Nutrition | ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అయితే కేవలం మంచి పదార్థాలు తినడం మాత్రమే కాకుండా, వాటిని ఎలా వండుతున్నాం, ఎలా తీసుకుంటున్నామన్నదీ చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే వారు కొన్ని సులభమైన కిచెన్ చిట్కాలను కూడా సూచించారు. ఇవి రోజువారీ ఆహారాన్ని మరింత పోషకవంతంగా మార్చడంలో సహాయపడతాయని, చిన్న మార్పులతోనే శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయని నిపుణులు వివరిస్తున్నారు. పోషకాహార నిపుణుల ప్రకారం వివిధ రకాల ఆహారాలను ఎలా తీసుకోవాలో వారు వివరిస్తున్నారు.
మొదటిగా బీట్రూట్ను ఉడికించడానికి బదులుగా ఆవిరితో వండడం మంచిది. ఇలా చేయడం వల్ల విటమిన్ సి, బి విటమిన్స్ వంటి నీటిలో కరిగే పోషకాలు సురక్షితంగా ఉంటాయి. అంతేకాకుండా ఆవిరితో వండిన బీట్రూట్ జీర్ణక్రియకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వంట పూర్తయ్యాక నిమ్మరసం కలపడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం వల్ల ఐరన్ శరీరానికి సులభంగా అందుతుంది. అలాగే అధిక వేడి వల్ల నశించే విటమిన్ సి కూడా కొంతవరకు నిల్వ ఉంటుంది. ఇది కూరల రుచిని పెంచడంతోపాటు ఉప్పు వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా కూరల్లో మిరియాల పొడిని చివర్లో చల్లడం వల్ల వాటిలోని పైపరిన్ అనే పదార్థం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
అలాగే వెల్లుల్లిని కోసిన వెంటనే వండకుండా ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి. గాలికి తగలడం వల్ల అలినేస్ అనే ఎంజైమ్ క్రియాశీలమవుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక పాలకూరను పూర్తిగా మరిగించకుండా తేలికగా ఆవిరితో వండడం మంచిది. ఇలా చేయడం వల్ల ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి సులభంగా అందుతాయి. అలాగే ఆక్సలేట్స్ తగ్గి కిడ్నీ స్టోన్స్ ప్రమాదం కూడా తగ్గుతుంది. టమాటాలను ఆరోగ్యకరమైన నూనెలో వండితే అందులోని లైకోపిన్ శరీరానికి బాగా అందుతుందని న్యూట్రిషనిస్ట్ లు పేర్కొంటున్నారు. ఈ యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడుతుంది. చిన్న చిన్న కిచెన్ మార్పులు కూడా పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను అందించగలవని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ వంటల్లో ఈ అలవాట్లు పాటిస్తే ఆహారం మరింత పోషకవంతంగా మారుతుందని సూచిస్తున్నారు.