Bone Marrow Transplantation | రక్త క్యాన్సర్‌కు బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎముక మూలుగ మార్పిడి) లాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల, రోగులు పూర్తిగా కోలుకుని సాధారణ జీవితం గడపటం సాధ్యమేనని వైద్యులు భరోసా ఇస్తున్నారు. రక్త క్యాన్సర్‌తోపాటు లింఫోమా, మల్టిపుల్ మైలోమా వ్యాధిగ్రస్తులకు కూడా బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కొత్త జీవితాన్ని ఇస్తున్నది.
మన శరీరంలోని ఎముకల్లో పోగైన కొవ్వుతో కూడిన స్పాంజిలాంటి పదార్థమే.. ఎముక మూలుగ. ఇందులో పరిపక్వత చెందని కణాలు, మూలకణాలు (స్టెమ్ సెల్స్) ఉంటాయి. ఇవి జీవితకాలంపాటు మూలకణాలుగానే ఉండిపోతాయి. అలానే ఎర్రరక్త కణాలు (ఆర్బీసీ), తెల్లరక్త కణాలు (డబ్ల్యూబీసీ), రక్త ఫలకికలు (ప్లేట్లెట్స్)గా వృద్ధి చెందుతాయి కూడా. రక్తంలోని ఎర్రరక్త కణాలే శరీరంలో అన్ని అవయవాలు, వాటిలోని కణాలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. తెల్లరక్త కణాలు శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మక్రిములతో పోరాడి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. రక్త ఫలకికలు అనేవి, ఒంటికి గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడంలో తోడ్పడతాయి.
అంటువ్యాధులు, కీమోథెరపీ, వివిధ రకాల తీవ్ర రుగ్మతల కారణంగా దెబ్బతిన్న మూలుగను తొలగించి, ఆ స్థానంలో ఆరోగ్యకర మూలకణాలను ప్రవేశపెట్టడమే.. ఎముక మూలుగ మార్పిడి. ఈ కణాలు ఎముకలోని మూలుగ స్థానంలో స్థిరపడిపోయి రక్తకణాలను ఉత్పత్తి చేయటంతోపాటు, కొత్త ఎముక మూలుగ అభివృద్ధికి తోడ్పడతాయి. మూలకణాలు ప్రవేశ పెట్టడమే ఇక్కడ ప్రధాన ప్రక్రియ కావటం వల్ల బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ‘మూలకణ మార్పిడి శస్త్ర చికిత్స’ అని కూడా అంటారు.
ఈ ప్రక్రియకు కావలసిన ఆరోగ్యకర మూలకణాలను దాత నుంచి సేకరించవచ్చు. కొన్ని సందర్భాల్లో రోగి నుంచి ముందుగానే సేకరించి, భద్రపరిచి ఆ తర్వాత వాడుకుంటారు. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, రేడియేషన్ ప్రారంభించడానికి ముందు ఆ వ్యక్తి ఎముకల నుంచి మూలకణాలను సేకరించి కూడా వృద్ధి చేస్తారు. రేడియేషన్, కీమోథెరపీ పూర్తయ్యాక ఎముక మూలుగ మార్పిడి చేపడతారు.
మార్పిడి కారణాన్ని బట్టి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మూడు రకాలు ఉంటాయి. ఆటోలోగస్ లేదా రెస్క్యూ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదటిది. రెండోది, అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్. మూడో పద్ధతి, అంబ్లికల్ కార్డ్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్. రెస్క్యూ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో రోగికి సొంత మూలకణాలతోనే చికిత్స చేస్తారు. దీనికోసం ముందుగానే ఆ వ్యక్తి ఎముకల నుంచి మూలకణాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిని బయట అభివృద్ధి చేసి మార్పిడికి సిద్ధం చేస్తారు.
రేడియేషన్, కీమోథెరపీ పూర్తయిన తర్వాత.. అచ్చంగా వాటితోనే ఆ వ్యక్తికి ఎముక మూలుగ మార్పిడి చేస్తారు. అంటే, రోగి మూలకణాలే తిరిగి అతడిని చేరుకుంటాయి. కాకపోతే, ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే.. రోగి ఎముక మూలుగ ఆరోగ్యంగా ఉండాలి. అతను చికిత్సకు వచ్చినప్పుడే, వైద్యులు దూరదృష్టితో మూలకణాలను ముందుగానే సేకరించి ఉండాలి. కీమో, రేడియేషన్ కొనసాగినంత కాలం వాటిని బయట అభివృద్ధి పరచాలి. ఇలా చేస్తేనే మూలకణాల మార్పిడిలో సమస్య ఉండదు.
అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇందుకు పూర్తి భిన్నమైంది. రెస్క్యూ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వీలుకాని పరిస్థితుల్లో మరో వ్యక్తి నుంచి సేకరించిన మూలకణాలతో చికిత్స చేయాల్సి వస్తుంది. అలా, దాత నుంచి తీసుకున్న మూలకణాలతో చేసిన ఎముక మూలుగ మార్పిడిని అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఇందులో మూలకణాలు స్వీకరించే వ్యక్తికి దాత జన్యుపరంగా సంబంధీకులై ఉండాలి. కాబట్టే, చాలా సందర్భాల్లో కుటుంబసభ్యులే దాతలుగా వ్యవహరిస్తారు. ఒక్కోసారి జన్యుపరంగా సరిపడే బయటి వ్యక్తులు కూడా చికిత్సకు ఉపయోగపడతారు. రోగి ఎముక మూలుగ బాగా చెడిపోయి, ఇక ఏమాత్రమూ పనికి రానప్పుడు అల్లోజెనిక్ పద్ధతి తప్పక ఆదుకుంటుంది. అయితే, దీనిలో జీవీహెచ్డీ (గ్రాఫ్ట్ వైరస్ హోస్ట్ డిసీజ్) వంటి కొన్ని సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. అదే సమయంలో, మార్పిడి ద్వారా దాత నుంచి వచ్చిన మూలకణాలను స్వీకర్త శరీరం తిరస్కరించకుండా ఇమ్యునో సప్రెసివ్ మందులు ఇస్తారు.
కొంతమందిలో ఎముక మూలుగ రక్తకణాలను ఉత్పత్తి చేయటంలో విఫలమవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘ఎప్లాస్టిక్ ఎనీమియా’ అంటారు. వీరిలో మళ్లీ సహజంగా రక్తకణాల ఉత్పత్తి జరగాలంటే మూలకణ మార్పిడే మార్గం. అలానే లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి క్యాన్సర్లు ఉన్నప్పుడు, కీమోథెరపీ వల్ల ఎముక మూలుగ పుర్తిగా దెబ్బతిన్నప్పుడు కూడా మూలకణ మార్పిడి అనివార్యం. అయితే, చాలావరకు రేడియేషన్, కీమోథెరపీ తర్వాతే మూలకణాల మార్పిడి జరుగుతుంది.
రోగులకు ప్రాణభిక్ష పెట్టే అల్లోజెనిక్ మూలకణ మార్పిడి చికిత్స కొన్ని ప్రతికూల ప్రభావాల కారణంగా వైద్యరంగానికి సవాలు విసురుతున్నది. ఈ చికిత్స వల్ల బీపీ తగ్గటం, వికారంగా అనిపించటం, చలితో కూడిన వణుకు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఇవన్నీ స్వల్పకాలిక సమస్యలే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ విధానం విజయవంతం కావడం అనేది దాత మూలకణాలు, స్వీకర్త మూలకణాలతో సరిపడటం మీద ఆధారపడి ఉంటుంది.
అంబ్లికల్ కార్డ్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటిదే. ఈ పద్ధతిలో, అప్పుడే పుట్టిన శిశువు బొడ్డుతాడు (అంబ్లికల్ కార్డ్) నుంచి మూలకణాలను సేకరిస్తారు. వాటిని అతిశీతల వాతావరణంలో నిల్వచేస్తారు. ట్లాన్స్ప్లాంటేషన్ అవసరమైనపుడు బయటికి తీసి ఉపయోగిస్తారు. దీనిలోని రక్తకణాలు అపరి పక్వమైనవి. మూలకణ మార్పిడికి అనుకూలమైనవి కూడా. అయితే, మూలకణాలు తక్కువగా ఉండటం వల్ల స్వీకర్త పూర్తిగా కోలుకోవడానికి కొంత ఎక్కువ సమయమే పడుతుంది.
ఇందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో తొడ, తుంటి ఎముకల నుంచి నేరుగా మూలకణాలను తీసుకుంటారు. దీనికోసం రోగికి నొప్పి తెలియకుండా మత్తుమందు ఇస్తారు. బలంగా ఉన్న పొడవాటి సూదితో మూలకణాలను సేకరిస్తారు. రెండో పద్ధతిని మూలకణ దాత నుంచి సేకరించే సందర్భంలో ఉపయోగిస్తారు. ఇందులో దాతకు అయిదు ఇంజెక్షన్లు ఇస్తారు. దాంతో ఎముకల్లోని మూలకణాలు రక్త ప్రవాహంలోకి వస్తాయి. అప్పుడు సిరల్లోంచి రక్తాన్ని తీసుకుంటారు. ఆధునిక యంత్రం సాయంతో ఆ రక్తంలోని తెల్లరక్త కణాలను వేరుచేసి సేకరిస్తారు. వాటితోపాటే మూలకణాలు ఉంటాయి. ఇక ఎముక మూలుగ మార్పిడికి ముందు కొన్ని నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
క్యాన్సర్ రోగిలో ఎలాంటి ఎముక మూలుగ ఉందో కచ్చితంగా తెలుసుకుంటారు. రేడియేషన్ లేదా కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ సోకిన ఎముక మూలుగ కణాలను పూర్తిగా నిర్మూలిస్తారు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తికావడానికి వారం రోజులు పడుతుంది. చికిత్స సమయంలో రోగ నిరోధక వ్యవస్థ కొంచెం బలహీనపడుతుంది. తేలికగా అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. అందువల్లే, ప్రత్యేక విభాగంలో ఉంచి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తారు. ఆ తర్వాత కూడా దాదాపు నెల రోజులపాటు రోగికి వైద్యుల పర్యవేక్షణ అవసరం అవుతుంది.
మూలకణ మార్పిడి ప్రక్రియను సాధారణంగా ఈ రంగంలో పేరున్న వైద్యకేంద్రాల్లోనే చేపడతారు. ట్లాన్స్ప్లాంటేషన్ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు, ఆ తర్వాత కూడా రోగిని అత్యంత సురక్షిత వాతావరణంలో ఉంచాల్సి ఉంటుంది. వేగంగా కోలుకునేట్టు చేయగల ఉత్తమ వసతులూ అవసరం. ఓ వ్యక్తి మూలకణ మార్పిడికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత, దానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రక్రియ దాదాపుగా రక్తం ఎక్కించటం లానే ఉంటుంది. అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సమయంలో దాత నుంచి సేకరించిన మూలకణాలను అభివృద్ధి చేసి.. మార్పిడికి ఒకటిరెండు రోజుల ముందే సిద్ధంగా ఉంచుకుంటారు. సెంట్రల్ వీనస్ కాథటర్ అనే సూదిని ఛాతీపై కుడివైపు గుచ్చుతారు. మూలకణ మార్పిడి కొద్దిరోజుల పాటు సాగే ప్రక్రియ కావటం వల్ల ఈ సూదిని ఓ వారం రోజుల వరకు అలానే ఉంచుతారు.
ఆరోగ్యకరమైన కొత్త మూలకణాలను దీనిద్వారా గుండెలోకి ప్రవేశపెడతారు. ఆ మూలకణాలు అక్కడినుంచి ఎముక మూలుగ సహా శరీరం అంతటికీ వ్యాపిస్తాయి. బోన్‌మారోలో స్థిరపడిన మూలకణాలు క్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఈ విధంగా దాదాపు వారం రోజుల్లో పలుమార్లు మూలకణాలను ప్రవేశపెట్టడం వల్ల అవి కొత్తవ్యక్తి శరీరంతో సర్దుబాటు చేసుకుని, అభివృద్ధి చెందడానికి వీలుకలుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను ఎన్గ్రాఫ్ట్మెంట్ అంటారు. ఎముక మూలుగ మార్పిడి సమయంలో ఇతర మందులు ఇవ్వటానికి, అవసరమైతే రక్తం ఎక్కించటానికి, కొత్త మూలకణాలను శరీరం తిరస్కరించకుండా చూడటానికి ఇమ్యునో సప్రెసెంట్లను శరీరంలోకి ప్రవేశపెట్టడానికి కూడా ఛాతీమీద అమర్చిన కాథటర్ ఉపయోగపడుతుంది.
ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత, వైద్యులు కొంతకాలం పాటు రోగి ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అసాధారణమైన మార్పులు కనిపిస్తే కనుక తక్షణం అప్రమత్తం అవుతారు. మార్పిడి తర్వాత పది నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు నిపుణుల పర్యవేక్షణ కొనసాగుతుంది. మూలకణ మార్పిడి తర్వాత కనిపించే మొట్టమొదటి మార్పు రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య భారీగా పెరగడం. శరీర రక్షణ వ్యవస్థలో భాగమైన తెల్లరక్త కణాల ఉత్పత్తి జరగడం అనేది.. ట్రాన్స్‌ప్లాంటేషన్ పని మొదలు పెట్టింది అనడానికి పెద్ద నిదర్శనం.
సాధారణంగా మూలకణ మార్పిడి ప్రక్రియ నుంచి రోగి ఓ మోస్తరుగా కోలుకోవడానికి మూడు నెలలు, పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పడుతుంది. దాత, స్వీకర్త కణాల మధ్య సహజ సయోధ్య ఏర్పడటం మీద ఈ ప్రక్రియ జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఆపైన రేడియేషన్, కీమోథెరపీ, ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన భాగం.. తదితర అంశాల ప్రభావమూ ఉంటుంది. మొత్తానికి, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రోగి జీవితకాలం మీద తీవ్ర ప్రభావం చూపే అంశం. కాబట్టి, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, అనుభవజ్ఞులైన నిపుణులు ఉన్న వైద్య సంస్థలనే ఎంచుకోవాలి. రాజీపడితే.. జీవన నాణ్యత విషయంలోనూ రాజీ తప్పదు.
– డాక్టర్ గణేష్ జైషెట్వార్
సీనియర్ హెమటో-ఆంకాలజిస్ట్
బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్.