B vitamins | సమతుల ఆహారం తీసుకోవాలని మన పెద్ద వాళ్లు చెప్తుంటారు. అంటే మన శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ లభించే ఆహారాలు. కొంచెం నీరసంగా అనిపించగానే ట్యాబ్లెట్లు వేసుకుంటాం. కానీ, ఆ నీరసం ఎందుకు వచ్చిందని ప్రశ్నించుకోం. మనం పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల ఆహారాలు తినేలా ప్లాన్ చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా విటమిన్ బీ ఫుడ్స్ ఉండటం చాలా అవసరం. బీ విటమిన్ ఆహారాలు నిత్యం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు.
బీ విటమిన్స్ 8 రకాలు .. బీ1, బీ2, బీ3, బీ5, బీ6, బీ7, బీ9, బీ12. ఇవి నీటిలో కరిగుతాయి. మన శరీరం వివిధ విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విటమిన్లు శక్తి ఉత్పత్తి, మెదడు పనితీరు, డీఎన్ఏ సింథసిస్, కణ జీవక్రియతో సహా అనేక రకాల ప్రక్రియల్లో పాల్గొంటాయి. శరీరానికి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో, రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, మానసిక స్థితి, జీవక్రియను నియంత్రించడంలో బీ విటమిన్లు సహాయపడతాయి. వాటి ప్రాధాన్యతను వివరంగా తెలుసుకుందాం.
శక్తిని ఉత్పత్తి చేయడంలో..
శక్తి ఉత్పత్తికి, గుండె, కండరాలు, నాడీ వ్యవస్థ సరైన పనితీరుకు బీ1 (థయామిన్) అవసరం. ఇది కార్బోహైడ్రేట్ల జీవక్రియలో కూడా పాల్గొంటుంది. ఇది మన ఆహారంలోని చక్కెరలను విడగొడ్తుంది. మెదడుకు కావాల్సిన రసాయనాలను అందిస్తుంది. ఫ్యాటీ ఆసిడ్స్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. హార్మోన్స్‌ని సింథసైజ్ చేస్తుంది. బీ 1 లోపం కారణంగా బరువు కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, గుండె సంబంధ సమస్యలు, కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. హోల్ గ్రెయిన్స్, రైస్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, నట్స్, బఠానీలు, కమలాపండు వంటివి తినడం ద్వారా బీ1 విటమిన్ పొందవచ్చు.
జీవక్రియను మెరుగుపర్చడంలో..
బీ 2 (రైబోఫ్లావిన్) శక్తి ఉత్పత్తి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల జీవక్రియలో పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, కళ్ళు, నాడీ వ్యవస్థను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. తీసుకున్న ఆహారంలో నుంచి ఫ్యాట్స్‌ను విడగొట్టి.. విటమిన్ బీ 6 ని శరీరానికి తగినట్లు మారుస్తుంది. బీ 2 లోపం కారణంగా నోటి పుండ్లు, పెదవుల వాపు, పగుళ్లు, జుట్టు ఊడటం, కళ్లు ఎర్రబడటం, స్కిన్ డిజార్డర్స్ కనిపిస్తాయి. ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటే ఎనీమియాకు దారితీయవచ్చు. ఓట్స్, పెరుగు, మజ్జిగ, పుట్టగొడుగులు, బాదం పప్పు, ఆకుకూరలు, పాలు, అవకాడోలలో బీ 2 విటమిన్ లభిస్తుంది.
నాడీ వ్యవస్థ పనితీరులో..
బీ 3 (నియాసిన్) శక్తి ఉత్పత్తి, డీఎన్ఏ సింథసిస్, నాడీ వ్యవస్థ పనితీరులో పాల్గొంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, నరాలు, జీర్ణవ్యవస్థను నిర్వహించడంలో సాయపడుతుంది. ఈ విటమిన్ మనం తీసుకునే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ని శరీరానికి కావల్సిన పద్ధతిలోకి మారుస్తుంది. మెటబాలిజంకు సహకరిస్తుంది. బీ 3 విటమిన్ లోపం కారణంగా ఎర్రగా మారిన నాలుక, వాంతులు, డయోరియా, కాన్స్టిపేషన్, తలనొప్పి, నీరసం, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. విటమిన్ బీ 3 ఎక్కువగా పప్పు ధాన్యాలు, హోల్ గ్రెయిన్స్, నట్స్, గ్రీన్ పీస్, అవకాడో, మష్రూంస్, బ్రౌన్ రైస్, వేరు శనగల్లో దొరుకుతుంది.
ఆర్‌బీసీల ఉత్పత్తిలో..
బీ 5 (పాంటోథెనిక్ యాసిడ్) శక్తి ఉత్పత్తి, హార్మోన్ సంశ్లేషణ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో ప్రొటీన్స్, ఫ్యాట్స్, కో-ఎంజైమ్స్లను క్రియేట్ చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఈ విటమిన్‌ను శరీరమంతా తీసుకెళ్తుంది. ఈ విటమిన్ లోపిస్తే కాళ్ళూ, చేతులూ మంటలూ, తిమ్మిరి, తలనొప్పి, చిరాకు, నిద్రలేమి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నివారణకు పొద్దుతిరుగుడు విత్తనాలు, అవకాడో, బంగాళా దుంపలు, బ్రోకలి, ఓట్స్, శనగలు, వేరు శనగలు ఎక్కువగా తింటూ ఉండాలి.
రోగనిరోధక వ్యవస్థలో..
బీ 6 (పిరిడాక్సిన్) ప్రోటీన్ జీవక్రియ, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి, నాడీ, రోగనిరోధక వ్యవస్థల పనితీరులో పాల్గొంటుంది. ఇది సెరోటోనిన్, నోర్పైన్ఫ్రైన్ వంటి హార్మోన్లు, న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిలో కూడా సాయపడుతుంది. మనం తినే ఆహారంలో నుంచి ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ విడగొడ్తుంది. మెదడు అభివృద్ధి చెందడానికి సహకరిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. బీ 6 విటమిన్ లోపం కారణంగా ఎనీమియా, పెదవులు పగలడం, నాలుక వాపు, ఇమ్యూన్ సిస్టం బలహీన పడడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ ఎక్కువగా శనగలు, బంగాళా దుంపలు, పాలకూర, సోయా బీన్స్, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, అల్లం, వెల్లుల్లి, బ్రౌన్ రైస్‌లలో దొరుకుతుంది.
మంచి జుట్టు, చర్మం, గోర్ల కోసం..
బీ 7 (బయోటిన్) శక్తి ఉత్పత్తి, కొవ్వు జీవక్రియతోపాటు కొవ్వు ఆమ్లాలు, గ్లూకోజ్ సింథెసిస్లో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోర్లకు అండగా ఉంటుంది. డీఎన్ఏను రెగ్యులేట్ చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో నుంచి ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ విడగొడుతుంది. బీ 7 విటమిన్ లోపం కారణంగా జుట్టు పల్చబడడం, గోళ్ళు పెళుసుగా తయారవడం, నీరసం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ ఎక్కువగా పొద్దుతిరుగుడు విత్తనాలు, అరటి పండు, అవకాడో, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, పాలు, వేరు శనగ పప్పుల్లో లభిస్తుంది.
డీఎన్ఏ సింథెసిస్లో..
డీఎన్ఏ సింథెసిస్తోపాటు కణ విభజన, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బీ 9 (ఫోలిక్ యాసిడ్) అవసరం. ఇది గుండె జబ్బులకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే హోమోసిస్టీన్ స్థాయిల నియంత్రణలో కూడా పాల్గొంటుంది. విటమిన్స్, ఎమైనో యాసిడ్స్ మెటబాలిజంకు తోడ్పడుతుంది. కణ విభజన సక్రమంగా జరిగేలా చూస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే తలనొప్పి, నీరసం, చిరాకు, నోటి పుండు రావడం చూడొచ్చు. చర్మం, జుట్టు, గోర్లలో మార్పులు వస్తాయి. ఈ విటమిన్ ఎక్కువగా మనకు ఆకుకూరలు, అవకాడో, బొప్పాయి, ఆరెంజ్ జ్యూస్, బీన్స్, నట్స్, సోయా బీన్స్, రాజ్మా, కాప్సికం, బీట్రూట్లలో దొరుకుతుంది.
హోమోసిస్టీన్ జీవక్రియలో..
బీ 12 (కోబాలమిన్) ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, డీఎన్ఏ సింథెసిస్, నాడీ వ్యవస్థ పనితీరులో పాల్గొంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడంలో సాయపడుతుంది, హోమోసిస్టీన్ జీవక్రియకు ఇది అవసరం. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తయ్యేలా చేస్తుంది. మెదడూ, నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే మలబద్దకం. ఆకలి లేకపోవడం, కాళ్ళూ, చేతులూ తిమ్మిర్లు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, నీరసం వంటి సమస్యలు కలుగుతాయి. వీటి నివారణకు పాలు, మజ్జిగ, పెరుగు, పన్నీర్, ఛీజ్, బటర్, న్యూట్రిషనల్ యీస్ట్, ఫోర్టిఫైడ్ ఆల్మండ్ మిల్క్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.