నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం. శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనది. నిద్ర పౌరుల ప్రాథమిక హక్కు అని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అవసరానుగుణంగా నిద్ర, నిశ్శబ్దం, విశ్రాంతి ఆరోగ్య రీత్యా మానవులకు తప్పనిసరి అవసరమని, నిశ్శబ్దం బంగారం లాంటిదని కోర్టు వ్యాఖ్యానించింది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల (2003) ఫలితంగా 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు. ప్రతి ఏటా మార్చి నెల మూడో శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు.
నిద్ర వల్ల లాభాలు చూసుకుంటే మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నిద్ర ఇమ్యూనిటీని పెంచుతుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ సక్రమంగా జరుగుతుంది. నిద్ర తగ్గితే క్యాన్సర్‌తోపాటు వివిధ అరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. అయితే, నిద్రపోయే భంగిమలు కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
వెల్లకిలా పడుకోవడం
వెల్లకిలా పడుకోవడం వెన్నెముకకు మంచిది. గురుత్వాకర్షణ వల్ల శరీరం సమతలంగా ఉంచబడుతుంది.
ఈ పొజిషన్లో పడుకున్నప్పుడు మెడకింద మంచి నాణ్యమైన దిండును ఉంచుకోవాలి. మెడ వంపు అరటిపండును పోలి ఉంటే బెటర్. ఇలా పడుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, స్లీప్ ఆప్నియా లేదా వెన్ను సమస్యలు ఉన్నవారు ఈ భంగిమలో పడుకోకపోవడమే మంచిదని అంటున్నారు. ఈ రెండు సమస్యలతో బాధపడేవారు వెల్లకిలా పడుకుంటే మెడనొప్పులు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అలాగే, ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు రావు. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్.
పక్కకు తిరిగి పడుకోవడం
వెల్లకిలా పడుకోవడం ఇబ్బందిగా ఉన్నవారు ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి పడుకోవచ్చు. అయితే, ఇలా పడుకునేటప్పుడు చెవి రంధ్రాలు భుజానికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. గదవను కిందికి ఆనించి పడుకుంటే నొప్పి కలిగే అవకాశముంటుంది. కాగా, గుండె మంట, అసిడిటీ లాంటి సమస్యలున్నవాళ్లు ఎడమవైపుకు తిరిగి పడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎడమవైపునకు తిరిగి నిద్రిస్తే లివర్ పై భారం తగ్గుతుంది. కుడివైపు తిరిగి పడుకునేవారిలో నిద్రలేమి, అశాంతి లాంటివిచోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
పొట్టపై పడుకోవడం
తలను ఒక దిశలో కొంత సమయం పాటు తిప్పుతూ కడుపుపై పడుకోవడం వల్ల నొప్పి కలగుతుంది. వెన్నెముకను అణిచివేసేటప్పుడు కడుపుపై పడుకోవడం కూడా మెడను వెనుకకు విస్తరించవచ్చు. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. నరాలను కుదించగలదు. ఒకసారి ఈ భంగిమకు అలవాటుపడితే మానడం కష్టం. అయినప్పటికీ దీర్ఘకాలికంగా అలాగే పడుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.