జనం భాషలో చెప్పాలంటే.. ఆ పసిబిడ్డలు మరణ శాసనాన్ని సిద్ధం చేసుకునే జన్మిస్తారు. మదినిండా ప్రేమతో ఎదురుచూస్తున్న కన్నవారికి.. గుండెకోతను పంచుతారు. ఇలాంటి సమయాల్లో నిర్లిప్తత పనికిరాదని.. తక్షణ స్పందనతో బిడ్డను బతికించుకోవచ్చని.. ఆలస్యమైన ప్రతిక్షణం మృత్యువుకు దగ్గర చేయడమేననీ హెచ్చరిస్తారు హృద్రోగ నిపుణులు. ఆధునిక వైద్యం ఆ పసిగుండెకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని భరోసా ఇస్తున్నారు.
కొంతమంది శిశువులకు పుట్టుకతోనే గుండె సమస్యలు ఉంటాయి. చిన్న రంధ్రం పడటం, రక్త ప్రసరణలో అవరోధాలు, పంపింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం.. ఇలా ఏదో ఓ లోపం కనిపిస్తుంది. సగటున ప్రతి వెయ్యిమందిలో ఎనిమిది నుంచి పదిమంది శిశువులు గుండె జబ్బులతోనే పుడతారు. అలాంటి చిన్నారుల పట్ల సమాజంలో ఎన్నో అపోహలు. ఎన్ని చికిత్సలు చేయించినా ఉపయోగం ఉండదనీ.. వాళ్లు అల్పాయుష్కులనీ.. చావును ఖరారు చేసుకునే భూమి మీదికి వచ్చారనీ పెదవి విరుస్తుంటారు. సూటిపోటి మాటలతో, తెలిసీ తెలియని సమాచారంతో కన్నవారి మనసులను గాయపరుస్తుంటారు. అయితే, పుట్టుకతో వచ్చే ప్రతి గుండె వ్యాధీ నయం చేయగలిగినదే అంటున్నారు వైద్య నిపుణులు. కాకపోతే, రుగ్మతను గుర్తించడంలో ఆలస్యం చేయకూడదు.
నిర్లిప్తత అసలే పనికిరాదు. వీలైనంత వేగంగా వైద్యం అందించగలిగితే 90 శాతం మేర సాధారణ జీవితాన్ని ప్రసాదించవచ్చని భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో ఎంత ఆలస్యం చేస్తే అంత మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మద్యపానం, ధూమపానం తదితర వ్యసనాలు ఉన్నవారికి రావాల్సిన జీవనశైలి వ్యాధి.. అభంశుభం తెలియని బిడ్డలకు ఎందుకొస్తుంది, వ్యాధి నిర్ధారణ పద్ధతులేమిటి, చికిత్సా విధానాలెన్ని.. తీసుకోవాల్సిన జాగ్రత్తలంటూ ఉన్నాయా.. తదితర అంశాలను ఈ వారం తెలుసుకుందాం. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులలో కొన్ని ప్రధానమైనవి ఇవీ..
తల్లి గర్భం ధరించిన మూడు నాలుగు వారాల్లో ‘ఆర్గనోజెనిసిస్’ మొదలవుతుంది. వివిధ అవయవాలు వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. నాలుగైదు వారాల వయసు నాటికి గుండె కూడా ఓ రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే, కొన్నిసార్లు శిశువులో గుండెకు సంబంధించిన లోపాలు ఏర్పడుతాయి. వీటినే ‘కన్జెనిటల్ హార్ట్ డిసీజెస్’గా వ్యవహరిస్తారు. వీరిలో గుండె పూర్తిస్థాయిలో వృద్ధి చెందదు. శిశువు బలహీనమైన గుండెతో జన్మిస్తాడు.
ఎసైనటిక్ కన్జెనిటల్ హార్ట్ డిసీజెస్
ఈ సమస్యలు ఉన్న శిశువుల్లో రక్తం గులాబీ రంగులో ఉంటుంది. సాధారణంగా గుండె కుడి వైపు నుంచి ఒక ధమని వస్తుంది. దానిని పుపుస ధమని అంటారు. ఇది కాకుండా సిరల నుంచి చెడు రక్తం (వీనస్ బ్లడ్) గుండె కుడి కర్ణికకు వస్తుంది. అక్కడినుంచి కుడి జఠరిక (వెంట్రికిల్)కు చేరుతుంది. అక్కడినుంచి ఊపిరితిత్తులకు చేరుకుని, శుద్ధి అవుతుంది. ఈ విధంగా తయారైన రక్తాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ధమనుల ద్వారా మంచి రక్తం శరీరానికంతా సరఫరా అవుతుంది.
ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్
గుండె కుడి కర్ణిక, ఎడమ కర్ణిక మధ్యలో ఉండే పొరను ‘ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్’ అంటారు. దీనిలో ఉత్పన్నమయ్యే లోపం వల్ల గుండెకు రంధ్రం పడటాన్ని ‘ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్’ అంటారు.
వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్
ఎడమ జఠరిక, కుడి జఠరిక మధ్య ఒక సెప్టమ్ ఉంటుంది. దీనిని ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటారు. దీనిలో రంధ్రం ఏర్పడటం వల్ల కలిగే లోపమే.. ‘వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్’.
పీడీఏ లోపం
ప్రతి శిశువు గుండెలోనూ పుట్టుకతోనే చిన్నపాటి రంధ్రం ఉంటుంది. జన్మించిన ఐదు రోజుల్లో అది పూడుకుపోతుంది. కానీ అరుదైన సందర్భాల్లో.. ఆ రంధ్రం అలానే ఉండిపోతుంది. దీన్నే పీడీఏ (పేటెంట్ డక్సస్ ఆర్టెరియోసస్) డిఫెక్ట్ అంటారు.
సాధారణంగా ఈ లోపం ఉన్న శిశువుల్లో ఆక్సిజన్ వినియోగం తక్కువగా ఉంటుంది. దీంతో రక్తం నీలం రంగులో ఉంటుంది. శరీరమూ నీలంగా మారుతుంది. సాధారణంగా చెడు రక్తం గుండె కుడివైపునకు వెళ్తుంది. అక్కడినుంచి ఊపిరితిత్తులోకి వెళ్లి శుద్ధి అవుతుంది. అనంతరం ఊపిరితిత్తుల్లో నుంచి గుండె ఎడమ భాగానికి చేరుతుంది. అయితే సైనటిక్ కన్జెనిటల్ లోపం ఉన్న శిశువుల్లో చెడు రక్తం కొంత మాత్రమే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మిగిలినదంతా శుద్ధి కాకుండానే ఎడమ వైపునకు వెళ్తుంది. ఈ అపరిశుభ్ర రక్తంలో ఆక్సిజన్ తక్కువగా, కార్బన్ డై ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. దీనివల్లే శిశువులు రంగు మారుతారు. ఈ రుగ్మత ఉన్న శిశువుల గుండెలో కొన్ని రకాల లోపాలు కనిపిస్తాయి.
అనామలస్ (టోటల్ అనామలస్ పల్మనరీ వీనస్ రిటర్న్) అనే వ్యవస్థ లోపం వల్ల శుద్ధి జరిగిన రక్తం ఎడమ గుండెకు వెళ్లకుండా మళ్లీ కుడి వైపునకే తిరిగి వస్తుంది. దీనివల్ల
శరీరానికి ఆక్సిజన్‌తో కూడిన రక్తం అందదు. ఫలితంగా.. అసలే లేత గుండె మరింత బలహీన పడుతుంది.
ఈ సమస్య ఉన్న శిశువులకు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కాకపోతే, ఇలాంటి లోపాలను గర్భస్థ దశలోనే ‘ఎకోకార్డియోగ్రఫీ’ ద్వారా గుర్తించవచ్చు. గర్భం దాల్చిన 18-24 వారాల్లో ఈ పరీక్ష చేయవచ్చు. ‘మన బిడ్డకే ఎందుకిలా జరుగుతున్నది?’ అని మథనపడి పోతుంటారు తల్లిదండ్రులు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయిప్పుడు. ఓపెన్ హార్ట్ సర్జరీలు కూడా సురక్షితంగా చేస్తున్నారు. హైపో ప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ రిపేర్, టోటల్ అనామలిస్ పల్మనరీ వీనర్ రిటర్న్ కరెక్షన్.. తదితర విధానాలు పసిబిడ్డలకు భరోసా కల్పిస్తున్నాయి. ఏ లోపాన్ని అయినా సమర్థంగా సరి చేస్తున్నారు. దాదాపు పాతికశాతం వ్యాధులకు బిడ్డ పుట్టిన నెలలలోపే సర్జరీ చేయాల్సి ఉంటుంది. శస్త్ర చికిత్స తర్వాత.. 90 శాతం పిల్లలు సాధారణ జీవనాన్ని కొనసాగిస్తారు.
ఇవీ కారణాలు కావచ్చు..
గర్భస్థ పిండానికి రుబెల్లా వైరస్ సోకడం వల్ల సమస్య మరింత తీవ్రం అవుతుంది. గుండె సమస్యలతోపాటు, పెరుగుదలలో ఆలస్యం, చెవుడు, వివిధ మానసిక సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
గర్భధారణ సమయంలో తల్లి ఆల్కహాల్, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఇలా జరుగవచ్చు.
బిడ్డ పొట్టలో ఉన్నప్పుడు తల్లి ఏదైనా ఇన్ఫెక్షన్కు గురికావడమూ ఓ కారణమే.
గర్భిణి అధిక బరువు, ఊబకాయం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా బిడ్డ గుండెకు గండాలు ఎదురుకావచ్చు.