చీకట్లో నీ మనసు జ్యోతివట్టి
వెలుగు రవ్వల్లో మేధస్సు సానవెట్టి
అక్షరాలకు ఆయువు పోస్తేనే
కొండచిలువలాంటి రహదారి కూడా
ఆకుపచ్చని పువ్వుల పరిమళమై
స్వాగతం పలుకతది..
మనసు ఒక్కచోట
తనువు ఒక్కచోట పెట్టి
ఖాళీ హృదయంతో ముందుకు సాగితే
చెప్పలేనంత పెనుభారమే!
అందుకోలేనంత విశ్వమై
దరికి చేరలేనంత పడవ ప్రయాణమే !!
అంతర్లోచన మొక్కకు
రోజు నీళ్ళ భోజనం వడ్డిస్తేనే
రేపు విస్తరాకుల్లా పెరిగి
భవిష్యత్ తరాలకు జ్ఞానబోధి
వృక్షంగా నిలుస్తది
అనంతమైన అక్షరాల సాధనలో
అనునిత్య ఉద్విగ్న బోధనలో
నిశ్శబ్దపు ఖాళీ ఆకలిని నింపే
అపారమైన అమృత సంజీవని
నిత్యాన్వేషణపు అక్షర వెలుగు
నేర్చుకొన్న కొద్దీ విశాలంగా
దాచుకున్న కొద్దీ అమృతంగా
సముద్రమంతా తోడేసిన
ఒడిసి పట్టలేని స్వచ్ఛమైన నీటిబొట్టును
ఒడ్డున ఉన్న బిందెలో నింపే
తేలికైన ఆణిముత్యాల గని అక్షరం
హృదయవాకిట్లో కల్లాపి జల్లి
అక్షరాల ముగ్గులను వేసిన
అజ్ఞానాంధకార గాలులు వీచిన
అగాధపు అటుపోట్లూ దరిచేరిన
కష్టంతో కలల దారిని వెతకాలి
శోధన చేసి సాధించాలి
ఇష్టంతో మనసు వెట్టి నేర్చుకొన్న విద్య
ఎల్లప్పుడూ నిత్య సత్యమై
అనంతమైన అక్షర వెలుగులు
భవిష్యత్తు ఫలాలను అందిస్తాయి
నవసమాజ దృష్టిలో
నిన్నే ఉదాహరణగా చూపెడుతాయి
డాక్టర్ పగిడిపల్లి సురేందర్: 8074846063