు, ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. వారంలో రెండు నుంచి నాలుగు సార్లు ఒక కప్పు చొప్పున వండిన ఓట్స్ తినడం వల్ల టైప్-2 మధుమేహం ముప్పు 16 శాతం వరకు తగ్గుతుందని జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది. అదే, ఐదు నుంచి ఆరుసార్లు తీసుకుంటే ఆ ముప్పు 39 శాతం దాకా తగ్గుతుందట. రోజువారీ ఆహారంలో.. ఓట్స్‌తో పాటు మనం తీసుకునే పొట్టుతీయని ధాన్యం అధిక రక్తపోటుకు మంచి ఔషధం కూడా. ఇవి 12 వారాల్లోనే గుండె సంబంధ వ్యాధుల ముప్పును 15 శాతం తగ్గిస్తాయని మరో అధ్యయనంలో వెల్లడైంది.
పుట్టగొడుగులు
పోషకాల గనులైన పుట్టగొడుగులు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థం. ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల భాండాగారం. ఉదాహరణకు, పుట్టగొడుగులను అతినీలలోహిత కిరణాలకు గురిచేస్తే అవి విటమిన్-డి గనులుగా మారిపోతాయి. ఎముకల ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తి మెరుగుపడటానికి విటమిన్-డి ఎంతో అవసరం. వీటిలో సమృద్ధంగా ఉండే పొటాషియం.. శరీరంపై సోడియం దుష్ప్రభావాలకు విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాదు, పొటాషియం రక్త నాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. పరోక్షంగా రక్తపోటు తగ్గడానికి సాయపడుతుంది.